కోవిడ్ – 19 సంజీవిని బస్ లోపలి బాగం
సాక్షి, అమలాపురం: కరోనా పాజిటివ్.. ఈ పదం వింటేనే చాలామందిలో వణుకు మొదలవుతుంది. అలాంటిది పరీక్షకు శాంపిల్స్ ఇచ్చాక ఫలితాల కోసం రెండు మూడు రోజుల నిరీక్షణంటే.. క్షణమొక యుగంగా గడుస్తూ.. ప్రాణభీతి వెంటాడుతుంటే.. అమ్మో.. భరించలేరు. ఏదైనా జరగొచ్చు.. చివరికి ప్రాణం కూడా తీసుకోవచ్చు. రోజులు ఇలా గడుస్తుండగా వచ్చింది సంజీవిని. ఆలోచించి పెట్టినా.. కాకతాళీయంగా పెట్టినా ‘సంజీవిని’ ఎందరి ప్రాణాలనో నిలబెడుతోంది. ఇలా శాంపిల్స్ ఇస్తే పావుగంటలో ఫలితం చెప్పేస్తోంది. దీంతో ప్రజలు సైతం అధిక సంఖ్యలో ‘సంజీవిని’ సంచార ల్యాబ్‌కు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
ర్యాపిడ్ యాంటీ టెస్ట్ కిట్‌లను బస్సుల ద్వారా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురావడంతో నిన్నటి వరకూ పదుల లెక్కలో తేలుతున్న పాజిటివ్ కేసులు నేడు వందల సంఖ్యలో బయటపడుతున్నాయి. అయితే వేగవంతమైన ఈ పరీక్షలు, ఫలితాల వల్ల పెరుగుతున్న రోగులను ఒకేసారి ఆస్పత్రులకు తీసుకువెళ్లి అత్యవసర వైద్యం అందించడం కొంచెం కష్టతరమవుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం జిల్లాకు వచ్చిన మూడు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ల బస్సుల్లో ర్యాపిడ్ టెస్ట్‌లను తాత్కాలికంగా రెండు రోజుల పాటు నిలిపివేశారు. ఈ బస్సుల ద్వారా ర్యాపిడ్ టెస్ట్‌లను సోమవారం నుంచి తిరిగి మొదలు పెట్టనున్నారు.
మొబైల్ ల్యాబ్ టెస్టింగ్ బస్సు వెలుపల పరీక్షల కోసం నిలబడ్డ అనుమానితులు
బస్సుల్లో ర్యాపిడ్ టెస్ట్‌లు సాగేదిలా
రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్ట్‌లు వేగిరం చేసేందుకు ఆరీ్టసీకి చెందిన ఇంద్ర హైటెక్ బస్సులను కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్‌లకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్ ద్వారా మార్పులు చేపట్టింది. ఒక్కో బస్సు లోపల దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వెచ్చించి ఒకేసారి పది మందికి ర్యాపిడ్ టెస్ట్‌లు చేసేలా రూపకల్పన చేశారు. బస్సులో పూర్తి ఏసీ సౌకర్యంతో పాటు పది కౌంటర్లు ఉంటాయి. బస్సు అద్దాలకు మనిషి చేయి దూరేంత రంధ్రం ఏర్పాటు చేశారు. బస్సులోని ఒక్కో కౌంటర్ వద్ద ఒక డాక్టర్, ఒక టెక్నీíÙయన్ ఉంటారు. బస్సు బయట అద్దాలకు ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా పరీక్ష చేయించుకునే వ్యక్తి తల ఎత్తుకు అందేలా ర్యాంప్‌ల ఏర్పాటుచేశారు. కౌంటర్ల వద్ద ఉన్న డాక్టర్లు బస్సు బయట ఉన్న వ్యక్తి ముక్కులోంచి పరికరం పంపించి శాంపిల్స్ సేకరిస్తారు. అలా తీసిన శాంపిల్‌ను అక్కడికక్కడే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్‌తో పరీక్షిస్తారు.
ఈ ప్రక్రియ అంతా 15 నిమిషాల్లో పూర్తవుతుంది. బస్సులో ఉన్న పది కౌంటర్ల నుంచి ఒకేసారి పది పరీక్షలు, ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆ బస్సు ద్వారా రోజుకు వెయ్యి వరకూ పరీక్షలు చేసే సామర్ధ్యంతో కూడిన సాంకేతిక సౌకర్యాలు కల్పించారు. తక్కువ సమయంలో ఎక్కువ పరీక్షలు చేసి ఫలితాలు ఇస్తుండడంతో జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డివిజన్లకు కేటాయించిన మూడు ముబైల్ ర్యాపిడ్ టెస్టింగ్ ల్యాబ్‌లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే దాకా ఈ బస్సుల ద్వారా గత మూడు రోజుల్లో వేలాది టెస్ట్‌లు చేశారు. దీంతో రోజుకు వందకు మించి లేదా వంద లోపు ఉండే పాజటివ్ కేసుల సంఖ్యం ఈ బస్సులు వచ్చాక వందల్లోకి పెరిగింది. (కొత్తగా 38,902 కేసులు, 543 మంది మృతి)
సంజీవినిలో పరీక్షలు చేయించుకునేందుకు అమలాపురం టీటీడీ కళ్యాణ మండపం వద్ద వేచి ఉన్న ప్రజలు (ఫైల్)
2000 పరీక్షల్లో 120 పాజిటివ్
అమలాపురం డివిజన్‌కు సంబంధించిన మొబైల్ కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ ల్యాబ్ బస్సు ద్వారా మూడు రోజుల్లో దాదాపు 2000 పరీక్షలు చేయగా వాటిలో 120 వరకూ పాజిటివ్ వచ్చాయి. ఈ మొబైల్ ర్యాపిడ్ టెస్టింగ్ వల్ల పరీక్షలు, వాటి ఫలితాలు అత్యంత వేగంగా ఉంటాయి. ఈ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే అదే చివరి ప్రామాణికంగా ఆ రోగికి వైద్య పక్రియ మొదలు పెడతారు. అదే పరీక్ష చేయించుకున్న వ్యక్తికి నెగెటివ్ వచ్చి కొన్ని వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే ఆ టెస్ట్ పూర్తి నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కు పంపిస్తున్నాం. – డాక్టర్ సీహెచ్ పుష్కరరరావు, అడిషనల్ డీఎం అండ్ హెచ్‌వో, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment