కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య | Bride Commited Suicide In East Godavari District | Sakshi
Sakshi News home page

నవ వధువు ఆత్మహత్య 

Published Sat, Aug 1 2020 9:00 AM | Last Updated on Thu, Sep 30 2021 7:16 PM

Bride Commited Suicide In East Godavari District - Sakshi

అల్లారు ముద్దుగా పెంచిన కన్నకూతురు కాళ్ల పారాణి ఆరకముందే కడతేరిపోతుందని ఆ తల్లిదండ్రులు ఉహించలేదు. సంతోషం నిండాల్సిన ఆ ఇంటా విషాదం కుటుంబాన్ని కలచి వేస్తోంది. పెళ్లి ఇష్టం లేకో... లేక చదువు మధ్యలోనే ఆగిపోతుందనో... ఏమైనా ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. కూతురి మరణాని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.  

సాక్షి, మండపేట: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని వై. సీతానగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆమె మృతి పెళ్లి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా మృతురాలు ఇటీవల లవ్‌ ఫెయిల్యూర్‌ కథనాంశంగా రూపొందించిన హరర్‌ షార్ట్‌ ఫిలిమ్‌లో ప్రధాన పాత్రలో నటించినట్టు సమాచారం. మండపేట రూరల్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని వై. సీతానగరానికి చెందిన మహదాసు శ్రీను, మంగ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రమ్య శ్రీదేవి (20) డిగ్రీ చదువుతోంది. రమ్య శ్రీదేవికి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణ ఈశ్వరం గ్రామానికి చెందిన మేనమామతో బుధవారం తల్లిదండ్రులు వివాహం జరిపించారు.

శనివారం ఆమెను అత్తవారి ఇంటికి పంపాల్సి ఉంది. కాగా శుక్రవారం ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. తహసీల్దార్‌ సీహెచ్‌ నాగలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కాళ్ల పారాణి ఆరకముందే అఘాయిత్యానికి పాల్పడటంపై తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ శివప్రసాద్‌ పర్యవేక్షణలో రూరల్‌ హెచ్‌సీ మూర్తి కేసు నమోదుచేశారు. ఇష్టం లేని పెళ్లి కావచ్చని, లేదా చదువు ఆగిపోతుందన్న బాధతోనైనా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతురాలి ఫోన్‌ కాల్‌డేటా వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.  
షార్ట్‌ ఫిల్మ్‌లో నటించిన రమ్య? 
మృతురాలు రమ్య ఇటీవల డార్క్‌ వేలంటైన్‌ షార్ట్‌ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా నటించినట్టు తెలిసింది. లవ్‌ ఫెయిల్యూర్‌ ప్రధానాంశంగా రూపొందించిన ఈ హరర్‌ షార్ట్‌ ఫిల్మ్‌ 2వ తేదీన విడుదల కానున్నట్టు సమాచారం. కాగా ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. నవవధువు ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.   

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement