కాలం కలసిరాకపోవడమంటే ఇదేనేమో! కొద్ది రోజులుగా ఫేస్‌బుక్ సంస్థకు తగులుతున్న వరుస ఎదురుదెబ్బలు చూస్తే అంతే అనిపిస్తోంది. ఒకప్పుడు తాను పని చేసిన ఈ సంస్థ దృష్టిలో యూజర్ల ‘‘భద్రత కన్నా లాభమే ముఖ్యం’’ అంటూ ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని నుంచి ఈ ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూ ఆమె బయటపెడుతున్న వేలాది రహస్యపత్రాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అది చాలదన్నట్టు సోమవారం 6 గంటలపైగా ఫేస్‌బుక్, దాని సేవలైన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్లు సాంకేతిక సమస్యలతో ఆగిపోయాయి. దీనిపై రకరకాల ఊహాగానాలొచ్చినా, కమ్యూనికేషన్ టూల్స్‌లో లోపాలతో పాటు కాన్ఫిగరేషన్ మార్పు వల్లే ఇది తలెత్తిందని నిపుణుల మాట. 2008 తర్వాతెన్నడూ లేనంతటి ప్రపంచవ్యాప్త స్తంభన, తాజా ఆరోపణలతో సంస్థకు గట్టి దెబ్బే తగిలింది. ట్విట్టర్, టిక్‌టాక్, టెలిగ్రామ్‌లకి చాలామంది మారిపోవడంతో, ఫేస్‌బుక్ షేర్లు 4.9 శాతం పడిపోయాయి. 6 గంటల్లో ఫేస్‌బుక్ 10 కోట్ల డాలర్ల ఆదాయం నష్టపోయినట్లు అంచనా. వీటికన్నా జనం ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు గడపడానికి విద్వేషపోస్టుల్ని ప్రోత్సహిస్తోందన్న వివాదం మరింత నష్టాన్ని కలిగించనుంది.
ఫేస్‌బుక్ నైతికతపై ఆరోపణలు చేసింది హార్వర్డ్‌లో ఎంబీఏ చేసిన మంచి వక్త, అల్గారిథమ్స్‌లో దిట్ట, పేటెంట్లు పొందిన స్త్రీ. గూగుల్, పిన్‌రెస్ట్‌లలో పనిచేసిన ఆమెకు ఫేస్‌బుక్‌లో జనం ఏ చూడాలనేది కంప్యూటర్ కోడ్ ఎలా ఎంపిక చేస్తుందో, లోతుపాతులేమిటో బాగా తెలుసు. అందుకే, ఫేస్‌బుక్ తప్పులను ప్రపంచానికి చాటిన ఈ 37 ఏళ్ళ మాజీ ఉద్యోగిని మంగళవారం అమెరికన్ సెనేట్ కామర్స్ సబ్ కమిటీ ముందు చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలకు అంత విలువ. ప్రోడక్ట్ మేనేజర్‌గా ఫేస్‌బుక్‌లో పనిచేసి, మే నెలలో బయటకొచ్చిన ఆమె కొన్ని వేల అంతర్గత పత్రాలను ప్రసిద్ధ పత్రిక ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’తో కొన్నాళ్ళుగా అజ్ఞాతంగా పంచుకుంటూ వచ్చారు. వాటి ఆధారంగా ఫేస్‌బుక్ హాని గురించి ఆ పత్రిక వరుస కథనాలు వేస్తూ వచ్చింది. ఇక, ఆదివారం హాగెన్ తన పేరు, రూపం బయటపెడుతూ ఇచ్చిన ‘60 మినిట్స్’ టీవీ భేటీ దానికి పరాకాష్ఠ.
ఫేస్‌బుక్‌కు 289 కోట్ల మంది, వాట్సప్‌కు 200 కోట్ల పైచిలుకు మంది యూజర్లున్నారని ఓ లెక్క. ఈ ఏడాది మొదట్లో వాట్సప్ కోసం ఫేస్‌బుక్ తీసుకొచ్చిన సరికొత్త ప్రైవసీ విధానం ఇప్పటికే వివాదాస్పదమైంది. ఇంటిగుట్టు బయటపెట్టిన పత్రాలను బట్టి చూస్తే, ఇప్పటి దాకా అందరూ అనుమానిస్తున్న అనేక అంశాలు నిజమే అనిపిస్తోంది. లక్షలాది ఉన్నత వర్గాల యూజర్ల కోసం మాత్రం ఫేస్‌బుక్ కొంత సడలింపులతో కూడిన రహస్య నిబంధనలు పాటిస్తోంది. అలాగే, టీనేజ్ అమ్మాయిల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇన్‌స్టాగ్రామ్ వ్యవహారంతో తమ శరీరాకృతి పట్ల నిరాశకు లోనైన దుఃస్థితి. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న పరిస్థితి. 2018లో అల్గారిథమ్‌లో మార్పు ద్వారా ఫేస్‌బుక్ విద్వేషాలకు తావిచ్చింది. తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికలవేళ తప్పనిసరై, పోస్టింగులపై కొన్ని అడ్డుకట్టలు పెట్టింది. తీరా ఎన్నికలవగానే వాటిని ఎత్తేయడమే ఈ జనవరి 6న అమెరికా అధ్యక్ష భవనంపై మూకదాడికి దారితీసింది. 34 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్లున్న మనదేశంలో బీజేపీ, ఆరెస్సెస్‌లవి, లేదా వాటితో అనుబంధమున్నవీ అయిన ఫేస్‌బుక్ ఖాతాలు, గ్రూపులు, పేజీలు భయాన్ని పెంచేలా, ముస్లిమ్ వ్యతిరేక కథనాలను ప్రమోట్ చేస్తున్నాయట. రాజకీయ సందేశాలకు అడ్డాగా మారిన ఆ సంగతి హాగెన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవన్నీ దిగ్భ్రాంతికరం.
అందరికీ ముఖపుస్తకమన్నట్టు పేరు పెట్టుకున్న సంస్థ ఇలా ముఖం చాటేసే పనులు చేయడం విడ్డూరమే. తాజా వివాదంపై ఫేస్‌బుక్ సీఈఓ జుకెర్‌బెర్గ్ మొదట్లో మౌనంగా ఉన్నా, చివరికి ఖండించక తప్పలేదు. వాదనల మాటెలా ఉన్నా, ఇప్పటికే అనేక వివాదాలకు లోనై, ఏకస్వామ్య పోకడలకు జరిమానాల పాలై, నిశిత పరిశీలనలో ఉన్న కంపెనీ ఫేస్‌బుక్. ఉద్యోగులే బయటకొచ్చి, ఆరోపణలు చేయడమూ దానికి కొత్త కాదు. కానీ, ఇలాంటి వేదికలు ప్రపంచాన్ని శాసించేంత శక్తి మంతం కావడం, ఈ సామాజిక వేదిక ఆగితే కమ్యూనికేషన్ ఆగే పరిస్థితి రావడం అభిలషణీయం కానే కాదు. ప్రపంచం ప్రతి క్షణం సెర్చింగ్‌కు వాడే గూగుల్, ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడరైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటివి కూడా రేపు ఇలా అనుకోని స్తంభనకు గురైతే ప్రపంచ సమాచారప్రసారం, వాణిజ్యాల పరిస్థితేమిటన్నది సీరియస్‌గా ఆలోచించాల్సిందే.
అయితే, ప్రపంచమొక కుగ్రామమై, సమాచారమే అత్యంత శక్తిమంతమైనదిగా మారిన వర్తమానంలో ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలే వద్దనగలమా? ఫేస్‌బుక్‌పై ఇన్ని ఆరోపణలు చేసిన హాగెన్ సైతం ఆ సామాజిక వేదికను నిషేధించమనడం లేదు. దాని పనితీరును పర్యవేక్షిస్తూ, రోజూ 160 కోట్ల పైచిలుకు మందికి అది చూపించే సమాచారంపై మార్గదర్శనం చేయమని సూచిస్తున్నారు. ఈ విషయంపై మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారించాల్సి ఉంది. అదే సమయంలో మార్కెట్ దిగ్గజాలు చేసే తప్పొప్పుల్ని నిర్భయంగా బయటపెడుతూ, సమాజానికి కావలి కాస్తున్న హాగెన్ లాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరమూ ఉంది. ఇంత విషం నిండిన సంస్థలో పనిచేస్తున్నామా అనిపిస్తే, రేపు మరింత మంది ఉద్యోగులు ఆమె లాగా అలారమ్ మోగించవచ్చు. దాచేస్తే దాగని ఆ సత్యాలన్నీ బయటకు రావాలి. బెదిరింపులతో వారి నోరు నొక్కేస్తే – సత్యం వధింపబడుతుంది. ధర్మం చెరలోనే మగ్గుతుంది. పారాహుషార్!
Comments
Please login to add a commentAdd a comment