ఇంత జాప్యమా?! | Sakshi Editorial Article On Crimes against women In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఇంత జాప్యమా?!

Published Sat, Sep 21 2019 1:57 AM | Last Updated on Sat, Sep 21 2019 1:57 AM

Sakshi Editorial Article On Crimes against women In Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లో అధికారం అండదండలున్న ఓ సన్యాసి తనపై లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని, అతన్ని తక్షణం అరెస్టు చేయాలని ఫేస్‌బుక్‌లో ఓ వీడియో ద్వారా నెలక్రితం వెల్లడించి అదృశ్యమైన 23 ఏళ్ల యువతి పోరాటం ఫలించింది. ఆయన బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి చిన్మయా నందేనని వెనువెంటనే తెలిసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఇన్నాళ్లూ వెనకాడిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఎట్టకేలకు శుక్రవారం ఆయన్ను అరెస్టు చేసింది. న్యాయశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న ఆ యువతి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీనుద్దేశించి ఆ వీడియోలో న్యాయం చేయమని విన్నవించ డమే కాదు... తన ప్రాణానికి ముప్పు ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మీడియాలో విస్తృతంగా రావడంతో సుప్రీంకోర్టు తనంత తానే ఈ కేసును పరిగణనలోకి తీసుకుంది. ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసింది. అయినా నిందితుడి అరెస్టుకు ఇన్ని రోజులు పట్టడం మన దేశంలో వ్యవస్థల పని తీరుకు అద్దం పడుతుంది. నిందితుడిని అరెస్టు చేయ కపోతే ఆత్మాహుతి చేసుకుంటానని ఆ యువతి హెచ్చరించిన రెండురోజుల తర్వాతే ఈ అరెస్టు సాధ్యమైందని గుర్తుంచుకోవాలి.

ఒకపక్క అదే రాష్ట్రంలోని ఉన్నావ్‌లో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌ సెంగార్‌పై వచ్చిన అత్యాచారం ఆరోపణల విషయంలో ఎడతెగని జాప్యం చేసినందుకు ఫలితం ఏమిటో కనబడుతూనే ఉన్నా ప్రభుత్వం ఈ కేసులో ఓపట్టాన ముందుకు కదల్లేదు. ఉన్నావ్‌ కేసు బాధితురాలు రెండేళ్లుగా న్యాయం కోసం ఎడతెగని పోరాటం చేస్తోంది. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. ఎన్నో ఒత్తిళ్ల తర్వాత నిందితుణ్ణి అరెస్టు చేసినా బాధితురాలి కుటుంబానికి కష్టాలు తప్పలేదు. మొన్న జూలైలో కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్నప్పుడు వారు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టి ఆమె పిన్ని, మేనత్తలను బలి తీసుకుంది. బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. అప్పటికే తండ్రిని దుండగులు కొట్టి చంపారు. కుటుంబానికి అండగా నిలిచిన బాబాయ్‌ కేసుల్లో చిక్కుకుని జైలు పాలయ్యాడు.  ఉన్నావ్‌ ఉదంతంలో జరిగిన ఘటనలు కళ్లముందు కనబడుతున్నా చిన్మయానంద అరెస్టులో యూపీ ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. యువతి చేసిన ఆరోపణలు సాధారణమైనవి కాదు.

వాటిని రుజువు చేయగల 43 వీడియో క్లిప్పింగ్‌లను ఆమె తండ్రి అధికారులకు అందజేశారు. అందులో ఆమె పట్ల చిన్మయానంద అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం, ఆమెతో మసాజ్‌ చేయించు కోవడం వంటివి ఉన్నాయి. ఆమెకూ, చిన్మయానందకూ మధ్య జరిగిన 200 ఫోన్‌ సంభాషణల రికార్డులు కూడా సిట్‌ అధికారుల అధీనంలో ఉన్నాయి. తనలాగే ఎందరో యువతులు ఆయన ఆశ్రమాల్లో చిక్కుకుని నిస్సహాయ స్థితిలో ఉన్నారని యువతి తెలిపింది.  తనకు బెదిరింపు ఫోన్‌లు వస్తున్నాయని తండ్రి చెబుతున్నాడు. ఏదైనా నేరంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పుడు మాత్రమే దానికి సంబంధించిన దర్యాప్తు ప్రారంభమైనట్టు లెక్క. ఫిర్యాదు వచ్చిన వెంటనే బాధితురాలు చెబు తున్నదేమిటో రికార్డు చేసుకుని, నేరం జరిగిందో లేదో ప్రాథమికంగా నిర్ధారించుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిన పోలీసులు ఇంత తాత్సారం చేయడం దారుణం. ఆరోపణలొచ్చినవారు సాధారణ పౌరులైనా, పలుకుబడి ఉన్నవారైనా ఈ విషయంలో వ్యత్యాసం చూపించకూడదు.

ఇదే రాష్ట్రంలోని బారాబంకీలో పాఠశాల విద్యార్థినులను చైతన్యవంతం చేసేందుకు తాము నిర్వహించిన సదస్సులో పదకొండో తరగతి చదువుతున్న బాలిక ఏం మాట్లాడిందో గమనంలోకి తీసుకుని ఉంటే పోలీసులు ఇలా వ్యవహరించేవారు కాదు. సమాజంలో జరుగుతున్న నేరాలనూ, వాటికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడవలసిన అవసరాన్ని పోలీసు ఉన్నతాధికారి సదస్సులో వివరిస్తుండగా నేరం చేసిన వ్యక్తి మంత్రి లేదా మరో శక్తిమంతమైన వ్యక్తి అయిన పక్షంలో చర్య ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఆమె ప్రశ్నించింది. ఉన్నావ్‌ ఉదంతాన్ని ప్రస్తావించింది. ఆ విద్యార్థిని ప్రసంగిస్తుంటే తోటి బాలికలంతా చప్పట్లతో ఆమెను ప్రశంసించారు. కానీ ఉన్నావ్‌ ఉదంతంలో ఏం జరిగిందో తాజా కేసులోనూ అదే జరిగింది.  చిన్మయానందపై ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. 2011లో కూడా ఒక మహిళ ఇలాంటి ఆరోపణలే చేసింది. తన లాగే ఎందరో చిన్మయానంద ఆశ్రమాల్లో దారుణమైన స్థితిలో బతుకీడుస్తున్నారని తెలిపింది. అత్యాచారాలు బయటకు పొక్కకుండా బాధితులను ఆ ఆశ్రమాల్లో పనిచేసేవారికిచ్చి పెళ్లిళ్లు చేస్తు న్నారని వెల్లడించింది. కేసు దాఖలై ఏడేళ్లు కావస్తున్నా అతీగతీ లేదు. సరిగదా నిరుడు ఆమె పేరిట షాజహాన్‌పూర్‌ కోర్టులో కేసు ఉపసంహరించుకుంటున్నట్టు అఫిడవిట్‌ దాఖలైంది. అది దాఖలు చేసింది తాను కాదని ఆమె మొత్తుకుంటోంది. చిత్రమేమంటే, రెండు కేసుల్లోనూ బాధిత యువ తులపై చిన్మయానంద మనుషులు దొంగతనం, బ్లాక్‌మెయిలింగ్‌ ఆరోపణలు చేశారు.

అధికారంలోకొచ్చిన కొత్తలో వరస ఎన్‌కౌంటర్లతో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నానని యోగి ఆదిత్యనాథ్‌ తరచు చెప్పుకునేవారు. కానీ యూపీలో నేరాల గ్రాఫ్‌ పైపైకి పోతోంది. మహిళలపై జరిగే నేరాల్లో యూపీ అగ్రభాగాన ఉన్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌ హెచ్‌ఎస్‌) ఇటీవల వెల్లడించింది. యాసిడ్‌ దాడి కేసుల్లో పశ్చిమ బెంగాల్‌ తర్వాత స్థానం యూపీదే. లైంగిక నేరారోపణల్లో చిక్కుకున్న బడా నాయకుల్ని రక్షించడానికి తాపత్రయపడే ధోరణి వల్ల నేరాల కట్టడిలో పోలీసుల్లో అలసత్వం పెరుగుతుంది. నేరగాళ్లలో భరోసా ఏర్పడుతుంది. సాధారణ ప్రజానీకం ఇబ్బందుల్లో పడతారు. సర్వోన్నత న్యాయస్థానం తనకు తానుగా జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చినా ఇంత జాప్యం చోటుచేసుకోవడం క్షమార్హం కానిది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తన ధోరణిని మార్చుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement