సాక్షి, మారేడుమిల్లి: జోరుగా వానలు కురుస్తున్న వేళ.. అణువణువునా ఆకుపచ్చదనం సంతరించుకుని, కొత్త శోభతో మెరిసిపోతున్న మన్యసీమ ఒడిలో విహరిద్దామని వచ్చిన ఆ యువకులు.. చివరకు మృత్యుదేవత ఒడిలో ఒరిగిపోయారు. విజయవాడతో పాటు తెలంగాణకు చెందిన ఆ యువకులు మారేడుమిల్లి అందాలు చూద్దామని బయలుదేరారు. వారి ప్రయాణం చివరకు విషాదంతమైంది. వారు ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా వస్తూ, మారేడుమిల్లికి కిలోమీటరు దూరంలోని వుడ్ కాటేజీ వద్ద మలుపులో ఆదివారం ఓ చెట్టును ఢీకొని, అదుపు తప్పి, పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన పులి ప్రవీణ్‌కుమార్ (24), పూర్ణసాయి (24), తెలంగాణ రాష్ట్రం కొత్తగూడేనికి చెందిన భరత్ (24) అక్కడికక్కడే మరణించారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నదీర్ బాషా, కొత్తగూడేనికి చెందిన షేక్ అసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. (కొట్టి చంపి.. గోతంలో వేసి..!)
ట్రాఫిక్ స్తంభించడంతో బారులుతీరిన వాహనాలు
ఆనందంగా గడపాలని బయలుదేరి..
ఆ ఐదుగురు యువకులూ డిగ్రీ, డిప్లమా వరకూ చదువుకున్న చిన్ననాటి స్నేహితులు. ఏజెన్సీ అందాలను తిలకిస్తూ, రెండు రోజుల పాటు ఆనందంగా గడపాలని కారులో బయలుదేరి, ప్రమాదానికి గురయ్యారు. విజయవాడకు చెందిన ప్రవీణ్‌కుమార్, పూర్ణసాయి కొత్తగూడెంలోని స్నేహితుల వద్దకు శనివారమే బయలుదేరారు. అక్కడ ఇద్దరు స్నేహితులను కలిసి, అక్కడే రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం పాల్వంచ చేరుకుని, మరో మిత్రుడు నదీర్ బాషాను కలిశారు. అక్కడి నుంచి మారేడుమిల్లి అందాలను తిలకించేందుకు కారులో బయలుదేరారు.
ఘాట్ రోడ్డులో వారి ప్రయాణం సాఫీగా సాగింది. మారేడుమిల్లి వుడ్ కాటేజీకి కొద్ది దూరంలో మలుపు ఉంది. అక్కడకు వేగంగా రావడంతో ఆ మలుపులో కారును అదుపు చేయలేకపోయారు. దీంతో ఆ కారు చెట్టును ఢీకొని, పల్టీలు కొట్టి, రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో చాలాసేపు ఆ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వాహన చోదకులు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment