సాక్షి, తుని: తింటే గారెలే తినాలి అంటారు కానీ.. ఆ కోవలో తుని మామిడి పండ్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని రుచి తుని ప్రాంతంలో పండే మామిడి పండ్లకు ఉంది. 1947కు ముందు నుంచీ మామిడికి తుని ప్రసిద్ధి. తుని పట్టణానికి ఏకంగా “మ్యాంగో సిటీ’ అనే పేరు కూడా ఉంది. తుని డిపో ఆర్టీసీ బస్సులపై ఈ డిపో పేరు రాసినప్పుడు పక్కనే మామిడికాయల బొమ్మలు కూడా ఉండేవంటే.. ఇక్కడి మామిడి ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తునిలో ప్రారంభమైన ఓ జ్యూయలరీ సంస్థ సైతం “మ్యాంగో సిటీ’గా ప్రచారం చేసుకోవడం విశేషం. ఇక్కడి రైతులు మూడు తరాలుగా ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రెండేళ్లుగా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. తుని సబ్ డివిజన్‌లో మామిడి విస్తీర్ణం 1,700 హెక్టార్లుగా ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణరేఖ, పంచదార కల్తీ, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లకు ఎంతో డిమాండ్. ఏటా తుని ప్రాంతం నుంచి 60 వేల టన్నుల పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం తుని కేంద్రంగా ఏటా రూ.20 కోట్ల మేర మామిడి వ్యాపారం జరుగుతోంది.
రవాణా సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని సమయంలో ఇక్కడి రైతులు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు రైళ్ల ద్వారా మామిడి ఎగుమతులు చేసేవారు. క్రమేపీ లారీ రవాణా అందుబాటులోకి రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేస్తూ ఇక్కడి వ్యాపారులు ఆదాయం పెంచుకుంటున్నారు. ఇక ఉద్యాన శాఖ విదేశాలకు ఎగుమతి చేయడానికి 3,500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది.
మూడు తరాలుగా ఎగుమతులు
మా తాత, నాన్న పప్పు సూర్యారావు నుంచి 80 ఏళ్లుగా మామిడి ఎగుమతులు చేస్తున్నాం. రైతుల నుంచి తోటలు కొని పక్వానికి వచ్చిన పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. తొలి రోజుల్లో వెదురు బుట్టల్లో ప్యాకింగ్ చేసి రైళ్లలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తుని మామిడికి ఎంతో డిమాండ్ ఉంది. వేసవి సీజన్‌లో ఎన్ని పనులున్నా మామిడి ఎగుమతులు ఆపలేదు. ఉద్యాన అధికారులు సహకరించడంతో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కలిగింది.
– పప్పు వెంకట రమణ, వ్యాపారి, వెంకటాపురం
నేల స్వభావంతో మంచి రుచి
తుని ప్రాంతంలో ఇసుక, గరప (గ్రావెల్) నేలలు కావడంతో ఇక్కడి మామిడి పండు రంగు ఎంతో బాగుంటుంది. రుచి కూడా చాలా మధురంగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు తుని మామిడి పండ్లు రుచి చూడాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో మంచి రంగు ఉంటుంది. ప్రస్తుతం మేలు రకం పండ్ల ధర టన్నుకు రూ.75 వేలు పలుకుతోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశాం.
– విజయలక్ష్మి, ఉద్యాన అధికారి, తుని
Comments
Please login to add a commentAdd a comment