టీడీపీ అక్రమాలు.. రూ.కోటిన్నర మాయం | TDP Leaders Corruption In Co Operative Societies | Sakshi
Sakshi News home page

అవినీతిలో ‘సహకారం’..

Published Thu, Aug 6 2020 8:37 AM | Last Updated on Thu, Aug 6 2020 8:44 AM

TDP Leaders Corruption In Co Operative Societies - Sakshi

గతమంతా ఘన చరిత్ర...అయితే అవినీతితో అన్నట్టుగా ఉంది టీడీపీ పాలన. అన్నీ పక్కాగా సాగాల్సిన సహకార సొసైటీల్లో కూడా కోట్ల రూపాయల స్వాహాకు పాల్పడ్డారు. తెలుగు తమ్ముళ్లు. తరువాత అధికారం తమదేనన్న ధీమాతో బినామీల పేరుతో...సెంటు భూమిలేని వ్యక్తుల పేరుతో నిధులను పక్కతోవ పట్టించారు. కళ్లుమూసుకొని పాలుతాగుతూ పిల్లి ఎవరూ చూడడం లేదన్న రీతిలో సొసైటీల్లో ఖజానా గుల్ల చేసేశారు. అనంతరం డీసీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంత ఉదయ భాస్కర్‌ ఈ అక్రమాలపై దృష్టి సారించడంతో వ్యవహారం బట్టబయలైంది. 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘కంచే చేను మేసింద’నే సామెతను తలపించే రీతిలో సహకార సంఘాలను అధికారులే కొల్లగొట్టేశారు. సంఘాలలో పనిచేస్తూ ప్రగతికి పాటుపడాల్సిన సంబంధితాధికారులు, ఉద్యోగులే సంఘాలను గుల్ల చేసిపోయారు. గత తెలుగుదేశం పార్టీ పాలకవర్గం ఏలుబడిలో తెలుగు తమ్ముళ్లు, అధికారులు కుమ్మక్కై గత ఐదేళ్లలో పలు అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఏ సంఘాన్ని కదిపినా అవినీతి, అవకతవకలే కదలాడుతున్నాయి. అప్పట్లో డీసీసీబీ పాలకవర్గం, సీఈఓ సహా అధికారుల సంఘాలు, బ్రాంచీల్లో జరుగుతున్న అవినీతి కుంభకోణాలను చూసీచూడనట్టు ప్రేక్షకపాత్ర పోషించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి డీసీసీబీ చైర్మన్‌గా అనంత ఉదయభాస్కర్‌ బాధ్యతలు స్వీకరించాక నాటి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వద్దిపర్రు సొసైటీ, ఆత్రేయపురం బ్రాంచి అధికారులు అడ్డంగా దోచేసిన రైతుల సొమ్ము అక్షరాలా రూ.1.37 కోట్లుగా లెక్క తేలింది. అనుమానం వచ్చి ఆడిట్‌ నిర్వహించడంతో ఈ కుంభకోణం బయటపడింది. 2019 మార్చి వరకూ జరిగిన లావాదేవీలపై ఆడిట్‌లో బయటపడింది కానీ లేకుంటే ఇది బయటపడేదే కాదు. ఈ కుంభకోణాన్ని వద్దిపర్రు పర్సన్‌ ఇన్‌చార్జి కొరుప్రోలు వెంకటేశ్వరరావు బయటపెట్టారు. 

వద్దిపర్రు సొసైటీలో... 
టీడీపీ ఏలుబడిలో సొసైటీలో 55 మంది బినామీ రైతుల పేర్లతో సుమారు రూ.54 లక్షలు దిగమింగేశారు. సొసైటీలో జరిపిన ఎరువుల లావాదేవీల సొమ్ము రూ.60 లక్షలు, నగదు నిల్వ రూ.23 లక్షలు కూడా మాయం చేసేశారు. వద్దిపర్రు, పేరవరం గ్రామాల్లో అసలు సెంటు భూమంటూ లేని, నిరక్షరాస్యులైన వ్యవసాయ కూలీల పేరుతో లక్షలు రుణాలు తీసేసుకున్నారు. ఈ సొసైటీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సీఈఓ ఆచంట మునీశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన లావాదేవీలపై జరిపిన ఆడిట్‌లో ఈ కుంభకోణం వెలుగులోకి చూసింది.  

పేరవరం గ్రామానికి చెందిన కొండ్రు నాంచారావు సన్‌ఆఫ్‌ పల్లయ్య  రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ. ప్రభుత్వం ఇచ్చిన పక్కా గృహంలో నివాసం ఉంటున్నాడు. అతని పేరున రూ.17.30 లక్షలు రుణం వద్దిపర్రు సొసైటీ రికార్డుల్లో ఉంది. సెంటు భూమి లేదు. అయినా నాంచారావు పేరున  స్వల్పకాలిక రుణం రూ.3 లక్షలు, స్వల్పకాలిక ఇతర రుణం రూ.9.70 లక్షలు, దీర్ఘకాలిక రుణం రూ.4.60 లక్షలు, మొత్తంగా రూ.17.30 లక్షలు రుణం దోచేశారు. 

ఏవీ చూడకుండానే... 
రుణం ఇవ్వాలంటే ముందు బ్రాంచి మేనేజర్, సూపర్‌వైజర్‌ కచ్చితంగా భూమిని పరిశీలించాలి. భూ తనఖా రిజిస్ట్రేషన్‌ నంబరు, అతని పేరున భూమి ఉందా లేదా, భౌతికంగా కూడా చూడాలి. అదే రూ.3 లక్షలు రుణం వరకూ బ్రాంచి స్థాయిలో పరిశీలన జరిపితే సరిపోతుంది. రూ.3 లక్షలు దాటి రుణం ఇవ్వాల్సి వస్తే డీసీసీబీ స్థాయిలో పరిశీలన జరపాలనేది నిబంధన. కానీ ఇవేమీ చూడకుండానే కళ్లుమూసుకుని సెంటు భూమి లేని నాంచారావు పేరున రూ.17.30 లక్షలు రుణం గుటకాయ స్వాహా చేశారు. 
వద్దిపర్రు గ్రామంలో ఉప్పే కొండయ్య సన్‌ ఆఫ్‌ పెరుమాళ్లు. ఇతనికి 0.6 సెంట్లు భూమి ఉంది. దీనిని 0.67 సెంట్లుగా రికార్డు చూపించారు. అంటే 61 సెంట్లు పెంచి చూపించారు. స్వల్పకాలిక రుణ బాండ్‌లో 67 సెంట్లు చూపించారు. తీరా కొండయ్య పేరున సొసైటీలో తనఖా పెట్టిన బాండును అక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పరిశీలిస్తే ఆ బాండు నంబర్‌ 949/2012తో కరుటూరి మాధవి పేరున రిజిస్టరై ఉందని తేలింది. ఇలా ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు పీఏసీఎస్‌ ద్వారా 55 మందికి రూ.54 లక్షలు పంట రుణాలు ఇచ్చినట్టు రికార్డు ఉంది. రుణాలు ఇవ్వాలంటే టైటిల్‌ డీడ్, బాండ్‌ పేపర్లు  సొసైటీ తరువాత బ్రాంచిలో డిపాజిట్‌ చేయాలి. కానీ ఇక్కడ సొసైటీ సీఈఓ సహా కొందరు బ్రాంచి అధికారులు భూమి లేని వారికి భూమి ఉన్నట్టు, భూముల విస్తీర్ణం పెంచేసి, టైటిల్‌ డీడ్‌లు లేకుండానే ఉన్నట్టు, బాండ్‌ పేపర్లు నకిలీవి సృష్టించడం...ఇలా రికార్డుల మాయాజాలంతో లక్షలు దారిమళ్లించి రైతుల నోట మట్టికొట్టారు. 

ఓ రైతుకు రుణం ఇవ్వాలంటే... 
స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం టైటిల్‌ డీడ్, బాండ్‌ కచ్చితంగా ఉండాలి. వీటిని  రైతుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకుంటారు. సొసైటీ స్థాయిలో సీఈఓ పరిశీలన జరిపి డీసీసీబీ బ్రాంచికి అందజేయాల్సి ఉంటుంది. ఆ బ్రాంచి మేనేజర్‌ రికార్డు ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందాక బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఆ రుణం కూడా నేరుగా రైతుకే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రైతుకు రుణం అందుకోవాలంటే ఇంతటి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటే వద్దిపర్రు సొసైటీలో మాత్రం ఈ నిబంధనలన్నింటినీ గాలికొదిలేసినా డీసీసీబీ స్థాయిలో అప్పటి సీఈఓ సహా ఉన్నతాధికారులు, ఆత్రేయపురం బ్రాంచి మేనేజర్‌ ఎం.క్రాంతి కృష్ణ పర్యవేక్షణ ఏమి చేశారని ఆ ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ సీఈఓ ఆచంట మునీశ్వరరావు, సూపర్‌వైజర్‌ మహలక్ష్మిరాజు(పదవీ విరమణ) అక్కడి తెలుగు తముళ్లు తెరవెనుక ఈ కథ నడిపించారని రైతులు ఆరోపిస్తున్నారు. 

ఎరువుల లావాదేవీల్లోనూ... 
ఎరువుల లావాదేవీల సొమ్ము రూ.60 లక్షలు, మార్చి 2019 నాటికి ఉండాల్సిన నగదు నిల్వ రూ.23 లక్షలలో మాయాజాలమే జరిగింది. తమకు తెలియకుండా తమ పేరున రుణాలు కాజేసిన వ్యవహారం ఆనోట, ఈనోటా రైతులకు చేరడం, ఇంతలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి వద్దిపర్రు పర్సన్‌ ఇన్‌ఛార్జిగా కొరుప్రోలు వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, కుంభకోణంపై ఆడిట్‌ నిర్వహించడం ద్వారా స్వాహా అయిన నిధులను బాధ్యుల నుంచి తిరిగి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా కోటి రూపాయల వరకు రికవరీ చేసినట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. మిగిలిన మొత్తం కూడా వసూళ్లు చేస్తామన్నారు. సొమ్ము రాబట్టి బాధ్యులను విడిచిపెట్టేస్తే ఇలాంటి కుంభకోణాలు పునరావృతం అవుతాయని, బాధ్యులపై చర్యలకు డీసీసీబీ స్థాయిలో కొందరు అధికారులు అడ్డంపడుతున్నారని తెలిసింది. ఇటీవల గోకవరం బ్రాంచిలో బంగారం, దీర్ఘకాలిక రుణాలలో అవినీతిని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో బాధ్యుడైన మేనేజర్‌ ఎస్‌ఎ హుస్సేన్‌ నుంచి బంగారం, నగదు రికవరీ చేసి విధులకు దూరంగా ఉంచారు.  వద్దిపర్రు సొసైటీ సీఈఓ మునేశ్వరరావుపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆత్రేయపురం బ్రాంచిలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని  రైతు ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. 

రుణాలు నొక్కేసింది వీరి పేర్లతోనే...
పోతుల శ్రీరామ్‌-రూ.3 లక్షలు 
పోతుల ఏసుప్రభావతి-రూ.3 లక్షలు 
గుడే సునీత-రూ.3 లక్షలు 
బొజ్జా రాజేశ్వరి-రూ.3 లక్షలు 
బొజ్జా తులసీరావు-రూ.3లక్షలు 
మద్దిపోతి శ్రీనివాసరావు-రూ.13,700లు 
మద్దెల అర్జియ్య-రూ.2లక్షలు 
అత్తిలి రామాంజనేయులు-రూ.2 లక్షలు 
అత్తిలి గోవిందు-రూ.2 లక్షలు 
వరదా రాంబాబు-రూ.2.40లక్షలు 
మద్దిపోతు విజయలక్ష్మి-రూ.1.75 లక్షలు 
గన్నమేని అనసూయ-రూ.1.50 లక్షలు 
ఎస్‌ వెంకటేశ్వర్లు-రూ.లక్ష 

అవకతవకలు వాస్తవమే.. 
వద్దిపర్రు సొసైటీలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. ఆ విషయాలు నా దృష్టికి కూడా వచ్చాయి. దానిపై ఆడిట్‌ కూడా నిర్వహించాం. బాధ్యులపై విచారణతోపాటు సొమ్ము రికవరీ చేస్తున్నాం. ఇటువంటి అవకతవకలు జరగకుండా బ్రాంచి, సహకార సంఘాల్లో పనిచేస్తున్న వారిని భవిష్యత్తులో బదిలీలు చేసేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
– ప్రవీణ్‌కుమార్, డీసీసీబీ సీఈవో 

అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం
సొసైటీలో అవకతకవలు జరిగినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. ప్రతి పైసా సొసైటీకి తిరిగి వచ్చే వరకూ పోరాడతాం. సొసైటీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. 
– కొరుప్రోలు వెంకటేశ్వరరావు,  వద్దిపర్రు సొసైటీ చైర్మన్, ఆత్రేయపురం మండలం  

సహకార సంఘాలను భ్రష్టు పట్టించిన టీడీపీ
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సహకార సంఘాలను భ్రష్టుపట్టించారు. తెలుగు తమ్ముళ్లు కొందరు సహకారంతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకుతిన్నారు. అటువంటిదే మా నియోజకవర్గంలో పలివెలలో జరిగింది. పలివెలలోని సహకార సంఘ పరిధిలో రెండు భవనాల నిర్మాణానికి రూ.35 లక్షలు విడుదల చేశారు. కానీ అక్కడ నిర్మించింది ఒకే భవనం. నేను స్వయంగా అక్కడ జరిగిన అవినీతిని నాడు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు తీసుకోలేదు. పదేపదే ఒత్తిడి తీసుకొచ్చిన మీదట మొక్కుబడిగా విచారణ చేసి రూ.6 లక్షలు అవినీతి జరిగినట్టు తేల్చారు. టీడీపీ అధికారం కోల్పోయిన సమయానికి కూడా అవినీతి సొమ్ము రికవరీ చేయలేకపోయింది.  
– చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement