తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగు  | TDP Irregularities In Cooperative Society East Godavari | Sakshi
Sakshi News home page

'పచ్చ'దారుణం

Published Mon, Jun 8 2020 8:33 AM | Last Updated on Mon, Jun 8 2020 8:49 AM

TDP Irregularities In Cooperative Society East Godavari - Sakshi

దొంగలు.. దొంగలూ ఊళ్లు పంచుకున్నట్టు తెలుగు తమ్ముళ్లు జగ్గంపేట సొసైటీలో సొమ్మును మెక్కేశారు. నకిలీ పాస్‌ పుస్తకాలతో జరిగిన ఈ కుంభకోణంలో రూ.ఆరు కోట్లకు పైగా అవినీతి జరిగిందని సమాచారం. నాటి పచ్చపాలనలో విచ్చలవిడిగా సాగిన ఈ అవినీతిపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై సెక్షన్‌ 51 ప్రకారం విచారణ జరుగుతోంది.

సాక్షి, రాజమహేంద్రవరం: తెలుగు తమ్ముళ్లు ఒక సహకార సంఘంపై పడి నిలువు దోపిడీ చేశారు. నేతల దోపిడీ రూ.ఆరు కోట్లపై మాటేనని ప్రాథమిక సమాచారం. నిజాలు నిగ్గు తేలితే దోపిడీ రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. కింది నుంచి పై స్థాయి వరకూ అందరికీ తెలిసే పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ రుణాల కుంభకోణం జరిగిందని చెప్పేందుకు పలు ఆధారాలు కనిపిస్తున్నాయి. తమ్ముళ్లు వందకుపైనే నకిలీ పాస్‌ పుస్తకాలు కూడా తయారు చేశారు. తెలుగుదేశం పార్టీ కీలక నేతల కనుసన్నలో ఇదంతా జరిగింది. సొసైటీలో రికార్డులనే మాయం చేసేశారు.

గత సర్కార్‌లో అడ్డగోలుగా పచ్చ నేతలు మెక్కేసిన రైతుల సొమ్ము ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది. క్షేత్ర స్థాయిలో సహకార సంఘం దగ్గర నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ వరకూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ఇలా అడుగడుగునా అవినీతి జ్యోతిలా వెలిగిపోయింది. ఈ రుణాల కుంభకోణం వ్యవహారం సహకార సంఘం సీఈఓ అడ్డగళ్ల సాయిరాం ఉసురు తీసింది. రెండుసార్లు నోటీసులు అందుకున్న సీఈఓ సాయిరాం విచారణకు హాజరుకాకుండానే మృతిచెందారు. అప్పట్లో ఆయన మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. చదవండి: తిరుమల శ్రీవారి దర్శనం షురూ

కొనసాగుతున్న విచారణ 
మెట్ట ప్రాంతంలో లంపకలోవ సొసైటీలో బినామీ రుణాల బాగోతం మరిచిపోకుండానే జగ్గంపేట సొసైటీలో రుణాల కుంభకోణంపై విచారణ జరుగుతోంది. జగ్గంపేట విశాల వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్‌పర్సన్‌గా 2013 జనవరి నుంచి టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి మణి ఉన్నారు. 2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొసైటీల్లో అవినీతి ప్రక్షాళన కోసం పాత కమిటీలను రద్దు చేసి ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేసింది.

ఆ క్రమంలోనే  సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా బుర్రి విష్ణుచక్రం (చక్రబాబు) నియమితులయ్యారు. ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత సొసైటీ రికార్డులు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. లావాదేవీల్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలున్న నేపథ్యంలో గతేడాది ఆగస్టులో జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేయడంతో సహకార చట్టం సెక్షన్‌ 51 ప్రకారం విచారణకు ఆదేశించిన సంగతి పాఠకులకు విదితమే. విచారణాధికారి శివకామేశ్వరరావు గత డిసెంబర్‌ 9 నుంచి విచారణ నిర్వహిస్తున్నారు. 

అంతా బినామీ భాగోతమే... 
సహజంగా ఒక మధ్యతరగతి రైతు అన్ని ధ్రువీకరణ పత్రాలతో రుణం కోసం సహకార సంఘానికి వెళితే సవాలక్ష సాకులతో నెలల తరబడి తిప్పుకుంటారు. అటువంటిది 110 మంది బినామీలు రైతుల ముసుగేసుకుని నకిలీ పాసు పుస్తకాలతో రూ.కోట్లు కొట్టేశారు. కోనసీమలోని రాజోలు ప్రాంతంలో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ పాసు పుస్తకాలు తయారుచేయడంలో చేయి తిరిగిన ముఠా ద్వారానే జగ్గంపేట సహకార సంఘంలో దాఖలు చేసిన నకిలీ పాసు పుస్తకాలు తయారు చేశారని విశ్వసనీయ సమాచారం. పాసు పుస్తకాలు, వాటి సర్వే నంబర్లు, ఆ సర్వే నంబర్లు వాస్తవమా కాదా అనేది కనీసం పరిశీలన లేకుండా సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయంలో రిజి్రస్టేషన్‌ కూడా చేశారు. వాటిని సొసైటీలో పెట్టినప్పుడు కనీసం సొసైటీ పరిశీలన జరపాలి. చదవండి: నవవధువు అనుమానాస్పద మృతి

అక్కడంతా తెలుగు తమ్ముళ్లే ఉండటంతో పక్కా పథకం ప్రకారమే క్రెడిట్‌ లిమిట్‌ కోసం డీసీసీబీ బ్రాంచికి, అక్కడి నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు పంపించేశారు. ఆ సమయంలో జగ్గంపేట డీసీసీబీ బ్రాంచిలో కూడా టీడీపీ ప్యానలే ఉండటంతో కనీసం పరిశీలన జరపకుండా బినామీ పాసు పుస్తకాలపై రుణాలు ముంజూరు చేసి దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకున్నట్టు జగ్గంపేట విశాల పరపతి సంఘంలో రూ.కోట్లు కొల్లగొట్టేశారు. అప్పటి పాలకవర్గం కనుసన్నల్లో సుమారు 110 మంది తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగులేసి నకిలీ పాసు పుస్తకాలతో రూ.3 కోట్లు వరకు ముట్టజెప్పారని ప్రాథమిక సమాచారం. బినామీ రైతులంతా జగ్గంపేట, ప్రత్తిపాడు, కిర్లంపూడి, ఏలేశ్వరం తదితర మండలాలకు చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా మెట్ట ప్రాంతంలో పచ్చ నేతల కొమ్ముకాసిన ద్వితీయ శ్రేణి నేతలే. రుణాలు పొందినప్పటి నుంచి ఇప్పటి వరకూ వడ్డీలు లెక్క కట్టి చూస్తే రుణాల కుంభకోణం విలువ రెట్టింపు అయ్యే అవకాశాలే ఉన్నాయి.

ప్రైవేటు ఆడిట్‌తో అక్రమాలు కప్పిపుచ్చిన వైనం 
సంఘాల్లో ఏటా ప్రభుత్వ ఆడిట్‌లు నిర్వహిస్తుండాలి. ఈ సంఘంలో 2014–15 నుంచి 2018–19 వరకూ జరిగిన కార్యకలాపాలపై ప్రైవేటు ఆడిట్‌ నిర్వహించి అక్రమాలను కప్పిపుచ్చారనే ఆరోపణలున్నాయి. సొసైటీ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులన్నింటినీ మాయం చేసేశారు.110 బినామీ రుణాల్లో 17 మంది నుంచి రుణాలు తిరిగి వసూలు చేయగలిగారు. ఈ సొసైటీలో కుంభకోణం రుణాలకే పరిమితం కాలేదు.

భవన నిర్మాణాలు, నగదు లావాదేవీలు, ఎరువుల కొనుగోళ్లు, ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ప్రస్తుత సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణానికి సొసైటీ నుంచి అధికారికంగా రూ.40 లక్షలకు అనుమతి తీసుకుని అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో వెనుకా ముందూ చూడకుండా చేతి రసీదు పేరుతో రూ.90 లక్షలు ఖర్చు చూపించారని డీసీసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఆ మేరకు రూ.50 లక్షలు దారి మళ్లాయంటున్నారు. ఎరువుల కొనుగోలులో సుమారు రూ.16 లక్షలు, నగదు లావాదేవీల్లో సుమారు రూ.40 లక్షలు..ఇలా అవినీతి భాగోతం రూ.కోటిపైనే ఉంటుందని లేస్తున్నారు. 

డీసీసీబీ అధికారులకు 20శాతం కమీషన్‌ 
ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు ప్రధాన భూమిక పోషించారు. జగ్గంపేట సహకార సంఘం నుంచి రుణాల కోసం ప్రతిపాదనలు వచ్చినప్పటికీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మంజూరు చేయాల్సి ఉంది. కానీ డీసీసీబీలో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. ప్రతి రుణంపైన డీసీసీబీలో అప్పటి అధికారులు 20 శాతం కమీషన్‌ తీసుకొని అనుమతి ఇచ్చారని సమాచారం. చదవండి: భలే భలే.. నేనూ పోలీసునే..

ఉన్నతాధికారుల ఆదేశాలతోనే విచారణ
జిల్లా సహకార అధికారుల ఆదేశాల ప్రకారం గత ఏడాది డిసెంబర్‌ నెల నుంచి విచారణ చేస్తున్నాం. సంఘ«ంలో రికార్డులు అందుబాటులో లేకపోవడంతో కొంతకాలం, సీఈఓ మృతి చెందడంతో మరి కొంతకాలం విచారణలో జాప్యం జరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల నుంచి విచారణ ముందుకు సాగలేదు. బినామీ పేర్లతో రుణాలు పొందడం, ఎరువుల అమ్మకాలు, నగదు లావాదేవీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. విచారణ అనంతరం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం.
– జె.శివకామేశ్వరరావు, సబ్‌ డివిజినల్‌ సహకార అధికారి, విచారణాధికారి, సహకార శాఖ 

నిజాలు నిగ్గు తేలుస్తాం
నేను త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక గత పాలకవర్గంలో చోటుచేసుకున్న అవకతవకలు నా దృష్టికి వచ్చాయి. బినామీ పేర్లు, నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు దారి మళ్లించారని సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే వాటిని నివృత్తి చేసి సొసైటీకి అప్పగించాలని నేను జిల్లా సహకార అధికారికి విజ్ఞప్తి చేశాను. ఆ ఫిర్యాదు తరువాతే విచారణాధికారిని నియమించారు. ఇప్పుడు 51 విచారణ జరుగుతోంది. నిజాలు నిగ్గు తేలుస్తాం.
– బుర్రి విష్ణుచక్రం (చక్రబాబు), త్రిసభ్య కమిటీ చైర్మన్, జగ్గంపేట సొసైటీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement