మన గాలి మంచిదే! | Hyderabad Safe From Air Pollution Says CPCB | Sakshi
Sakshi News home page

మన గాలి మంచిదే!

Published Wed, Nov 13 2019 3:29 AM | Last Updated on Wed, Nov 13 2019 3:29 AM

Hyderabad Safe From Air Pollution Says CPCB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం గురించి చెప్పక్కర్లేదు. దేశ రాజధాని ఢిల్లీ ఈ విషయంలో నిత్యం వార్తల్లో ఉంటోంది. అక్కడ కనీవినీ ఎరుగని రీతిలో వాయు కాలుష్యం జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖానికి మాస్క్‌ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి.. ఢిల్లీయే కాదు.. దేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉంది. ఈ విషయంలో మన హైదరాబాద్‌ మాత్రం సేఫ్‌ జోన్‌లో ఉందని తేలింది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో కోలకతా ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) వెల్లడించింది. అత్యంత ఎక్కువగా వాయుకాలుష్యం ఉన్న నగరాలు/పట్టణాలను రెడ్‌ జోన్‌లో, సాధారణ స్థాయిలో వాయు కాలుష్యం ఉన్న నగరాలు/పట్టణాలను గ్రీన్‌ జోన్‌ పరిధిలో చేర్చి సీపీసీబీ ఓ జాబితా విడుదల చేసింది. వీటిలో మన భాగ్యనగరం గ్రీన్‌ జోన్‌ లో ఉంది.

ఎలా విస్తరిస్తోంది?
ఉత్తరాది రాష్ట్రాల్లోని నగరాల్లో వివిధ రూపాల్లో వెదజల్లుతున్న కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగ, మంచు సమ్మిళతమై కా లుష్యం విస్తృతంగా విస్తరిస్తోంది. ఈ ప రిస్థితుల్లో వాయు నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పడిపోతున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ వాయు ప్రమాణాల సూచి ప్రకారం.. 2.5 మైక్రాన్ల పరిమాణంలో 40 మైక్రోగ్రాముల (గాలిలో క్యూబిక్‌ మీటర్‌ పరిధిలో ఉన్న దుమ్ముధూళిని మైక్రోగ్రామ్స్‌లో కొలుస్తారు) దుమ్ముకణాలు ఉండాలి. అయితే, హైదరాబాద్‌లో అది 50 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తేలింది. పది మైక్రాన్ల పరిమాణంలో 60 మైక్రోగాములు ఉండాల్సి ఉండగా.. అది హైదరాబాద్‌లో 100 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు వెల్లడైంది. ఢిల్లీలో అయితే ఇది అత్యంత ప్రమాదకరంగా 700 నుంచి 994 మైక్రోగ్రాములు ఉన్నట్టు గుర్తించారు. ఇక హైదరాబాద్‌లో నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ సాధారణ స్థాయి కంటే 4 పాయింట్లు ఎక్కువున్నట్టు తేలింది.

దక్షిణాది నగరాలన్నీ సేఫ్‌జోన్‌లోనే...
ముంబై సహా  దక్షిణాది నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలు ‘సేఫ్‌ జోన్‌’లో ఉన్నాయి. జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాల కంటే కొంచెం అధికంగా మన రాష్ట్రంలో కాలుష్యం ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం ‘స్పెషల్‌ యాంబియెంట్‌ ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ కమిటీ’ని ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో వాయు నాణ్యతను మెరుగుపరిచేం దుకు ఈ కమిటీ ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తోంది. హైదరాబాద్, నగర శివార్లలోని పటాన్‌చెరు పారిశ్రామికవాడ, నల్లగొండ జిల్లాలో గాలి నాణ్యత ప్రమాణాలకు మించి కాలుష్యం నమోదవుతున్నట్లు గుర్తించింది.

హైదరాబాద్‌ ఎందుకు సురక్షితం?
హిమాలయాలు సమీపంలో ఉండడం, చలిగాలులు పెరగడం, పొరుగు రాష్ట్రా ల్లో పంట వ్యర్థాలు, కోతల తర్వాత వాటిని తగలబెట్టడం వంటి అంశాలే ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలని గుర్తించా రు. ఎత్తైన ప్రాంతంలోని హిమాలయాల నుంచి ధూళి, దుమ్ముకణాలు గాలిలో ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా విపరీతమైన చలి కారణంగా మార్గం మధ్యలోనే నిలి చిపోతాయి. వాటికి పరిశ్రమలు, వాహన కాలుష్యం తోడు కావడంతో విష వా యువులుగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో దీనికి భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ స్థాయిలో ఇక్కడ కాలుష్యం విస్తరించే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే ట్రాఫిక్‌ పెరుగుదల, పరిశ్రమల కాలుష్య ఉద్గారాలు, రోడ్డుపై ధూళి, దుమ్ము విస్తరించడం వంటి కారణాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఏ నగరాలు ఏ జోన్‌లో..
రెడ్‌జోన్‌
ఘజియాబాద్, నోయిడా, ఢిల్లీ, ఫరీదాబాద్, భివాని, హిసార్, ఫతేహబాద్, గురుగ్రామ్, లక్నో, బహదుర్‌ఘర్, భటిండా, భీవాండి, హాపూర్, బులంద్‌షహర్, అంబాలా, అమృత్‌స ర్, రోహతక్, పటౌడి, కాన్పూర్‌.

గ్రీన్‌జోన్‌
హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, విజ యవాడ, చెన్నై, బెంగళూరు, మైసూరు, కొచ్చి నగరాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement