
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ బ్యాంక్‌పేటలో రెడ్‌జోన్ ఎత్తివేస్తూ.. నేటి నుంచి ఆరంజ్‌జోన్‌గా కొనసాగుతుందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్ జోన్‌లోకి రావడానికి సహకరించిన ప్రజలకు, దాతలకు, కరోనా సేవల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ సిటీలో 34 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే కొండబాబు, అతని అనుచరులు అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని ఆయన మండిపడ్డారు. దుమ్ములపేటలో పోర్టు భూముల నుంచి సేకరించిన స్థలాల్లో మడఅడవులు ఉన్నాయాని అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. అవి అటవీశాఖ భూములు కావని, మత్స్య సంపదకు నష్టం కలగదని అధికారులు ఇచ్చిన పత్రాలను ద్వారంపూడి మీడియాకు విడుదల చేశారు.(శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తి: సీఎం జగన్)
ఆటంకాలు సృష్టించాలని చూస్తే లబ్దిదారులతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. వక్రబుద్ధితో టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయిస్తున్నారని ద్వారంపూడి దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడం టీడీపీ ఇష్టం ఉండదని ఆయన మండిపడ్డారు. కాకినాడలో 34 వేల మంది లబ్దిదారులకు జూన్ 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కచ్చితంగా ఇళ్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.
త్వరలోనే మాజీ ఎమ్మెల్యే కొండబాబు భూ కబ్జాలు, అక్రమాలు సాక్షాధారాలతో సహ బయటపెడతానని తెలిపారు. ఇప్పటికే 15 ఎకరాల కబ్జా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారిని కూడా సస్పెండ్ చేసిందని ఆయన అన్నారు. జగన్నాధపురంలో క్రైస్తవుల శ్మశానవాటికకు ఇచ్చిన 5 ఎకరాల భూమిపై కూడా కొండబాబు కోర్టుకు వెళ్లిఅడ్డుకుంటున్నారని ద్వారంపూడి మండిపడ్డారు.