కడవెండిలో ఎర్రదండు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా దేవరుప్పుల మండలంలోని కడవెండి ఎరుపెక్కింది. నిజాం హయూంలో విధ్వంసమైన చరిత్రను సీఎం విస్మరిస్తున్నారని వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు.
- దొడ్డి కొమురయ్యకుఘన నివాళి
- స్మారకభవన పనులు ప్రారంభం
- వామపక్ష ఐక్యసంఘటనపై ప్రకటన
- కేసీఆర్ పాలనపై చాడ,తమ్మినేని విమర్శలు
కడవెండి(దేవరుప్పుల): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కడవెండి గ్రామం ఎరుపెక్కింది. వామపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. కడవెండి లో దొడ్డి కొమురయ్య 69 వర్ధంతి సభను శనివారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. పదివామపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. స్మారకస్థూపం వద్ద జెండా ఎగరేసి కొమురయ్యకు ఘనంగా నివాళుర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. నిజాం హయూంలో తెలంగాణ సమాజం విధ్వంసమైన చరిత్రను సీఎం కేసీఆర్ విస్మరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అవినీతి మరకలు వెక్కిరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎర్రజెండా పార్టీలవైపు చూస్తున్నార ని పేర్కొన్నారు. అగ్రకులాల పెత్తనంలో సబ్బండ వర్ణాల అణచివేత కొనసాగుతోందని, దీన్ని ఎదుర్కునేందుకు వామపక్ష ఐక్యసంఘటన ఆధ్వర్యంలో ప్రత్యామ్నయ రాజకీయశక్తి అనివార్యమని అభిప్రాయపడ్డారు.
మరో పోరాటం తప్పదు: చాడ
దొడ్డి కొమురయ్య పోరాటస్ఫూర్తిని పాఠ్యాంశంలో చేర్చకపోవడం విచారకరమని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కొమురయ్య అమరత్వంతో సాధించుకున్న భూమి మళ్లీ భూస్వామ్యు ల చే తుల్లోకి వెళ్లిందని, దాన్ని తిరిగి సాధించేందుకు మరో పోరాటం తప్పదని స్పష్టంచేశారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో పబ్బం గడుపుకుంటున్న కేసీఆర్.. ప్రాణహిత, పాలమూరు, వరదకాలువ, నక్కలగండి ప్రాజెక్టులపై రోజుకో మాటతో గారడీ చేస్తున్నాడని విమర్శించా రు.
సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ర్ట కార్యదర్శి రాజేష్‌ఖన్నా మాట్లాడుతూ.. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఏటా అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంసీపీఐ రాష్ర్ట నాయకుడు గాదగోని రవి మాట్లాడుతూ, వామపక్షాల ఐక్యత కొనసాగించాలని కోరారు. ట్రస్టు చైర్మన్ కె.ప్రతాప్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, వామపక్షాల రాష్ట్ర నేతలు జాన కి రాములు, కొండ దయానంద్, కె. ప్రతాప్‌రెడ్డి, గంగసాని సత్యపాల్‌రెడ్డి, సీపీఐ,సీపీఎం జిల్లా కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సారంపెల్లి వాసుదేవరెడ్డి, సీపీఐ పాలకుర్తి నియోజకవర్గ కార్యదర్శి ముద్దం శ్రీనివాస్‌రెడ్డి, మండల కార్యదర్శులు బిల్లా తిరుపతిరెడ్డి, రమేష్, సొప్పరి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
సాక్షి కథనంపై స్పందన
కొమురయ్య స్మారక భవన నిర్మాణంలో జాప్యంపై ‘స్మరిస్తూ...విస్మరిస్తూ’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి సీపీఐ స్పందించింది. అనూహ్యంగా రూ.36 లక్షల వ్యయంతో తలపెట్టిన పనులను సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు.