
భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన 26 శాతం సుంకాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయి. ఊరగాయ దోసకాయలు(జెర్కిన్స్) భారత్ నుంచి అమెరికాకు పెద్దమొత్తంలో ఎగుమతి అవుతున్నాయి. భారత్ దిగుమతులపై యూఎస్ విధించిన టారిఫ్‌లతో ఈ పంట రైతులకు నష్టం వాటిల్లనుందని నిపుణులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 256.58 మిలియన్ డాలర్ల(రూ.2,124 కోట్లు) విలువైన 2.44 లక్షల టన్నుల జెర్కిన్స్‌ను అమెరికాకు ఎగుమతి చేసింది. 2019-2020 ఏడాదిలో ఇది 1.89 లక్షల టన్నులతో రూ.173 మిలియన్ డాలర్లు(రూ.1,400 కోట్లు)గా ఉండేది.
ఇప్పటికే అమెరికాలో 9 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న భారత పారిశ్రామిక రంగానికి ఈ సుంకాల పెంపు పెద్ద దెబ్బే. పెరిగిన టారిఫ్‌ల వల్ల మెక్సికో, కెనడా, టర్కీ వంటి దేశాలతో పోలిస్తే భారత జెర్కిన్స్‌కు పోటీ తక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జెర్కిన్స్‌కు సంబంధించి యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (యూఎస్‌ఎంసీఏ) కింద మెక్సికో, కెనడా సుంకం మినహాయింపుల నుంచి ప్రయోజనం పొందుతాయని ఇండియన్ జెర్కిన్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ పూవయ్య తెలిపారు. టర్కీపై భారత్ కంటే సుమారు 10 శాతం తక్కువ సుంకాన్ని విధించినట్లు చెప్పారు.
99 శాతం ఎగుమతులే..
భారతదేశంలో జెర్కిన్ ఉత్పత్తి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అధికంగా ఉంది. వీటిపై అమెరికా లెవీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానాలపై ఆధారపడిన వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు దీనివల్ల ప్రభావితం చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే జెర్కిన్స్‌లో 99% పైగా ఎగుమతి అవుతున్నవే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?
అమెరికా మార్కెట్‌లో ఇండియా ఉత్పత్తులు పోటీతత్వాన్ని కోల్పోవడంపై పూవయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలను మునుపటి స్థాయికి పునరుద్ధరించడానికి ద్వైపాక్షిక చర్చలు జరపాలన్నారు. ఇరు దేశాలకు అనువైన విధానాలు అమలయ్యేలా పరిష్కారాలు ఆలోచించాలన్నారు.