డైవర్లతో గుహలో పిల్లలు
సాక్షి, వెబ్ డెస్క్ : కాలం ఆగిపోతే బావుణ్ణు. సెకన్లు, గంటలు, రోజులు గడుస్తున్న కొద్దీ థామ్ లూవాంగ్ గుహలో చిక్కుకుపోయిన 13 మంది(12 మంది పిల్లలు+వారి ఫుట్‌బాల్ కోచ్)ని రక్షించతరమా? అనే సందేహం రేకెత్తుతోంది. గుహలో తప్పిపోయి 10 రోజుల తర్వాత ఇద్దరు బ్రిటీష్ డైవర్లకు సజీవంగా కనిపించిన ఫుట్‌బాల్ టీమ్‌ను రక్షించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది.
వర్షాకాలం తొంగి చూస్తుండటం పిల్లల తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టింది. గుహ నుంచి పిల్లల్ని బయటకు తేవాలంటే కొన్ని కిలోమీటర్ల మేర వారితో డైవింగ్ చేయించాలి. గుహలోని నీటిని తగ్గించేందుకు జపాన్‌కు చెందిన ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. వారి వినియోగిస్తున్న మోటార్ ద్వారా గుహ నుంచి గంటకు 1 సెంటీమీటర్ మేర నీటి మట్టాన్ని తగ్గించగలుగుతున్నారు.
థాయ్‌లాండ్ ప్రభుత్వం ముందు 5 ఆప్షన్లు :
వర్షాకాలం అనే పదం ప్రస్తుతం థాయ్‌లాండ్ ప్రభుత్వాన్ని తరుముతోంది. ఎంత త్వరగా గుహలో నుంచి పిల్లల్ని బయటకు తెస్తే అంతమంచిది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం ముందు ఐదు ఆప్షన్లు ఉన్నాయి.
నీరు వెళ్లబెట్టే వరకూ ఆగడం
థాయ్ ప్రభుత్వం ముందు ఉన్న అత్యంత సురక్షితమైన ఆప్షన్ ఇది. అయితే, ఇందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చు. నీరు మొత్తాన్ని వెళ్లబెట్టినా, వర్షాకాలం ముంచుకొస్తోంది. కొన్ని వారాల గుహ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఓ వర్షాకాలంలో వచ్చిన నీరు మొత్తాన్ని వెళ్లబెట్టడం అసాధ్యం కాకపోయినా కష్టతరమే.
చిమ్నీ ద్వారా..
దాదాపు 10 కిలోమీటర్లు మేర పొడవున్న థామ్ లువాంగ్ గుహలో అక్కడక్కడ చిమ్నీలు(గుహ లోపలికి గాలి, వెలుతురు ప్రసరింపజేస్తుంటాయి) ఉండి ఉండొచ్చు. అయితే, అలాంటి వాటిని ప్రభుత్వం ఇంతవరకూ గుర్తించలేదు. ఫుట్‌బాల్ టీం ఉన్న ప్రాంతానికి చేరువలో చిమ్నీలు ఏమైనా ఉన్నాయా? అనే దానిపై అధికారులు శోధిస్తున్నారు.
డైవింగ్
పిల్లలతో పాటు కోచ్‌కు డైవింగ్‌లో తర్ఫీదు ఇచ్చి బయటకు తేవాలనేది మరో ఆప్షన్. అసలు ఈత అంటేనే తెలియని వారితో ఎలా డైవింగ్ చేయిస్తారు?. సాధారణంగా ఓ వ్యక్తికి డైవింగ్‌లో తర్ఫీదు ఇవ్వడానికి మూడు రోజుల సమయం పడుతుంది. అలాంటిది ఇప్పటికే 12 రోజులుగా చీకటి గుహలో నివసిస్తున్న వారు శారీరకంగా, మానసికంగా బలహీనపడివుంటారు.
అలాంటి వారితో అతివేగంగా ప్రవహిస్తున్న నీటిలో డైవింగ్ చేయించగలగాలి. అంతేకాకుండా థామ్ లువాంగ్ గుహలో అతి సన్నని మార్గాలు ఉంటాయి. ఒక డైవర్ నీటిలోకి దిగాక అతని కంటికి కేవలం కొన్ని సెంటీమీటర్ల మేర మాత్రమే ఏం జరగుతుందో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఆందోళన చెందితే వారి ప్రాణాలతో పాటు ఎస్కార్ట్‌గా వస్తున్న నిపుణులైన డైవర్ల ప్రాణాలకు సైతం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.
ఒక్క పిల్లాడితో డైవింగ్ చేయించడం..
డైవింగ్ అంటే పిల్లలకు ఉన్న భయాన్ని వారి మదిలో నుంచి తొలగించేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడొచ్చు. వాలంటీర్‌గా ముందుకొచ్చిన ఒక పిల్లాడిని తొలుత గుహ నుంచి బయటకు తెచ్చి, అతడు డైవ్ చేసిన ఫొటోలను మిగతా వారికి చూపి సాహసానికి ప్రోత్సహించవచ్చు.
‘ప్యాకేజ్’ల రూపంలో..
ఆక్సిజన్ ప్యాకేజిలలో ఒక్కొక్కరిని ఉంచి బయటకు తేవడం. ఈ పద్దతిలో చాలాసార్లు విజయం సాధించినట్లు అమెరికా పేర్కొంది. అయితే, గుహలో మార్గాలు అతి సన్నగా ఉండటం వల్ల ఇది సాధ్యపడే అవకాశాలు తక్కువే.
Comments
Please login to add a commentAdd a comment