మిషన్‌ ఇంపాజిబుల్‌! | Thailand MIssing Football Team Full Story | Sakshi
Sakshi News home page

మిషన్‌ ఇంపాజిబుల్‌!

Published Fri, Jul 6 2018 2:55 AM | Last Updated on Fri, Jul 6 2018 2:55 AM

Thailand MIssing Football Team Full Story - Sakshi

12 మంది ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు.. అందునా పిల్లలు.. తమ కోచ్‌తో కలిసి విహార యాత్ర కోసం గుహలోకి వెళ్లారు.. అంతలోనే భారీ వర్షాలు.. వరదలు.. గుహలో నిండిన నీళ్లు.. లోపలికి వెళ్దామంటే.. గజ ఈతగాళ్లే గజగజలాడాల్సిన పరిస్థితి. వారం గడిచింది..అందరూ ఆశలు వదిలేసుకున్నారు.. అయితే.. అనుకోకుండా ఒకరోజు.. ఇద్దరు బ్రిటన్‌ డైవర్లకు పిల్లలు కనిపించారు.. సజీవంగా.. దేశమంతా పండుగ చేసుకుంది. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. సజీవంగా కనిపించారు.. అయితే.. సజీవంగా బయటకు వస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. వాళ్లకు ఈత రానందున గుహ నుంచి బయటకు రావడం అసాధ్యమంటున్నారు.. 4 నెలలు అందులోనే ఉండిపోవాల్సిందేనంటున్నారు.. మరోవైపు వారినెలాగైనా బయటకు తేవడానికి అంతర్జాతీయ నిపుణుల బృందం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది.. 100 శాతం అందరినీ రక్షిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ వారి మిషన్‌ ఫలిస్తుందా? ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించిన ఈ ఘటన వివరాలు గ్రాఫిక్‌ రూపంలో..  


    
జూన్‌ 23: పిల్లలు, వారి కోచ్‌ థామ్‌ లుయాంగ్‌ నాంగ్‌ నాన్‌ గుహ(దీని పొడవు 9.65 కి.మీ)కు వెళ్లారు. ఎంతసేపయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గుహ ముఖద్వారం వద్ద సైకిళ్లు.. లోపల షూలు, బ్యాగులు కనిపించడంతో గుహలో చిక్కుకుపోయారని గ్రహించారు.  
జూన్‌ 24: గుహ లోపల పిల్లల చేతి, కాలి ముద్రలు కనిపించాయి. గుహలో నీటిమట్టం పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు మరింత లోపలికి వెళ్లి ఉంటారని అంచనా వేశారు. 
జూన్‌ 25, 26: థాయ్‌లాండ్‌ నేవీ సీల్స్‌ విభాగం డైవర్లు రంగంలోకి దిగారు. అయితే.. వరద ఉధృతి వల్ల వారు వెనక్కి రావాల్సి వచ్చింది.  
జూన్‌ 27: బ్రిటిష్‌ డైవర్లు రిచర్డ్, జాన్, రాబర్ట్‌తో పాటు అంతర్జాతీయ నిపుణులు వచ్చారు.   
జూన్‌ 28: వరదల వల్ల సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపేశారు. భారీ మోటార్లను వినియోగించి గుహలోని నీటిని తోడటం మొదలుపెట్టారు. పై నుంచి గుహలోకి వెళ్లే మార్గాన్ని కనుగొనేందుకు డ్రోన్లను రంగంలోకి దింపారు. 
జూన్‌ 29: భూమిపై నుంచి డ్రిల్లింగ్‌ ద్వారా గుహలోకి వెళ్లే అవకాశమున్న ఓ ప్రదేశాన్ని కనుగొన్నా.. అది గుహ ప్రధాన మార్గాన్ని చేరుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. 
జూన్‌ 30: వాతావరణం అనుకూలించడంతో డైవర్లు గుహలో ముందుకు వెళ్లారు.  
జూలై 1: గుహలో ఓ పొడి ప్రాంతంలో బేస్‌ ఏర్పాటు చేసుకున్నారు. గుహలో కొన్ని రోజులు ఉండేందుకు వీలుగా వందలాది ఆక్సిజన్‌ ట్యాంకులు, ఆహార పదార్థాలను తరలించారు. 
జూలై 2: గుహ ప్రవేశ ద్వారానికి 4 కి.మీ. దూరంలో ఆ 13 మందిని జాన్, రిచర్డ్‌ గుర్తించారు.   
జూలై 3, 4, 5: బుధవారం కొందరు తెలియక మధ్యలో ఓసారి నీటిని మళ్లీ గుహలోకే పంపింగ్‌ చేసేశారు. తర్వాత దీన్ని గుర్తించి సరిదిద్దారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి వీలుగా ఫోన్‌ లేదా ఇంటర్నెట్‌ కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు లోపల ఉన్న ఇద్దరు పిల్లలు, కోచ్‌ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్‌ను పంపింగ్‌ చేస్తున్నారు. త్వరలో భారీ వర్షాలంటూ వాతావరణ శాఖ  హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వీరిని రక్షించడానికి ప్రస్తుతం మూడే మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

డ్రిల్లింగ్‌ చేసి.. సిలెండర్‌లాంటి దానిలో వారిని పైకి తేవాలి. అయితే.. వారు కనుగొన్న ప్రదేశం.. గుహలో వారున్న ప్రాంతాన్ని కచ్చితంగా చేరుతుందా అన్నదానిపై అనుమానాలున్నాయి. దీనికితోడు దాదాపు కిలోమీటరు మేర లోతులో డ్రిల్లింగ్‌ చేయాలి. పైగా.. పిల్లలు పైకి తెచ్చేంత వైశాల్యంలో.. దీనికి చాలా టైం పడుతుందంటున్నారు. ఇదిలా ఉండగా.. తమకు బయట నుంచి కుక్కల అరుపులు వంటివి వినిపిస్తున్నాయని బుధవారం గుహలోని బాలురు చెప్పారు. అంటే.. ఈ లెక్కన భూమిపైనుంచి లోపలికి ఎక్కడో భారీ రంధ్రంలాంటిది ఉండొచ్చనే అంచనాతో దాని కోసం గాలిస్తున్నారు.  

వర్షాలు ఆగి.. నీటి మట్టం తగ్గేంతవరకూ వేచి ఉండటం.. అంతవరకూ లోపల చిక్కుకున్నవారికి ఆహారం సరఫరా చేయడం.. ప్రస్తుతానికి ఉన్నవాటిల్లో ఇది మంచి నిర్ణయంలా కనిపిస్తున్నా.. ఇందుకోసం వారు 4 నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. పైగా.. వర్షాలు అంచనాలకు మించి పడినా.. వరద పోటెత్తినా.. వీరు ఉన్న ప్రదేశానికి కూడా నీరు చేరుకునే ప్రమాదముందని అంటున్నారు. ఇప్పటికే.. నీటి మట్టం పెరగడంతో వారు గతంలో ఉన్న ప్రదేశం కంటే మరికాస్త వెనక్కు వెళ్లాల్సి వచ్చింది.  

ఆ 13 మందికి ఈత రాదంటున్నారు.. ఇక్కడ ఈత మాత్రమే కాదు.. డైవింగ్‌ రావాలి.. అంటే స్కూబా సామగ్రి వేసుకుని.. నీటిలో ఈదాల్సి ఉంటుంది. పైగా.. చాలాచోట్ల ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలిగేలా ఇరుకిరుకుగా ఉంటుంది. వారికి డైవింగ్‌ నేర్పించి, ఒక్కొక్కరికి ఇద్దరు డైవర్లు చొప్పున మార్గదర్శనం చేస్తూ.. బయటకు తేవాల్సి ఉంటుంది. వారిని వెంటనే రక్షించాలంటే ఇదొక్కటే మార్గం. ఇప్పటికే పిల్లలు డైవింగ్‌ దుస్తులు వేసుకోవడం వంటివి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అయితే.. ఇది ప్రమాదకరమైనది. నిపుణులైన డైవర్లు కూడా ఈ గుహలో ఈదాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటుంటారని చెబుతున్నారు. అమెరికా నేవీకు చెందిన డైవర్‌ ఒకరు పిల్లలు ఇలాంటి గుహలో డైవింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తే.. వారిలో కొందరు చనిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. 

–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement