సాక్షి, విజయనగరం: విజయనగరం.. ఈ పేరులోనే విజయం ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై సైతం జిల్లా విజయం సాధిస్తూ వస్తోంది. కోవిడ్–19ను జిల్లాలో అడుగుపెట్టనీయకుండా కట్టడి చేసి రాష్ట్రంలోనే ఏకైక గ్రీన్‌జోన్ జిల్లాగా నిలిచింది. 40 రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉన్న దేశంలో కొన్ని జిల్లాలకు మాత్రమే సడలింపులివ్వగా రాష్ట్రంలో సాధారణ కార్యకలాపాలు ఒక్క విజయనగరం జిల్లాలో సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. జనతా కర్ఫ్యూనాటి నుంచి ఇళ్లకే పరిమితమైన ప్రజలు బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. మూతపడిన దుకాణాలు, పరిశ్రమలు సమయానుకూలంగా తెరచుకోనున్నాయి. ఉద యం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు కొన్ని వ్యా పారాలు నిర్వహించుకోవచ్చు. బస్సు సర్వీసులకు అనుమతి లభించలేదు.
ఫలించిన కృషి
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి దంపతులు, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, తొమ్మిది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ బి.రాజకుమారీలతో పాటు ముఖ్యమైన నాయకులు, అధికారులతో ఏర్పాటైన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ కరోనా కట్టడికి చేసిన కృషి ఫలించింది. మరోవైపు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు నిరంతరం ప్రజలకు, అధికారులకు మధ్య వారధిలా ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడంలో దోహదపడ్డారు. కోవిడ్ ప్రత్యేక అధికారిగా వచ్చిన వివేక్ యాదవ్ కోవిడ్ ఆస్పత్రి నెల్లిమర్ల ‘మిమ్స్’ను పర్యవేక్షిస్తూ తనవంతు కృషి చేశారు. జిల్లా వాసుల సహకారంతో విజయనగరం జిల్లా గ్రీన్ జోన్‌లో నిలిచింది. అందరికంటే ముందుగా కార్యకలాపాలకు జిల్లా వాసులకు కాస్త వెసులబాటు కలిగింది.
అప్రమత్తంగా వ్యవహరిస్తూ...
రాష్ట్రంలో కరోనా తొలికేసు బయటపడగానే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించింది. డేటా సేకరణ, విశ్లేషణకు అధిక ప్రాధాన్యతనిచ్చి, దానికి అనుగుణంగా క్షేత్రస్థాయి పనితీరుకు వ్యూహాన్ని ఇక్కడి నుంచే రూపొందించింది. జిల్లా అవసరాలకు తగినట్టుగా వాటిని అన్వయించి, ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా ఇప్పటివరకు మంచి ఫలితాలను రాబట్టింది. జిల్లాలో కరోనా కట్టడిలో సత్ఫలితం ఇచ్చిన ఏడంచెల వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తున్నది ఈ కంట్రోల్ రూము ద్వారానే. క్షేత్రస్థాయి సర్వే, కాల్ సెంటర్ మోనటరింగ్, డేటా విశ్లేషణ, పోలీసులతో సమన్వయం, జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల సన్నద్ధతను పర్యవేక్షించడం, పౌరసరఫరాల వ్యవస్థ పనితీరును గమనించడం, కరోనా నియంత్రణకు విస్తృత అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం, నివేదికలను తయారు చేయడం వంటి పనులు నిర్వహిస్తోంది.
సరిహద్దులో నిఘా...
సరిహద్దు జిల్లాల్లో కోవిడ్–19 కేసులు నమోదుకావడంతో అధికార యంత్రాంగం చెక్ పోస్టుల్లో నిఘాను పటిష్టం చేసింది. జిల్లాలోకి ప్రవేశించేవారికి సరిహద్దులోనే కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టింది. వివిధ ప్రాంతాలనుంచి జిల్లాలో ప్రవేశించే మార్గాలను మూసివేసింది. అత్యవసర పనులపై వచ్చేవారికి సరిహద్దుల్లోనే మొబైల్ ల్యాబ్‌లలో వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. 17 మిషన్ల ద్వారా ట్రూనాట్ టెస్ట్‌లను సైతం చేస్తోంది. జిల్లాలో లక్ష మంది జనాభాలో 1400 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ రాష్ట్ర సగటుతో సమానంగా నిలిచింది. జిల్లాలో ఉన్న 22 అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసింది. ఇతర జిల్లా లు, రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 2వేల మంది వలస కూలీలు, మత్స్యకారులను జిల్లాలోని 70 క్వారెంటైన్ సెంటర్లకు తరలిస్తోంది.
విరాళాల వెల్లువ
జిల్లాలో కరోనా సహాయక చర్యల కోసం, కరోనా సంక్రమించకుండా నివారించేందుకు పలువురు దాతలు, అధికారులు, ఉద్యోగుల నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల రూపంలో రూ.32,00,786 అందాయి. జిల్లా కోవిడ్ సహాయ నిధికి రూ.31 లక్షలు వచ్చాయి. జిల్లా కోవిడ్ సహాయ నిధికి వచ్చిన విరాళాల నుంచి రూ.1.18 లక్షలు బారికేడ్ల నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖకు, రూ.80 వేలు మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల రక్షణ చర్యలకు ఖర్చుచేశారు.
ఇబ్బందులు లేకుండా..
ఓ వైపు కరోనాను కట్టడిచేస్తూనే జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూసింది. ధరలను నియంత్రణలో ఉంచింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో మొక్కజొన్న, అరటి రైతులను ఆదుకుంది. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. కూరగాయలను ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు వెసుల బాటు కల్పించింది. వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తోంది. అలాగే ఉపాధి హామీ పనులను భౌతిక దూరం పాటిస్తూ జరిపించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రజలకు చేరవేస్తోంది. జీవన కష్టాలను తీర్చుతోంది.
మాస్కుల పంపిణీ..
జిల్లాలోని మున్సిపాల్టీల్లో పంపిణీ చేసేందుకు సుమారుగా 13,00,500 మాస్కులు అవసరమని అధికార యంత్రాంగం అంచనా వేసింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌కు సుమారుగా 7,50,000, పార్వతీపురం మున్సిపాల్టీకి 1,66,500, సాలూరు మున్సిపాల్టీకి 1,53,600, బొబ్బిలి మున్సిపాలిటీకి 1,56,900, నెల్లిమర్ల నగర పంచాయతీకి 73,500 మాస్కులు అవసరమని లెక్కగట్టింది. దీనికి తగ్గట్టుగా జిల్లాలో డ్వాక్రా సంఘాల ద్వారా తయారు చేయించి అందజేస్తోంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- తప్పకుండా మాస్క్ ధరించండి. హ్యాండ్ శానిటైజేషన్ తప్పనిసరి.
- భౌతిక దూరం పాటించండి. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దు.
- గడ్డం పెంచుకోకండి. మంగలి దుకాణాని కి వెళ్లవద్దు. అవసరమనుకుంటే క్షవరం చేసేవా రి చేతులను శుభ్రపరిచి.. సొంత పరికరాలను సమకూర్చాకే క్షవరం చేయించుకోవాలి.
- మీరు బయటకు వెళ్లినప్పుడు బెల్ట్, రింగులు, రిస్ట్ వాచ్ ధరించవద్దు. వాచ్ అవసరం లేదు.
- మీరు బయటి నుంచి ఇంటికి వచ్చినప్పు డు మీ చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోండి.
- మీరు కరోనా అనుమానాస్పద రోగికి దగ్గరగా వచ్చారని అనిపించినప్పుడు పూర్తిగా స్నానం చేయండి. వచ్చే 6 నెలల నుంచి 12 నెలల వరకు లాక్‌డౌన్ ఉన్నా.. లేకపోయినా పై నియమాలు పాటించండి.
నేటి నుంచి మద్యం అమ్మకాలు
మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని 168 మద్యం దుకాణాలు సోమవారం తెరచుకోనున్నాయి. దుకాణం వద్ద ఐదుగురికి మాత్రమే అనుమతిస్తారు. భౌతిక దూరం తప్పనిసరి. మరో వైపు మద్యం రేట్లను సైతం 25 శాతం పెంచి మద్య నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. దుకాణాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరచి ఉంటాయి. గ్రీన్‌జోన్ కావడంతో విజయనగరం డిపో నుంచి 36, సాలూరు డిపో నుంచి 20, ఎస్.కోట నుంచి 9, పార్వతీపురం డిపో నుంచి 26 బస్సులు నడిపేందుకు తొలుత సిద్ధమయ్యారు. అయితే, బస్సుల రాకపోకలకు కలెక్టర్ అనుమతించలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు బస్సుల రాకపోకలు ఉండవు.
Comments
Please login to add a commentAdd a comment