death anniversary occasion
-
వాజ్‌పేయి చివరిసారి కనిపించింది ఎప్పుడంటే..
VAJPAYEE DEATH ANNIVERSARY: భారత రాజకీయాలకు ‘భీష్మ పితామహుడి’గా తనకంటూ ఒక చెరగని ఒక ముద్ర వేసుకున్నాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడిగా, రాజకీయాల్లో అజాత శత్రువనే గుర్తింపు దక్కింది ఆయనకు. సాహితి లోకానికి కవిగా, దాదాపు ఆరేళ్లపాటు భారత దేశానికి ప్రధానిగా, బీజేపీకి ముఖ్యనేతగా సేవలందించిన ఆయన.. 2004 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ప్రజల ముందుకు వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఇవాళ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి మూడో వర్ధంతి. 2018, ఆగస్ట్ 16న తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. 2004 ఓటమి తర్వాత వాజ్‌పేయి.. పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా, బీజేపీ కీలక సమావేశాల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. అయితే 2005 డిసెంబర్లో పుట్టినరోజు దగ్గరపడుతుండగా.. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి, అభిమానులకు, కార్యకర్తలకు పెద్ద షాక్ ఇచ్చారు ఆయన. ఇక ఎన్నికల బరిలోకి దిగనప్పటికీ.. పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తానని పార్టీ సారధ్య బాధత్యల నుంచి తప్పుకున్నాడాయన.ఆపై అనారోగ్యంతో ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. చివరి సభ.. ఫిబ్రవరి 11, 2007.. పంజాబ్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశం. బీజేపీ టికెట్‌తో అమృత్సర్ నుంచి లోక్ సభ స్థానానికి పోటీకి దిగాడు. ఆ ప్రచార సభకు ప్రధాన ఆకర్షణ ఎవరో కాదు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఓ బహిరంగ సభకు వస్తుండడంతో వేలమంది ఆ సభకు హాజరయ్యారు. టెంట్ల కింద జనం కిక్కిరిసి పోవడంతో.. బయట ఉండేందుకు వీలుగా సుమారు 10 వేల మందికి గొడుల్ని అందేసింది బీజేపీ కమిటీ. కుర్చీలోనే కవితతో మొదలుపెట్టిన ఆయన ఉపన్యాసాన్ని .. ఎలాంటి కోలాహలం లేకుండా ఆసక్తిగా తిలకించారు ఆ జనం. ఆ రాజకీయ ఉద్దండుడి చివరి సభ అదేనని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. మీడియా ప్రతినిధులతో.. 2007, డిసెంబర్ 25న పుట్టినరోజు సందర్భంగా కొందరు జర్నలిస్టులు వాజ్‌పేయిను కలవాలనుకున్నారు. ‘2009లో మరోసారి రాజకీయ పోరాటానికి ఆయన సిద్ధమేనా? ప్రచారంలో అయినా పాల్గొంటారా? లేదంటే ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటారా? అద్వానీకి పగ్గాలు అప్పజెప్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనే ఉద్దేశంతో ఓ జర్నలిస్ట్ బృందం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశారు. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ దగ్గరుండి 10 మంది జర్నలిస్టులను విజయ్ మీనన్ మార్గ్‌లో ఉన్న వాజ్‌పేయి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ కొద్దినిమిషాల మీటింగ్ అరేంజ్ చేయించాడు హుస్సేన్. లోపలికి వెళ్లిన జర్నలిస్టులు.. వాజ్‌పేయి చూడగానే ఆశ్చర్యపోయారు. కుర్చీలో కూర్చుకుని పాలిపోయిన ముఖంతో కదల్లేని స్థితిలో ఉన్నారాయన. చుట్టూ చేరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా ‘నమస్కార్’ అనే మాట మాత్రమే వచ్చింది ఆయన నోటి నుంచి. అంతే.. వాజ్‌పేయి పరిస్థితి అర్థం చేసుకుని అంతా బయటకు వచ్చేశారు. కుర్చీలోనే భారతరత్న 2009లో ఛాతీ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయి..కాస్త కొలుకున్నాక ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో 2009 ఎన్నికల క్యాంపెయిన్‌కు హాజరు కాలేదు. కానీ, ఆయన పేరు మీద లేఖలు మాత్రం విడుదల చేసింది బీజేపీ. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం అస్సలు సహకరించకపోవడంతో.. కీలక నేతలే అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా ఆయన్ని ఇంటికి వెళ్లి ప్రైవేట్‌గా కలుస్తూ వచ్చారు. 2015లో ఆయనకు భారతరత్న ప్రకటించారు. మార్చి 27, 2015న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్‌పేయి ఇంటికి వెళ్లి మరీ భారత రత్న అందుకున్నారు. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్‌లోనే అందుకోవాలి. కానీ, వాజ్‌పేయి ఆరోగ్య దృష్ట్యా, ప్రైవసీని కాపాడాలన్న ఉద్దేశంతో.. స్వయంగా రాష్ట్రపతే వెళ్లి అందించారు. చివరి రోజుల్లో.. ఆ రాజకీయ ఉద్దండుడు మతిమరుపు, డయాబెటిస్, కదల్లేని స్థితిలో కనిపించిన ఫొటోలు చాలామందిని కదిలించివేశాయి. అందుకే ఆయన్ని మీడియా కంటపడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. గెలుపు-ఓటమి ఈ రెండింటినీ నవ్వుతూ స్వీకరించే నైజం వాజ్‌పేయిది. 2004లో దారుణ ఓటమి తర్వాత కూడా ‘ఓడిపోయాం.. అంతే’ అంటూ చిరునవ్వు విసిరారు ఆయన. అందుకే అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. అయితే ఆయన పాలనను, ఆదర్శాలను పొగిడే నేతలే తప్పించి.. వాటిని ఆచరించేవాళ్లు ఈరోజుల్లో లేరనే అంటారు రాజకీయ విశ్లేషకులు. -సాక్షి, వెబ్‌డెస్క్ -
కలాం సింప్లిసిటీకి ఎగ్జాంపుల్ ఈ ఘటన
ఎంతోమంది గాంధీ పేరు పెట్టుకున్నా, గాంధీజీకి నిజమైన వారసుడు ఏపీజే అబ్దుల్ కలాం!. ఇద్దరి మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. అందుకు ఉదాహరణలుగా నిలిచిన కొన్ని ఘటనలు ఉన్నాయి. కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు, బంధువులంతా రాష్ట్రపతి భవన్లో కొన్ని రోజుల పాటు ఉండగా వారి భోజన, వసతి ఖర్చులన్నీ కలాం లెక్కకట్టి చెల్లించారు. గాంధీ తన కుటుం బంతో సహా దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చేస్తున్నప్పుడు మిత్రులు, అభిమానులు కస్తూర్బాకు నగలను బహుమతులుగా ఇచ్చారు. ‘ఇవి నా కష్టార్జితం కాదు. కావున ఇవి సమాజానికే ఉపయోగపడాలి’ అని దక్షిణాఫ్రికా లోనే ఒక ట్రస్టును ఏర్పరచి, దానికే వాటిని గాంధీ ఇవ్వడం జరిగింది. కలాం డీఆర్డీఓ డైరెక్టరుగా ఉన్నప్పుడు ఆయనకు వీణ నేర్చుకోవాలనిపించింది. ఒక సామాన్య ఉద్యోగి భార్య (కళ్యాణి) చిన్న పిల్ల లకు ఇంట్లోనే వీణ నేర్పిస్తోందని తెలిసి, కలాం వెళ్లారు. ఈ వయసులో మీకెందుకు వీణ అంటూనే నెలకు వంద రూపాయల ఫీజు అని చెప్పి, విద్యార్థులతో కలసి కూర్చోమంది. ఒక రోజు ఇంటి దగ్గర పనిమీద ఇంటికివచ్చిన ఉద్యోగి తన ఇంట్లో కలాంను చూశాడు. అప్పుడు విషయం తెలిసిన కళ్యాణి మీరు ముందే మాకు ఈ విషయం చెప్పి ఉంటే మేమే మీ ఇంటికి వచ్చి రోజూ చెప్పేవాళ్ళం, ఫీజు కూడా తీసుకునే వాళ్ళం కాదు అని బాధపడుతుంటే– ‘అందుకే నేను మీ ఆయనకు తెలియ కుండా వచ్చి నేర్చు కుంటున్నాను. విద్యార్థి ఎంత గొప్పవాడైనా టీచర్ దగ్గర శిష్యుడిగానే ఉండాలన్నారు కలాం. సంస్కృతం కష్టం అని గాంధీ అందరు పిల్లల్లాగే తలచి పెర్షియన్ భాష క్లాసులో కూర్చుంటే, కృష్ణశంకర పాండ్యా అనే సంస్కృత ఉపాధ్యాయుడు ‘సంస్కృతం నేర్చుకోవడంలో ఏదైనా కష్టముంటే నా దగ్గరకు రా’ అన్నారు. ఆ రోజు పాండ్యా వద్ద సంస్కృతం నేర్చుకొని ఉండకపోతే భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవగలిగేవాడిని కాదన్నారు గాంధీ. కలాంను విశాఖపట్నం జిల్లా చోడవరం తీసుకొచ్చి సుమారుగా 10 వేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ఆయన ప్రసంగం వినిపించాలని ‘కల’గన్నాను. కానీ ఆయన ఆరోగ్యం క్షీణిం చడంతో అది ‘కల’గానే మిగిలిపోయింది. ఎప్పుడూ ‘కలలు’ వాటి సాకారం గురించి మాట్లాడే ఆయన నా ‘కల’ మాత్రం సాకారం కాకుండానే భగవంతుడిలో లీనమైపోయారు. నేడు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా.. ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు, మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం ఈ–మెయిల్: mnaidumurru@gmail.com -
తాడేపల్లిలో అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను శుక్రవారం వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, ఎస్సీ(మాదిగ) కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ, పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజతో పాటు పలువురు పార్టీ నేతలు హాజరై.. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి ఉపయుక్తమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఆలోచన విధానంలోనే అందరూ నడవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అభిలాషించారు. అంబేడ్కర్ ఆలోచన విధానం అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ అండగా నిలవాలని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల అభ్యున్నతికి అంబేడ్కర్ చూపిన బాటలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని పేర్కొన్నారు. దళితులను సామాజిక, రాజకీయ, ఆర్థికపరంగా అభివృధ్ది చెందేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తానని చెప్పి.. దళితులతో పాటు అంబేడ్కర్‌ను సైతం మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. దళితులపై దాడులు చేసి, వారి భూములు లాక్కొని భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. -
‘అమరుల త్యాగం మరువలేనిది’
రెబ్బెన : స్వాతంత్య్రం కోసం, దేశ రక్షణ కోసం తమ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం మహాత్మగాంధీ వర్ధంతి, అమరవీరుల దినోత్సవాన్ని మండలంలోని ఇందిరానగర్, గోలేటికాలనీ, వంకుల ప్రభుత్వ పాఠశాలల్లో, స్థానిక తహసీల్దార్ కార్యాలయం, సీఐ కార్యాలయంలో నిర్వహించారు. సీఐ కార్యాలయంలో డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి పోలీసు సిబ్బంది అమరవీరుల సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ సాయన్న, డీటీ విష్ణు, సీఐ పురుషోత్తం, రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు దేవాజీ, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, జ్యోతి, రవికుమార్ పాల్గొన్నారు. మహాత్ముడికి ఘన నివాళి ఆసిఫాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని వాసవీ క్లబ్ ప్రతినిధులు అన్నారు. మహాత్మా గాంధీ 70వ వర్ధంతి సందర్భంగా మహాత్ముడికి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సాయిని సంతోష్, తాటికొండ ప్రవీణ్, కోషాధికారి పత్తి శ్యాం, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు చిలువేరి వెంకన్న, ప్రతినిధులు గుండా బాలేశ్వర్, గంధం శ్రీనివాస్, ఎకిరాల శ్రీనివాస్, గంధం వేణు, బోనగిరి దత్తాత్రి, కొలిప్యాక వేణు, గుండ వెంకన్న, సాయిని గోపాల్, తాటిపెల్లి శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఖాండ్రే విశాల్, మైనార్టీ నాయకుడు ఖాలీద్ బిన్ అవద్, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. రెండు నిమిషాలు మౌనం వాంకిడి : దేశం కోసం అసువులు బాసిన అమరవీరులకు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, మాతృశ్రీ విద్యామందిర్లలో రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు నివాళులు అర్పించారు. తహసీల్దార్ మల్లికార్జున్, ఆర్ఐ దౌలత్‌రావు పాల్గొన్నారు. అమరవీరుల ఆత్మశాంతికి మౌనం కెరమెరి : అమరవీరుల సంస్మరణ దినోత్సవంతో పాటు, జాతిపితా మహత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళావారం మండలంలో ఉమ్రి, సావర్‌కెడా, సాంగ్వి తదితర ప్రభుత్వ పాఠశాలల్లో, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంఆర్సీ, అటవీ రేంజ్, ఈజీఎస్, ఐకేపీ కార్యాలయాల్లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని ఇలా మననం చేయడం అదృష్టమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కొన్ని చోట్ల మహత్మగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తిర్యాణిలో.. తిర్యాణి : మండలంలోని ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, వ్యవసాయశాఖ కార్యాలయ సిబ్బంది మంగళవారం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ రవికుమార్, వ్యవసాయాధికారి తిరుమలేశ్వర్, ఏఈవోలు శ్రీధర్, ముత్తయ్య కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
కడవెండిలో ఎర్రదండు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా దేవరుప్పుల మండలంలోని కడవెండి ఎరుపెక్కింది. నిజాం హయూంలో విధ్వంసమైన చరిత్రను సీఎం విస్మరిస్తున్నారని వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. - దొడ్డి కొమురయ్యకుఘన నివాళి - స్మారకభవన పనులు ప్రారంభం - వామపక్ష ఐక్యసంఘటనపై ప్రకటన - కేసీఆర్ పాలనపై చాడ,తమ్మినేని విమర్శలు కడవెండి(దేవరుప్పుల): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కడవెండి గ్రామం ఎరుపెక్కింది. వామపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. కడవెండి లో దొడ్డి కొమురయ్య 69 వర్ధంతి సభను శనివారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. పదివామపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. స్మారకస్థూపం వద్ద జెండా ఎగరేసి కొమురయ్యకు ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. నిజాం హయూంలో తెలంగాణ సమాజం విధ్వంసమైన చరిత్రను సీఎం కేసీఆర్ విస్మరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అవినీతి మరకలు వెక్కిరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎర్రజెండా పార్టీలవైపు చూస్తున్నార ని పేర్కొన్నారు. అగ్రకులాల పెత్తనంలో సబ్బండ వర్ణాల అణచివేత కొనసాగుతోందని, దీన్ని ఎదుర్కునేందుకు వామపక్ష ఐక్యసంఘటన ఆధ్వర్యంలో ప్రత్యామ్నయ రాజకీయశక్తి అనివార్యమని అభిప్రాయపడ్డారు. మరో పోరాటం తప్పదు: చాడ దొడ్డి కొమురయ్య పోరాటస్ఫూర్తిని పాఠ్యాంశంలో చేర్చకపోవడం విచారకరమని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కొమురయ్య అమరత్వంతో సాధించుకున్న భూమి మళ్లీ భూస్వామ్యు ల చే తుల్లోకి వెళ్లిందని, దాన్ని తిరిగి సాధించేందుకు మరో పోరాటం తప్పదని స్పష్టంచేశారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో పబ్బం గడుపుకుంటున్న కేసీఆర్.. ప్రాణహిత, పాలమూరు, వరదకాలువ, నక్కలగండి ప్రాజెక్టులపై రోజుకో మాటతో గారడీ చేస్తున్నాడని విమర్శించా రు. సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ర్ట కార్యదర్శి రాజేష్‌ఖన్నా మాట్లాడుతూ.. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఏటా అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంసీపీఐ రాష్ర్ట నాయకుడు గాదగోని రవి మాట్లాడుతూ, వామపక్షాల ఐక్యత కొనసాగించాలని కోరారు. ట్రస్టు చైర్మన్ కె.ప్రతాప్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, వామపక్షాల రాష్ట్ర నేతలు జాన కి రాములు, కొండ దయానంద్, కె. ప్రతాప్‌రెడ్డి, గంగసాని సత్యపాల్‌రెడ్డి, సీపీఐ,సీపీఎం జిల్లా కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సారంపెల్లి వాసుదేవరెడ్డి, సీపీఐ పాలకుర్తి నియోజకవర్గ కార్యదర్శి ముద్దం శ్రీనివాస్‌రెడ్డి, మండల కార్యదర్శులు బిల్లా తిరుపతిరెడ్డి, రమేష్, సొప్పరి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. సాక్షి కథనంపై స్పందన కొమురయ్య స్మారక భవన నిర్మాణంలో జాప్యంపై ‘స్మరిస్తూ...విస్మరిస్తూ’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి సీపీఐ స్పందించింది. అనూహ్యంగా రూ.36 లక్షల వ్యయంతో తలపెట్టిన పనులను సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు.