Green Zone
-
111 జీవో రద్దు ఓకే.. వాట్ నెక్ట్స్..?
హైదరాబాద్ మహానగర శివారులోని గ్రామాలకు ట్రిపుల్ వన్ ట్రబుల్స్ ఇక తప్పినట్టేనా? కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి?. 84 గ్రామాలకు 111 జీవో నుంచి విముక్తి దొరికినట్టేనా ? జంట జలాశయలా పరిరక్షణకు కొత్త రూల్స్ ఎలా ఫామ్ చేయబోతున్నారు ? లోకల్ పబ్లిక్‌లో ఉన్న అనుమానాలేంటీ ? HMDA రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి ? రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 84 గ్రామాల ప్రజలు జీవో 111తో రెండు దశాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్ ట్రిపుల్ వన్ జీవో రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోద ముద్ర వేశారు. దీంతో జీవో పరిధిలోని గ్రామాల్లో సంబరాలు, సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేశారు. అంత వరకు ఓకే.. కానీ.. స్థానిక ప్రజలను అనేక అనుమానాలు వేధిస్తున్నాయి. జీవో ఎత్తివేసిన తర్వాత అనుమతులు ఎలా ఇస్తారు? గ్రీన్ జోన్ పరిధిలో ఏయే గ్రామాలను ఎంపిక చేస్తారు? గ్రీన్ జోన్ పరిధిని ఏ ప్రాతిపాదికన నిర్ణయిస్తారు? జంట జలాశయాలపైన ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు జలాశయాల్లో కలవకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అక్రమంగా లే అవుట్లు వెలిశాయి. వాటికి అనుమతులు ఎలా ఇస్తారు? ట్రిపుల్ వన్ జీవో రద్దు తర్వాత.. కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని గ్రీన్ జోన్‌గా నిర్ధారించే అవకాశాలున్నాయి. గ్రీన్ జోన్లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతించే అవకాశం లేదు. ఇక మురుగునీరు జంటజలాశయాల్లో కలవకుండా 11 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. గండిపేట జలాశయం చుట్టూ 5, హిమాయత్ సాగర్ జలాశయం చుట్టూ 6 ఎస్టీపీలు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జంట జలాశయాల పరిరక్షణపై పర్యావరణ వేత్తలు ఆందోళణ చెందాల్సిన పనిలేదని మాత్రం చెబుతున్నారు లోకల్ ఎంపీ రంజిత్ రెడ్డి చెబుతున్నారు. చదవండి: Telangana University: రిజిస్ట్రార్ నియామకంలో మళ్లీ వివాదం ఇక మొయినాబాద్, శంకర్ పల్లి, శంషాబాద్ మండలాల్లో ఇప్పటికే చాలా వరకు HMDA అనుమతులు లేకుండా అక్రమ లే అవుట్లు భారీగా వెలిశాయి. వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. HMDA పరిధిలో దాదాపుగా పది వేల ఎకరాల్లో అక్రమ వెంచర్లు వెలిసినట్లు ప్రాథమిక అంచనా. 111 జీవో నేపథ్యంలో ఆ ప్లాట్లను ఇన్నాళ్లు నిషేధిత జాబితాలో ఉంచారు. వాటికి సంబంధించి నోటరీతో ఇన్నాళ్లు సరిపెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేయలేదు. జీవో రద్దు ప్రకటన తర్వాత. విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. చదవండి: ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట అయితే గ్రామాల్లో తమ భూములు అమ్ముకోకుండా ఉన్న కొద్ది పాటి రైతులు మాత్రం జీవో రద్దుతో తమ భూములకు విలువ పెరుగుతుందని సంబరపడుతున్నారు. మొత్తంగా జీవో 111 రద్దు పరిధిలో HMDA కనీసం ఒక్క లేఅవుట్‌కు అధికారికంగా అనుమతి ఇచ్చే వరకు ఇక్కడ ప్రాంతవాసుల్లో అనుమానాలు మాత్రం క్లియర్ అయ్యేలా కనిపించని పరిస్థితి నెలకొంది. -
పొల్యూషన్ మళ్లీ పరేషాన్
సాక్షి,హైదరాబాద్: మళ్లీ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. రెండునెలల కాలంలో సాధించిన ఫలితాలు కేవలం రెండ్రోజుల్లోనే నష్టపోయి మునుపటిస్థాయికి చేరుకుంటోంది. ప్రస్తుతం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు రంగాల కార్యకలాపాలు మొదలుకావడం, రెడ్‌జోన్‌లో లాక్డౌన్ సడలింపులతో ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి రావడంతో పాటు, దుమ్ము, ధూళి కణాల విస్తరణ, ఎండ వేడిమి పెరగడం వంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాలినాణ్యత ఒక్కసారిగా పడిపోయింది. దాదాపు 60 రోజులుగా లాక్డౌన్ కారణంగా స్వచ్ఛమైనగాలి పీల్చుకుంటున్న ప్రజలు మళ్లీ వాయు కాలుష్యాన్ని పీల్చుకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. సడలింపులతో తగ్గిన వాయునాణ్యత లాక్డౌన్ అమల్లో ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, అమరావతి, విశాఖ, రాజమండ్రి, తిరుపతి వంటి నగరాలు, పట్టణాలు వాయునాణ్యత సూచీలో మొదటిసారి ‘గుడ్’కేటగిరీ సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలతో పాటు దక్షిణాదిలోని నగరాలు కూడా ఈ కోవలోకే చేరాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో వాయునాణ్యత పరిస్థితి కొంత బాగుపడినా, దక్షిణాది నగరాలు మెరుగైన వాయునాణ్యతను సాధించాయి. అయితే లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో శుక్రవారం (మే 22న) దేశంలోని ప్రధాన నగరాలు, అందులోని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయునాణ్యత తగ్గింది. తిరుపతిలో ఒక మోస్తరు మెరుగైన వాయునాణ్యత నమోదు కాగా దక్షిణాదిలోని త్రివేండ్రం, బెంగళూరులలో దాదాపు ఏప్రిల్ 22 నాటి పరిస్థితులే కొనసాగాయి. కొచ్చి, చెన్నైలలో కొంతమేర మాత్రమే వాయునాణ్యత తగ్గింది. గత నెలతో పోల్చితే హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ, అమరావతిలలో వాహనాల రద్దీ కారణంగా వాయునాణ్యత తగ్గినట్టుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా గణాంకాల్లో వెల్లడైంది. రంగుల వారీగా వర్గీకరణ ఇలా... వాయు నాణ్యత లెక్కింపు ఇలా... దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వాస్తవ సమయంలో పరిశీలించి ‘సమీర్ యాప్’ద్వారా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటుంది. ► ఏక్యూఐ 50 పాయింట్లలోపు ఉంటే స్వచ్ఛమైన వాతావరణంతో పాటు నాణ్యమైన గాలి ప్రజలకు అందుతున్నట్టు లెక్క. ► 50 – 100 పాయింట్లు నమోదైతే గాలి నాణ్యతగా ఉన్నట్టు లెక్కిస్తారు. ► 100 పాయింట్లు మించి నమోదైతే ఆయా స్థాయిలను బట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. -
నేటి నుంచి పులివెందుల గ్రీన్ జోన్
సాక్షి, కడప సిటీ: పులివెందుల పట్టణం మంగళవారం నుంచి గ్రీన్‌జోన్‌లోకి చేరింది. ఇంతవరకు కంటైన్మెంట్ జోన్ ఆంక్షలు ఉండగా, సోమవారం నాటికి సమాప్తమయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ హరి కిరణ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. పులివెందులలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్ జోన్లో ఉండాల్సిన ఆంక్షలను కఠినంగా అమలు చేశామన్నారు. ఇక్కడ చివరి కేసు ఏప్రిల్ 6వ తేదీ నమోదైందన్నారు. ఈ ప్రాంతంలో పాజిటివ్ వచ్చిన ఆఖరి కేసు కూడా నెగిటివ్ రిపోర్టు రావడంతో ఏప్రిల్ 20 న డిశ్చార్జి చేసినట్లు ఆయన చెప్పారు. అప్ప టి నుంచి 28 రోజులపాటు పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో గ్రీన్‌జోన్‌గా ప్రకటించామని తెలిపారు. (భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు) నలుగురు డిశ్చార్జ్ కోవిడ్ నుంచి కోలుకున్న నలుగురిని సోమవారం డిశ్చార్జ్ చేసినట్లు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తిరుపతి స్టేట్ కోవిడ్ ఆస్పత్రి స్విమ్స్ నుంచి నలుగురిని డిశ్చార్జ్ చేశారని వివరించారు. వీరు కడప నగరానికి చెందిన వారేనని, వీరిలో 51, 60 సంవత్సరాల వయస్సుగల ఇద్దరు పురుషులు, 45, 69 సంవత్సరాలుగల మహిళలు కోలుకున్నారని చెప్పారు. -
తక్కువ సమయంలో బయట పడతాం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మే 31 వరకు లాక్డౌన్ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలినవన్నీ గ్రీన్ జోన్లుగా పరిగణించనున్నామని తెలిపారు. ‘కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. బతుకును బంద్ పెట్టుకుని జీవించలేము.హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. హైదరాబాద్ లో సరి ,బేసి విధానంలో దుకాణాలు తెరవాలి. హైదరాబాద్ సిటీ బస్సులు నడవవు. తెలంగాణ జిల్లాల్లో బస్సులు నడుస్తాయి. ఆటోలు, కార్లు నడుస్తాయి. సెలూన్లు తెరుచుకోవచ్చు. కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం సెలూన్లు తెరవొద్దు.ఆర్టీసీ కోవిడ్ నిబంధనల మేరకు నడుస్తాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే మళ్లీ పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉంటుంది. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష : బార్లు, క్లబ్బులు, జిమ్ములు, పార్కులు బంద్ ఉంటాయి. మెట్రో రైలు నడవదు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. షాపు ఓనర్స్ శానిటైజర్లను తప్పనిసరి ఉంచాలి. 65 ఏళ్ల పైన ఉన్న వృద్ధులను, పిల్లలను బయటకు రానివ్వొద్దు. తక్కువ సమయంలో బయట పడతాం. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష’ అని కేసీఆర్ అన్నారు. (చదవండి : ఆ విధానం బ్రహ్మ పదార్థం కాదు : కేసీఆర్) ఇష్టం వచ్చినట్లు చేస్తే రైతు బంధు వర్తించదు : ‘అన్ని రకాల పంటలకు తెలంగాణ అనుకూలం. తెలంగాణలో ఈ ఏడాది భారీగా వరి దిగుబడి సాధించాం. రైతుబంధు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. వ్యవసాయానికి ఫ్రీగా వాటర్ ఇస్తూ, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. 2604 వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేశాం. కల్తీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ పెట్టాం. పంటల ఉత్పత్తిలో తెలంగాణ ముందుంది. తెలంగాణలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలి. నలభై లక్షల ఎకరాల్లో వరి వేద్దాం. డిమాండ్ ఉన్న వాటిని మేము కనిపెట్టాం. వర్షాకాలంలో మొక్క జొన్న వేయొద్దు. మొక్క జొన్న ప్రతీసారి ప్రభుత్వం కొనలేదు. యాసంగిలో మొక్కజొన్న వేద్దాం. వర్ష కాలంలో 15 లక్షల ఎకరాల్లో కందులు వేయండి. కంది పంట మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు వేద్దాం. ఎండు మిర్చి రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేద్దాం. వరి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వేయొద్దు. ఇష్టం వచ్చినట్లు సాగు చేస్తే రైతు బంధు పథకం వర్తించదు. రిపోర్ట్ తెప్పించుకుని రైతు బంధు ఇస్తాం. షుగర్ ఫ్రీ రైస్ తెలంగాణ సోనా వరి వేరైటీకి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగు చేద్దాం’ అని కేసీఆర్ అన్నారు. -
కరోనా: యాదాద్రిలో 4.. మంచిర్యాలలో 3
సాక్షి, యాదాద్రి/మంచిర్యాల: ఇప్పటి వరకు గ్రీన్జోన్లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బతుకుదెరువు కోసం ముంబైకి వలస వెళ్లొచ్చిన కూలీలకే పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ముంబైలో కరోనా విలయతాండవం చేస్తున్న ధారావి, శాంతకృజ్ ప్రాంతాల నుంచి వీరంతా ఇటీవల జిల్లాలోని స్వస్థలాలకు వచ్చారు. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో ఒకరికి, ఆత్మకూరు (ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో ముగ్గురికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తేలిందని కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. అయితే వారు జిల్లాకు రాగానే క్వారంటైన్‌కు పంపించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. మరోవైపు పల్లెర్ల గ్రామంలో ఉన్న పాజిటివ్ లక్షణాలు గల వ్యక్తులు ఎవరెవరిని కలిశారోనన్న కోణంలో సెకండ్ కాంటాక్ట్ వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక యాదాద్రి జిల్లాకే చెందిన కొంతమంది వలస కార్మికులను హైదరాబాద్‌లోనే అడ్డుకుని క్వారంటైన్‌కు తరలించగా.. వారిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన నలుగురికి ఇప్పటికే పాజిటివ్ అని తేలింది. (చదవండి: కరోనా: తెలంగాణలో మరో 33 మందికి) దీంతో ఆ జిల్లాకు చెందిన మొత్తం 8 మంది వైరస్ బారిన పడినట్టయింది. మరోవైపు మంచిర్యాల జిల్లాలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చిన వారిలో తండ్రి కొడుకుతోపాటు తండ్రి సోదరుడు కూడా ఉన్నారు. వీరు ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని బాంద్రాలో ఇంటి ఆస్తి పరిష్కారం కోసం వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. ఇటీవల లాక్డౌన్ సడలించడంతో ఈ నెల 5వ తేదీన సొంతూరు హాజీపూర్ మండలం రాపల్లికి తిరిగి వచ్చారు. వారి నుంచి నమూనాలు సేకరించి గాంధీ ఆస్పత్రికి పరీక్షల కోసం పంపగా ఆదివారం ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. అయితే ఈ మూడు కేసులు జిల్లా పరిధిలోని కేసులుగా గుర్తించలేమని వలస వెళ్లిన కేసుల జాబితాలోనే పేర్కొంటామని జిల్లా అధికారి డాక్టర్ బాలాజీ తెలిపారు. (చదవండి: బర్త్‌డేలో సూపర్ స్ప్రెడ్!) -
11 నుంచి ఇంటర్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీ డియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మే 11వతేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈమేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో ఇంటర్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి.రమేష్‌లతో కలిసి మంత్రి 13 జిల్లాల ఆర్ఐఓలు, ఆర్జేడీలు, డీవీఈఓలతో చర్చించి పలు సూచనలు చేశారు. 60 లక్షల పత్రాల మూల్యాంకనం... ► మే 11 నుంచి ఆరెంజ్, గ్రీన్జోన్లలో ఇంటర్ జవాబు పత్రాల మూ ల్యాంకనం మొదలవుతుంది. లాక్డౌన్ ముగిసిన అనంతరం రెడ్జోన్లలో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమవుతుంది. 13 జిల్లాల్లోనూ జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటవుతాయి. ► మూల్యాంకనానికి రెండు, మూడు భవనాలను గుర్తించి ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి మూల్యాంకన నిర్వహిస్తారు. ► ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ పరీక్షలకు తేదీలు ఖరారు చేసినందున ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తారు. ► మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారు. ► 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది. -
భయం.. భయంగానే..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ఆంక్షలు కొన్ని తొలగిపోయాయి. మళ్లీ యథావిధిగా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. రోడ్లపైకి వచ్చే ప్రజల సంఖ్య కూడా గత రెండు రోజుల్లో పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్డౌన్ నిబంధనల సడలింపు కొంత ఊరట కలిగించింది కానీ.. కరోనా భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఈనెల 29 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంటుందని రాష్ట్రం ప్రకటించడంతో అప్పటివరకు జాగ్రత్తలు కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఇప్పటికీ మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటిస్తూనే ఉన్నారు. భయం భయంగానే బయటకు వెళ్లి వస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. లాక్డౌన్ నిబంధనల సడలింపు కారణంగా ఏదో జరిగిపోతుందనే ఆందోళన లేకున్నా అక్కడక్కడా ప్రజలు భౌతికదూరాన్ని విస్మరిస్తుండటమే ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తెరుచుకున్న మద్యం దుకాణాలు, భారీగా రద్దీ ఉండే మాంసం దుకాణాలు, ఆటోలు, బ్యాంకులు తదితర ప్రదేశాల్లో ఈ భౌతిక దూరం కన్పించట్లేదు. అయితే మెజారిటీ ప్రజలు మాత్రం కరోనా భయంతో నిబంధనల స్ఫూర్తి కొనసాగిస్తున్నారు. మున్సిపాలిటీల్లో సరి, బేసి రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలు బాగానే అమలవుతున్నాయి. ముఖ్యంగా దుకాణాలు సరి, బేసి పద్ధతిలో తెరుస్తున్నారు. పురపాలిక అధికారులు మర్చంట్ అసోసియేషన్లు, భవన నిర్మాణ కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలు వివరిస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న ప్రధాన రహదారులు, వీధుల్లో సరి, బేసి సంఖ్యలో షాపులు తెరుస్తున్నా... గల్లీల్లో ఉన్న దుకాణాల్లో ఎలాంటి నిబంధనలు అమలు కావట్లేదు. సమయం పాటించకుండా ఇష్టారాజ్యంగా అన్ని దుకాణాలను తెరుస్తున్నారని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతోంది. చాలా చోట్ల దుకాణాల వద్ద భౌతిక దూరం కూడా పాటించట్లేదు. ఈ రెండు రోజుల్లో జరిగిన మంచి పరిణామం ఏంటంటే.. భౌతిక దూరం పాటించని వారు, మాస్కులు ధరించకుండా బయటకు వస్తున్న వారు, బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మివేసే వారికి భారీగా జరిమానాలు విధించాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుండటం గమనార్హం. చదవండి: తెలంగాణలో కొత్త రూట్లో ప్రజా రవాణా! ప్రభుత్వ కార్యాలయాలు పునఃప్రారంభం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో 45 రోజుల తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలు ఎప్పటి నుంచో పనిలో ఉన్నా మిగిలిన కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తుండటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా నెమ్మదిగా ఊపందుకుంటోంది. ఆర్టీఏ కార్యాలయాల్లో పెద్దగా రద్దీ కనిపించకపోయినా పరిమిత సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. రవాణా శాఖ కూడా ఆన్లైన్ స్లాట్లు తగ్గించడంతో పెద్దగా రావట్లేదు. మిగిలిన కార్యాలయాలకు ఉద్యోగులు కొన్ని చోట్ల రొటేషన్ పద్ధతిలో వస్తుండగా, మరికొన్ని చోట్ల దాదాపు అందరూ వస్తున్నారు. అయితే, ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం భౌతికదూరం కచ్చితంగా అమలు చేస్తుండటం గమనార్హం. గ్రీన్ జోన్లో కొంత రవాణా సౌకర్యం మెరుగుపడినా, ఆరెంజ్ జోన్ జిల్లాల్లో ఆటోలు, క్యాబ్‌లు ఇంకా పూర్తిస్థాయిలో రోడ్డెక్కకపోవడంతో ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తప్పట్లేదు. బుధవారం మీటర్ల కొద్దీ బారులతో కళకళలాడిన మద్యం దుకాణాల వద్ద గురువారం సందడి తగ్గింది. తొలిరోజు ఎగబడిన స్థాయిలో మద్యం కోసం ప్రజలు ఆరాటపడలేదు. ఈ దుకాణాల వద్ద కూడా కొన్ని చోట్ల భౌతిక దూరం అమలు కావట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మద్యానికి అనుబంధంగా అమ్మకాలు జరిగే మాంసం, సోడాలు, వాటర్ బాటిళ్లు అమ్మే దుకాణాలు, బజ్జీ, బోండాల బండ్లు తమ కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇది గ్రీన్ జోన్లో ఉన్న ఉన్న యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి జిల్లాల్లో లాక్డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీధుల్లో జనసంచారం పెరిగింది. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను చాలా వరకు ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువ మంది మాస్క్‌లు ధరించి బయటకు వస్తూ భౌతిక దూరం పాటిస్తున్నారు. కానీ కొందరు మాత్రం దుర్వినియోగం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్, ఆర్టీఏ కార్యాలయాలు తెరుచుకున్నాయి. వ్యాపార సముదాయాలు సరి, బేసి సంఖ్యలో తెరుస్తున్నారు. ఆటోలు, క్యాబ్‌లు నడుస్తున్నాయి. మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఆటోలు, బ్యాంకులు, మద్యం, మటన్, చికెన్, రేషన్‌దుకాణాల వద్ద కొన్ని చోట్ల భౌతికదూరం పాటించట్లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం భౌతిక దూరం పాటిస్తున్నారు. పోలీసులు పికెటింగ్‌లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించి హోం క్వారంటైన్ చేస్తున్నారు. సిద్దిపేటలో దుస్తుల దుకాణంలో దుమ్ము దులుపుతున్న నిర్వాహకులు ఆరెంజ్ జోన్ జిల్లాల్లో.. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం నుంచి లాక్డౌన్ ఆంక్షలు సండలించడంతో కొద్ది మంది రోడ్లపైకి వచ్చారు. నిత్యావసర వస్తువులు, భవన నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉండే షాపులు కూడా తెరిచారు. గతంలో కూలీ పనులు లేక ఇంటికే పరిమితమైన మేస్త్రీలు, సిమెంట్ పనిచేసే వారు పనులకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలు, రైతులు వారి వారి పనులకు వెళ్తున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో షాపుల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించగా.. సిద్దిపేటలో మాత్రం కొన్ని షాపుల వద్ద ప్రజలు ఇష్టారాజ్యంగా గుంపులు గుంపులుగా వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అయితే, ప్రజల్లో కరోనా అంటే భయం మాత్రం పోలేదు. మాస్కులు పెట్టుకోవడంతో పాటు శానిటైజర్లు వెంట తీసుకెళ్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత రోడ్లు నిర్మానుష్యమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే సడలింపులతో ప్రజలు భౌతిక దూరం పాటించడంలో అలసత్వం వహిస్తున్నారు. సరిహద్దు జిల్లాల నుంచి రాకపోకలు బంద్ అయినా.. సడలింపులతో ప్రమాదం పొంచి ఉందని జనాలు భయపడుతున్నారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో కూడా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. గతంలో ఉదయం 9 గంటల వరకు మాత్రమే దుకాణాలు ఉండగా, ఇప్పుడు సాయంత్రం వరకు తెరిచే అవకాశం ఉండటంతో నెమ్మదిగానే రోడ్ల మీదకు వెళ్తున్నారు. ఈ జిల్లాలో కూడా అక్కడక్కడా భౌతిక దూరం పాటించట్లేదు. మిగిలిన జిల్లాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అప్రమత్తత తొలుగుతోందా..? రాష్ట్రంలో గత రెండు రోజులుగా పరిస్థితిని గమనిస్తే కరోనా పట్ల అప్రమత్తత క్రమంగా తగ్గుతుందనే అనుమానం కలుగుతోంది. ప్రభుత్వం నిబంధనలు సడలించింది ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకేనని, కరోనా భయం తొలగిపోయినందుకు కాదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వైద్య, సామాజిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మద్యం షాపులు, మాంసం దుకాణాలు, నిత్యావసరాల దుకాణాలు, ఆటోలు, బ్యాంకుల్లో భౌతికదూరం మర్చిపోకూడదని చెబుతున్నారు. లాక్డౌన్ కఠినంగా అమల్లో ఉన్న సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం అయినందున ఆంక్షలు వాటంతట అవే అమలయ్యాయని, ఇప్పుడు క్రమంగా ప్రజలు రోడ్ల మీదకు వస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తోంది. ఏం కాదులే అనే నిర్లక్ష్యం మంచిది కాదని, లాక్డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తివేసి సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు గత నెలలో ఉన్నట్లే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదమే.. ఏమాత్రం అలసత్వం వహించినా ఇన్ని రోజుల కష్టం వృథా అయినట్టే. తస్మాత్ జాగ్రత్త. మాస్క్ తప్పనిసరి చేయాలి ‘లాక్డౌన్ సడలింపుతో రోజు వారీ ఖర్చులకు ఇబ్బందులు తప్పనున్నాయి. లాక్డౌన్ మొదట్లో చూపిన స్ఫూర్తితో భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం జీవితంలో భాగం చేసుకోవాలి. అధికారులు సైతం మాస్క్ ధరించని వారికి, బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మి వేసే వారికి భారీ జరిమానాలు విధించాలి. ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి. - బొడ్డుపల్లి ఉపేంద్ర, వ్యాపారి మహబూబాబాద్ మెల్లమెల్లగా మానేస్తున్నారు గ్రీన్ జోన్లో ఉన్న యాదాద్రి భువనగిరిలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు ఎత్తేయడంతో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కూడా లేదన్న కారణంతో నిబంధనలను ప్రజలు పట్టించుకోవడం మానేస్తున్నారు. మద్యం, మాంసం, నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించట్లేదు.’ -పూసలోజు కృష్ణాచారి, యాదాద్రి భువనగిరి -
గ్రీన్జోన్లో ఉన్న ఏకైక జిల్లా విజయనగరం
సాక్షి, విజయనగరం: విజయనగరం.. ఈ పేరులోనే విజయం ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై సైతం జిల్లా విజయం సాధిస్తూ వస్తోంది. కోవిడ్–19ను జిల్లాలో అడుగుపెట్టనీయకుండా కట్టడి చేసి రాష్ట్రంలోనే ఏకైక గ్రీన్‌జోన్ జిల్లాగా నిలిచింది. 40 రోజుల పాటు లాక్డౌన్లో ఉన్న దేశంలో కొన్ని జిల్లాలకు మాత్రమే సడలింపులివ్వగా రాష్ట్రంలో సాధారణ కార్యకలాపాలు ఒక్క విజయనగరం జిల్లాలో సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. జనతా కర్ఫ్యూనాటి నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. మూతపడిన దుకాణాలు, పరిశ్రమలు సమయానుకూలంగా తెరచుకోనున్నాయి. ఉద యం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు కొన్ని వ్యా పారాలు నిర్వహించుకోవచ్చు. బస్సు సర్వీసులకు అనుమతి లభించలేదు. ఫలించిన కృషి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి దంపతులు, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, తొమ్మిది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ బి.రాజకుమారీలతో పాటు ముఖ్యమైన నాయకులు, అధికారులతో ఏర్పాటైన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ కరోనా కట్టడికి చేసిన కృషి ఫలించింది. మరోవైపు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు నిరంతరం ప్రజలకు, అధికారులకు మధ్య వారధిలా ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడంలో దోహదపడ్డారు. కోవిడ్ ప్రత్యేక అధికారిగా వచ్చిన వివేక్ యాదవ్ కోవిడ్ ఆస్పత్రి నెల్లిమర్ల ‘మిమ్స్’ను పర్యవేక్షిస్తూ తనవంతు కృషి చేశారు. జిల్లా వాసుల సహకారంతో విజయనగరం జిల్లా గ్రీన్ జోన్లో నిలిచింది. అందరికంటే ముందుగా కార్యకలాపాలకు జిల్లా వాసులకు కాస్త వెసులబాటు కలిగింది. అప్రమత్తంగా వ్యవహరిస్తూ... రాష్ట్రంలో కరోనా తొలికేసు బయటపడగానే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించింది. డేటా సేకరణ, విశ్లేషణకు అధిక ప్రాధాన్యతనిచ్చి, దానికి అనుగుణంగా క్షేత్రస్థాయి పనితీరుకు వ్యూహాన్ని ఇక్కడి నుంచే రూపొందించింది. జిల్లా అవసరాలకు తగినట్టుగా వాటిని అన్వయించి, ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా ఇప్పటివరకు మంచి ఫలితాలను రాబట్టింది. జిల్లాలో కరోనా కట్టడిలో సత్ఫలితం ఇచ్చిన ఏడంచెల వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తున్నది ఈ కంట్రోల్ రూము ద్వారానే. క్షేత్రస్థాయి సర్వే, కాల్ సెంటర్ మోనటరింగ్, డేటా విశ్లేషణ, పోలీసులతో సమన్వయం, జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల సన్నద్ధతను పర్యవేక్షించడం, పౌరసరఫరాల వ్యవస్థ పనితీరును గమనించడం, కరోనా నియంత్రణకు విస్తృత అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం, నివేదికలను తయారు చేయడం వంటి పనులు నిర్వహిస్తోంది. సరిహద్దులో నిఘా... సరిహద్దు జిల్లాల్లో కోవిడ్–19 కేసులు నమోదుకావడంతో అధికార యంత్రాంగం చెక్ పోస్టుల్లో నిఘాను పటిష్టం చేసింది. జిల్లాలోకి ప్రవేశించేవారికి సరిహద్దులోనే కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టింది. వివిధ ప్రాంతాలనుంచి జిల్లాలో ప్రవేశించే మార్గాలను మూసివేసింది. అత్యవసర పనులపై వచ్చేవారికి సరిహద్దుల్లోనే మొబైల్ ల్యాబ్‌లలో వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. 17 మిషన్ల ద్వారా ట్రూనాట్ టెస్ట్‌లను సైతం చేస్తోంది. జిల్లాలో లక్ష మంది జనాభాలో 1400 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ రాష్ట్ర సగటుతో సమానంగా నిలిచింది. జిల్లాలో ఉన్న 22 అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసింది. ఇతర జిల్లా లు, రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 2వేల మంది వలస కూలీలు, మత్స్యకారులను జిల్లాలోని 70 క్వారెంటైన్ సెంటర్లకు తరలిస్తోంది. విరాళాల వెల్లువ జిల్లాలో కరోనా సహాయక చర్యల కోసం, కరోనా సంక్రమించకుండా నివారించేందుకు పలువురు దాతలు, అధికారులు, ఉద్యోగుల నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల రూపంలో రూ.32,00,786 అందాయి. జిల్లా కోవిడ్ సహాయ నిధికి రూ.31 లక్షలు వచ్చాయి. జిల్లా కోవిడ్ సహాయ నిధికి వచ్చిన విరాళాల నుంచి రూ.1.18 లక్షలు బారికేడ్ల నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖకు, రూ.80 వేలు మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల రక్షణ చర్యలకు ఖర్చుచేశారు. ఇబ్బందులు లేకుండా.. ఓ వైపు కరోనాను కట్టడిచేస్తూనే జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూసింది. ధరలను నియంత్రణలో ఉంచింది. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో మొక్కజొన్న, అరటి రైతులను ఆదుకుంది. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. కూరగాయలను ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు వెసుల బాటు కల్పించింది. వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తోంది. అలాగే ఉపాధి హామీ పనులను భౌతిక దూరం పాటిస్తూ జరిపించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రజలకు చేరవేస్తోంది. జీవన కష్టాలను తీర్చుతోంది. మాస్కుల పంపిణీ.. జిల్లాలోని మున్సిపాల్టీల్లో పంపిణీ చేసేందుకు సుమారుగా 13,00,500 మాస్కులు అవసరమని అధికార యంత్రాంగం అంచనా వేసింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌కు సుమారుగా 7,50,000, పార్వతీపురం మున్సిపాల్టీకి 1,66,500, సాలూరు మున్సిపాల్టీకి 1,53,600, బొబ్బిలి మున్సిపాలిటీకి 1,56,900, నెల్లిమర్ల నగర పంచాయతీకి 73,500 మాస్కులు అవసరమని లెక్కగట్టింది. దీనికి తగ్గట్టుగా జిల్లాలో డ్వాక్రా సంఘాల ద్వారా తయారు చేయించి అందజేస్తోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తప్పకుండా మాస్క్ ధరించండి. హ్యాండ్ శానిటైజేషన్ తప్పనిసరి. భౌతిక దూరం పాటించండి. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దు. గడ్డం పెంచుకోకండి. మంగలి దుకాణాని కి వెళ్లవద్దు. అవసరమనుకుంటే క్షవరం చేసేవా రి చేతులను శుభ్రపరిచి.. సొంత పరికరాలను సమకూర్చాకే క్షవరం చేయించుకోవాలి. మీరు బయటకు వెళ్లినప్పుడు బెల్ట్, రింగులు, రిస్ట్ వాచ్ ధరించవద్దు. వాచ్ అవసరం లేదు. మీరు బయటి నుంచి ఇంటికి వచ్చినప్పు డు మీ చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోండి. మీరు కరోనా అనుమానాస్పద రోగికి దగ్గరగా వచ్చారని అనిపించినప్పుడు పూర్తిగా స్నానం చేయండి. వచ్చే 6 నెలల నుంచి 12 నెలల వరకు లాక్డౌన్ ఉన్నా.. లేకపోయినా పై నియమాలు పాటించండి. నేటి నుంచి మద్యం అమ్మకాలు మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని 168 మద్యం దుకాణాలు సోమవారం తెరచుకోనున్నాయి. దుకాణం వద్ద ఐదుగురికి మాత్రమే అనుమతిస్తారు. భౌతిక దూరం తప్పనిసరి. మరో వైపు మద్యం రేట్లను సైతం 25 శాతం పెంచి మద్య నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. దుకాణాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరచి ఉంటాయి. గ్రీన్‌జోన్ కావడంతో విజయనగరం డిపో నుంచి 36, సాలూరు డిపో నుంచి 20, ఎస్.కోట నుంచి 9, పార్వతీపురం డిపో నుంచి 26 బస్సులు నడిపేందుకు తొలుత సిద్ధమయ్యారు. అయితే, బస్సుల రాకపోకలకు కలెక్టర్ అనుమతించలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు బస్సుల రాకపోకలు ఉండవు. -
‘బ్యాంక్‌పేటలో రెడ్‌జోన్ ఎత్తివేత’
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ బ్యాంక్‌పేటలో రెడ్‌జోన్ ఎత్తివేస్తూ.. నేటి నుంచి ఆరంజ్‌జోన్‌గా కొనసాగుతుందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్ జోన్లోకి రావడానికి సహకరించిన ప్రజలకు, దాతలకు, కరోనా సేవల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ సిటీలో 34 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే కొండబాబు, అతని అనుచరులు అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని ఆయన మండిపడ్డారు. దుమ్ములపేటలో పోర్టు భూముల నుంచి సేకరించిన స్థలాల్లో మడఅడవులు ఉన్నాయాని అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. అవి అటవీశాఖ భూములు కావని, మత్స్య సంపదకు నష్టం కలగదని అధికారులు ఇచ్చిన పత్రాలను ద్వారంపూడి మీడియాకు విడుదల చేశారు.(శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తి: సీఎం జగన్) ఆటంకాలు సృష్టించాలని చూస్తే లబ్దిదారులతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. వక్రబుద్ధితో టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయిస్తున్నారని ద్వారంపూడి దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడం టీడీపీ ఇష్టం ఉండదని ఆయన మండిపడ్డారు. కాకినాడలో 34 వేల మంది లబ్దిదారులకు జూన్ 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కచ్చితంగా ఇళ్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే కొండబాబు భూ కబ్జాలు, అక్రమాలు సాక్షాధారాలతో సహ బయటపెడతానని తెలిపారు. ఇప్పటికే 15 ఎకరాల కబ్జా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారిని కూడా సస్పెండ్ చేసిందని ఆయన అన్నారు. జగన్నాధపురంలో క్రైస్తవుల శ్మశానవాటికకు ఇచ్చిన 5 ఎకరాల భూమిపై కూడా కొండబాబు కోర్టుకు వెళ్లిఅడ్డుకుంటున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. -
మన గాలి మంచిదే!
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం గురించి చెప్పక్కర్లేదు. దేశ రాజధాని ఢిల్లీ ఈ విషయంలో నిత్యం వార్తల్లో ఉంటోంది. అక్కడ కనీవినీ ఎరుగని రీతిలో వాయు కాలుష్యం జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖానికి మాస్క్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి.. ఢిల్లీయే కాదు.. దేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉంది. ఈ విషయంలో మన హైదరాబాద్ మాత్రం సేఫ్ జోన్లో ఉందని తేలింది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో కోలకతా ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) వెల్లడించింది. అత్యంత ఎక్కువగా వాయుకాలుష్యం ఉన్న నగరాలు/పట్టణాలను రెడ్ జోన్లో, సాధారణ స్థాయిలో వాయు కాలుష్యం ఉన్న నగరాలు/పట్టణాలను గ్రీన్ జోన్ పరిధిలో చేర్చి సీపీసీబీ ఓ జాబితా విడుదల చేసింది. వీటిలో మన భాగ్యనగరం గ్రీన్ జోన్ లో ఉంది. ఎలా విస్తరిస్తోంది? ఉత్తరాది రాష్ట్రాల్లోని నగరాల్లో వివిధ రూపాల్లో వెదజల్లుతున్న కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగ, మంచు సమ్మిళతమై కా లుష్యం విస్తృతంగా విస్తరిస్తోంది. ఈ ప రిస్థితుల్లో వాయు నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పడిపోతున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ వాయు ప్రమాణాల సూచి ప్రకారం.. 2.5 మైక్రాన్ల పరిమాణంలో 40 మైక్రోగ్రాముల (గాలిలో క్యూబిక్ మీటర్ పరిధిలో ఉన్న దుమ్ముధూళిని మైక్రోగ్రామ్స్‌లో కొలుస్తారు) దుమ్ముకణాలు ఉండాలి. అయితే, హైదరాబాద్‌లో అది 50 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తేలింది. పది మైక్రాన్ల పరిమాణంలో 60 మైక్రోగాములు ఉండాల్సి ఉండగా.. అది హైదరాబాద్‌లో 100 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు వెల్లడైంది. ఢిల్లీలో అయితే ఇది అత్యంత ప్రమాదకరంగా 700 నుంచి 994 మైక్రోగ్రాములు ఉన్నట్టు గుర్తించారు. ఇక హైదరాబాద్‌లో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ సాధారణ స్థాయి కంటే 4 పాయింట్లు ఎక్కువున్నట్టు తేలింది. దక్షిణాది నగరాలన్నీ సేఫ్‌జోన్‌లోనే... ముంబై సహా దక్షిణాది నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలు ‘సేఫ్ జోన్’లో ఉన్నాయి. జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాల కంటే కొంచెం అధికంగా మన రాష్ట్రంలో కాలుష్యం ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం ‘స్పెషల్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటుచేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో వాయు నాణ్యతను మెరుగుపరిచేం దుకు ఈ కమిటీ ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తోంది. హైదరాబాద్, నగర శివార్లలోని పటాన్చెరు పారిశ్రామికవాడ, నల్లగొండ జిల్లాలో గాలి నాణ్యత ప్రమాణాలకు మించి కాలుష్యం నమోదవుతున్నట్లు గుర్తించింది. హైదరాబాద్ ఎందుకు సురక్షితం? హిమాలయాలు సమీపంలో ఉండడం, చలిగాలులు పెరగడం, పొరుగు రాష్ట్రా ల్లో పంట వ్యర్థాలు, కోతల తర్వాత వాటిని తగలబెట్టడం వంటి అంశాలే ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలని గుర్తించా రు. ఎత్తైన ప్రాంతంలోని హిమాలయాల నుంచి ధూళి, దుమ్ముకణాలు గాలిలో ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా విపరీతమైన చలి కారణంగా మార్గం మధ్యలోనే నిలి చిపోతాయి. వాటికి పరిశ్రమలు, వాహన కాలుష్యం తోడు కావడంతో విష వా యువులుగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో దీనికి భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ స్థాయిలో ఇక్కడ కాలుష్యం విస్తరించే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే ట్రాఫిక్ పెరుగుదల, పరిశ్రమల కాలుష్య ఉద్గారాలు, రోడ్డుపై ధూళి, దుమ్ము విస్తరించడం వంటి కారణాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ నగరాలు ఏ జోన్లో.. రెడ్‌జోన్ ఘజియాబాద్, నోయిడా, ఢిల్లీ, ఫరీదాబాద్, భివాని, హిసార్, ఫతేహబాద్, గురుగ్రామ్, లక్నో, బహదుర్‌ఘర్, భటిండా, భీవాండి, హాపూర్, బులంద్‌షహర్, అంబాలా, అమృత్స ర్, రోహతక్, పటౌడి, కాన్పూర్. గ్రీన్‌జోన్ హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, విజ యవాడ, చెన్నై, బెంగళూరు, మైసూరు, కొచ్చి నగరాలు. -
గ్రీన్ జోన్ గరంగరం
రైతుల్లో తీవ్ర వ్యతిరేకత తమ భూములపై ఆంక్షలు తొలగించాల్సిందేనని ఆందోళనలు పంచాయతీల్లో తీర్మానాలు అయినా పట్టించుకోని పాలకులు జి.కొండూరు : సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన గ్రీన్ జోన్ అంశంపై రైతులు గరం గరంగా ఉన్నారు. ఈ జోన్లను పూర్తిగా ఎత్తేయాలని ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. పంచాయతీల్లో మూకుమ్మడిగా తీర్మానాలు కూడా చేస్తున్నారు. వేల కొద్దీ అభ్యంతర పత్రాలను సీఆర్డీఏ అధికారులకు పంపిస్తున్నారు. అయినా నేటికీ ప్రభుత్వం స్పందించకపోవటంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పడిపోయిన భూముల ధరలు... గ్రీన్‌జోన్ ప్రకటనకు ముందు వరకు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని మైలవరం, జి.కొండూరు, ఉయ్యూరు, గుడివాడ తదితర ప్రాంతాల పొలాలు కోట్ల రూపాయల్లో ధరలు పలికాయి. గ్రీన్ జోన్ పుణ్యమా అంటూ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ధరలు దారుణంగా పడిపోవటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కుటుంబాల్లో కలహాలు... గతంలో భూముల ధరలు మంచి రేటు పలకటంతో అదే చెప్పి కట్నం కింద ఇచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులపై ఇప్పుడు ఒత్తిళ్లు వస్తున్నాయి. ధరలు తగ్గిన నేపథ్యంలో అదనపు కట్నం కోసం అల్లుళ్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయని పలువురు వాపోతున్నారు. జి.కొండూరు మండలం వెంకటాపురంలో తాజాగా ఒక కుటుంబంలో ఇదే పరిస్థితి ఏర్పడింది. మరోపక్క పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం, ఇంటి నిర్మాణం తదితర అవసరాల కోసం ఉపయోగించుకోవాలనుకున్నా అక్కరకు రాని పరిస్థితి నెలకొంది. ఉపాధి అవకాశాలూ రావు... రాజధానికి సమీపంలోనే ఉన్న నేపథ్యంలో పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గ్రీన్ జోన్ నిర్ణయంతో ఆ అవకాశమూ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు మినహా, ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా అనుమతులు వచ్చే పరిస్థితి ఉండదని ఆవేదన చెందుతున్నారు. గ్రీన్ జోన్ పరిధిలో 20 లక్షల ఎకరాలు... సీఆర్డీఏ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 5,440.26 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని వ్యవసాయ పరిరక్షణ జోన్ ప్రతిపాదించారు. ఈ విస్తీర్ణం రీజియన్‌లోని మొత్తం భూమిలో 63.23 శాతంగా ఉంది. సుమారు 20 లక్షల ఎకరాలు దీని ఈ జోన్ల పరిధిలో ఉంది. ఈ జోన్లలో పట్టణీకరణకు ప్రభుత్వం అనుమతించదు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, డెయిరీ, పౌల్ట్రీ, చేపల చెరువుల సాగుతోపాటు వ్యవసాయాధారిత కార్యకలాపాలకే ఇక్కడ అవకాశం ఉంటుంది. అయితే వ్యవసాయ రక్షణ జోన్-2, 3లో అవుటర్ రింగు రోడ్డు, ఇతర ప్రధాన రోడ్లకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భవిష్యత్తులో పట్టణీకరణకు అవకాశం ఇస్తారు. కృష్ణా జిల్లాలోని చాలా ప్రాంతాన్ని జోన్-1 పరిధిలో చేర్చారు. విజయవాడ, గుడివాడ, నూజివీడు తదితర పట్టణాలను అభివృద్ధి చేస్తామంటూనే వాటి చుట్టు పక్కల ప్రాంతాలన్నింటినీ అగ్రిజోన్‌లో చేర్చారు. గతంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలను సైతం ఈ జోన్లలో చేర్చడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంకిపాడు మండలం ఈడుపుగల్లు నుంచి అగ్రిజోన్ కిందకు వచ్చింది. కానీ ఉయ్యూరు వరకూ ఎప్పుడో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందింది. ఇప్పుడు తమ భూములపై ఆంక్షలు విధించడంతో రైతులు ఒప్పుకోవడం లేదు. గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి పట్టణాల చుట్టుపక్కల ప్రాంతాలను ఇలాగే చేర్చారు. సగానికి అమ్ముకున్నా సున్నంపాడులో 10 ఎకరాల పొలం ఉంది. పిల్లల చదువు కోసం అమ్మాలని గ్రీన్ జోన్ రాకముందు బేరానికి పెట్టా. అప్పుడు ఎకరం 50 లక్షలకు అడిగారు. ఇంకా ఏమైనా బేరం వస్తుందని చూసేలోగా గ్రీన్ జోన్ ప్రకటించారు. జి.కొండూరు మండలాన్ని దాని పరిధిలోకి చేర్చారు. దీంతో పొలం కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు. పిల్లాడు చదివే డాక్టర్ సీటు కోసం డబ్బులు కట్టాల్సి రావటంతో ఉన్న పొలంలో ఐదెకరాలను ప్రస్తుతం బేరం పెట్టాను. మూడు రోజుల క్రితం ఎకరా రూ.21 లక్షలకు అమ్ముకోవాల్సి వచ్చింది. తీవ్రంగా నష్టపోయా. - పరికల కాసులు, జి.కొండూరు పిల్లల భవిషత్తు అగమ్యగోచరమైంది జి.కొండూరు గ్రామ శివారులో జాతీయ రహదారికి అనుకుని నాకు 5.48 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటంతో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొలం అమ్మి ఆ డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేద్దామనుకున్నా. ఎకరం రెండు కోట్లకు బేరం పెడితే రూ.1.50 కోట్ల వరకు అడిగారు. బేరం నడుస్తున్న సమయంలో గ్రీన్ జోన్ ప్రకటన రావటంతో ధర దారుణంగా పడిపోయింది. ఎకరం 60 లక్షలకు కూడా అడిగేవారు కనిపించటం లేదు. - నలమోలు కమలాకర్‌రెడ్డి, జి.కొండూరు అడిగేవాళ్లు లేరు విజయవాడకు దగ్గర ఉన్న వెలగలేరులో ఏడాది క్రితం భూములకు మంచి ధరలు పలికాయి. నా స్నేహితులతో కలిసి ఎకరా రూ.80 లక్షలు చొప్పున ఐదెకరాలు కొనుగోలు చేశా. అడ్వాన్స్ కింద రూ.కోటి చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ తర్వాత విక్రయించేందుకు ప్రయత్నించగా ఎకరాకు రూ.కోటి ఇస్తామన్నారు. ఇచ్చేయాలనుకుంటున్న తరుణంలో గ్రీన్ జోన్ ప్రకటన వచ్చింది. దీంతో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం రూ.50 లక్షలకు కూడా అడిగే వారు లేరు. - గంగుల నాగేశ్వరరావు, వెలగలేరు నోరు మెదపని అధికార పార్టీ నేతలు గ్రీన్ జోన్‌కు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రజల నుంచి ఆందోళనలు మొదలవుతున్నా అధికార పార్టీ నేతలు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుంటున్నారు. ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు సమాధానం చెప్పలేక మౌనం దాల్చుతున్నారు. గ్రీన్ జోన్ వల్ల నష్టపోతున్న టీడీపీ శ్రేణుల్లోనూ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.