ఎంతోమంది గాంధీ పేరు పెట్టుకున్నా, గాంధీజీకి నిజమైన వారసుడు ఏపీజే అబ్దుల్ కలాం!. ఇద్దరి మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. అందుకు ఉదాహరణలుగా నిలిచిన కొన్ని ఘటనలు ఉన్నాయి.
కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు, బంధువులంతా రాష్ట్రపతి భవన్‌లో కొన్ని రోజుల పాటు ఉండగా వారి భోజన, వసతి ఖర్చులన్నీ కలాం లెక్కకట్టి చెల్లించారు. గాంధీ తన కుటుం బంతో సహా దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చేస్తున్నప్పుడు మిత్రులు, అభిమానులు కస్తూర్బాకు నగలను బహుమతులుగా ఇచ్చారు. ‘ఇవి నా కష్టార్జితం కాదు. కావున ఇవి సమాజానికే ఉపయోగపడాలి’ అని దక్షిణాఫ్రికా లోనే ఒక ట్రస్టును ఏర్పరచి, దానికే వాటిని గాంధీ ఇవ్వడం జరిగింది.
కలాం డీఆర్‌డీఓ డైరెక్టరుగా ఉన్నప్పుడు ఆయనకు వీణ నేర్చుకోవాలనిపించింది. ఒక సామాన్య ఉద్యోగి భార్య (కళ్యాణి) చిన్న పిల్ల లకు ఇంట్లోనే వీణ నేర్పిస్తోందని తెలిసి, కలాం వెళ్లారు. ఈ వయసులో మీకెందుకు వీణ అంటూనే నెలకు వంద రూపాయల ఫీజు అని చెప్పి, విద్యార్థులతో కలసి కూర్చోమంది. ఒక రోజు ఇంటి దగ్గర పనిమీద ఇంటికివచ్చిన ఉద్యోగి తన ఇంట్లో కలాంను చూశాడు. అప్పుడు విషయం తెలిసిన కళ్యాణి మీరు ముందే మాకు ఈ విషయం చెప్పి ఉంటే మేమే మీ ఇంటికి వచ్చి రోజూ చెప్పేవాళ్ళం, ఫీజు కూడా తీసుకునే వాళ్ళం కాదు అని బాధపడుతుంటే– ‘అందుకే నేను మీ ఆయనకు తెలియ కుండా వచ్చి నేర్చు కుంటున్నాను. విద్యార్థి ఎంత గొప్పవాడైనా టీచర్ దగ్గర శిష్యుడిగానే ఉండాలన్నారు కలాం.
సంస్కృతం కష్టం అని గాంధీ అందరు పిల్లల్లాగే తలచి పెర్షియన్ భాష క్లాసులో కూర్చుంటే, కృష్ణశంకర పాండ్యా అనే సంస్కృత ఉపాధ్యాయుడు ‘సంస్కృతం నేర్చుకోవడంలో ఏదైనా కష్టముంటే నా దగ్గరకు రా’ అన్నారు. ఆ రోజు పాండ్యా వద్ద సంస్కృతం నేర్చుకొని ఉండకపోతే భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవగలిగేవాడిని కాదన్నారు గాంధీ.
కలాంను విశాఖపట్నం జిల్లా చోడవరం తీసుకొచ్చి సుమారుగా 10 వేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ఆయన ప్రసంగం వినిపించాలని ‘కల’గన్నాను. కానీ ఆయన ఆరోగ్యం క్షీణిం చడంతో అది ‘కల’గానే మిగిలిపోయింది. ఎప్పుడూ ‘కలలు’ వాటి సాకారం గురించి మాట్లాడే ఆయన నా ‘కల’ మాత్రం సాకారం కాకుండానే భగవంతుడిలో లీనమైపోయారు.
నేడు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా..
ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు,
మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం,
రాజమహేంద్రవరం ఈ–మెయిల్: mnaidumurru@gmail.com
Comments
Please login to add a commentAdd a comment