
రాజమహేంద్రవరం రూరల్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజారోగ్యానికి హానికరమైన సారాను నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షణలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎ.రమాదేవి ఆధ్వర్యంలో రెండు నెలల పాటు పోలీసు, ఎస్‌ఈబీ సిబ్బంది కలిసి ‘ఆపరేషన్ పరివర్తన 2.0’ స్పెషల్ డ్రైవ్‌ను ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకూ చేపట్టారు.
‘ఆపరేషన్ పరివర్తన 2.0’లో ఇలా..
సెబ్, పోలీసు అధికారులు, ఏపీఎస్పీ సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి సారా తయారీ కేంద్రాలు, అమ్మకాలు జరిపే ప్రదేశాల్లో దాడులు ఉధృతం చేస్తున్నారు.
జిల్లాలో సారా తయారీ, సరఫరా, అమ్మకాలు జరిపే గ్రామాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు చేసి, పరివర్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సారా తయారీ, అమ్మకాలు, సరఫరా చేసే వారిపై, సారా తయారీకి వాడే ముడిసరుకులు అమ్మిన వారి పైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు.
పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు.
షరతులతో కూడిన బెయిల్‌ను ధిక్కరిస్తే ఆ బెయిల్ రద్దు కోరుతూ కోర్టు ఎదుట మెమో ఫైల్ చేశారు.
మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద రూ.2 లక్షల వరకూ నిందితుల బైండోవర్ చేస్తున్నారు. గత వారంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 698 నిందితులను బైండోవర్ చేశారు.
బైండోవర్ బాండు అతిక్రమించిన వారి నుంచి సంబంధిత బాండు మొత్తాన్ని జరిమానాగా వసూలు చేశారు.
బెల్లం వ్యాపారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి, సారా తయారీదార్లకు అమ్మకాలు జరపకూడదని హెచ్చరించారు.
సారా అమ్మకాలు, తయారు చేసే 30 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి ఒక ఏడాది పాటు జైలులో ఉంచేలా చర్యలు చేపట్టారు.
కేసుల విచారణలో పురోగతి, లోపాల సవరణ కోసం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ), స్టేషన్ అధికారులకు, కోర్టు కానిస్టేబుల్‌లతో కలిపి ఎస్పీచే స్పెషల్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు.
మహిళా పోలీసుల భాగస్వామ్యం
ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్‌ఈబీ జాయింట్ డైరెక్టర్ రమాదేవి జిల్లాలోని 300 మంది మహిళా పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సారా తయారీ, అమ్మకాలు లేకుండా చేసేందుకు ఎప్పటికప్పుడు పోలీసులకు, ఎస్‌ఈబీ అధికారులకు సమాచారం అందించి సారా రహిత గ్రామాలుగా మార్చడంలో భాగస్వాములను చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ద్వారా జీవనోపాధి చూపిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో, సారా అమ్మకాన్ని జీవనోపాధిగా తీసుకున్న కుటుంబాలను గుర్తిస్తున్నారు. సారాకు బానిసైన వారిని డీ–అడిక్షన్ సెంటర్లలో చేర్చి, సారా మానేసేలా చేయాలని ఎస్‌ఈబీ జేడీ రమాదేవి ఆదేశించారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూము ఫోన్ నంబర్ 94932 06171కు 24 గంటలూ సారాపై ఫిర్యాదులు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. ఇలా అనేక విధాలుగా సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
‘ఆపరేషన్ పరివర్తన 2.0’ స్పెషల్ డ్రైవ్ ప్రభావం
ఆపరేషన్ పరివర్తన 2.0 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 నుంచి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 200 కేసులు నమోదు చేసి 149 మందిని అరెస్టు చేశారు. 3,639.5 లీటర్ల సారా, ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 80,300 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. 575 మందిని బైండోవర్ చేశారు. బ్రీచ్ అయిన వారి నుంచి రూ.1.25 లక్షలు వసూలు చేశారు.
సారా రహిత గ్రామాలుగా..
గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్కువ జరిగింది. ముఖ్యంగా ఒకప్పుడు సారా తయారీకి మారుపేరైన కవలగొయ్యి, పిడింగొయ్యి, రఘునాథపురం గ్రామాల్లో సారా తయారీ, అమ్మకం 80 శాతం వరకు మాని వేరే పనుల్లోకి వెళుతున్నారు. వెంకటనగరం గ్రామం మీద ప్రత్యేకించి దృష్టి సారించి గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో సారాను పారదోలేందుకు వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సారా అమ్మకాలపై కఠిన చర్యలు
జిల్లాలో సారా తయారీ, సరఫరా, అమ్మకాలు, సారా తయారీకి అవసరమైన ముడి సరకులు (బెల్లం తదితర పదార్థాలు) అమ్మినా, పెట్టుబడి పెట్టినా, ఆర్థిక సహకారం అందించినా ఏ ఒక్కరినీ ఉపేక్షించం. అందరి మీదా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసుల్లో పలుమార్లు అరెస్టు అయిన ముద్దాయిలపై పీడీ చట్టం ప్రయోగిస్తాం. సారా రహిత గ్రామాల కోసం ‘ఆపరేషన్ పరివర్తన 2.0’ లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఈ బృహత్తర లక్ష్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగస్వాములు కావాలి.
– ఐశ్వర్య రస్తోగి, ఎస్పీ, తూర్పు గోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment