వాషింగ్టన్, న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ల సేవలు స్తంభించిన ఏడు గంటల తర్వాత పునరుద్ధరించారు. ఫేస్‌బుక్ చరిత్రలో ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద అంతరాయం ఇదే. భారతకాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నిలిచిపోయిన సేవలు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకి తిరిగి అందుబాటులోకి రావడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు.
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ సేవలు అన్ని గంటల సేపు నిలిచిపోవడానికి అంతర్గతంగా నెలకొన్న కమ్యూనికేషన్ టూల్స్‌లో లోపాలే కారణమని వెల్లడైంది. కన్ఫిగరేషన్ మార్పుల్లో తలెత్తిన లోపాల వల్ల సర్వీసులకి అంతరాయం ఏర్పడింది ఆ సంస్థ ఇంజినీర్ల బృందం తన బ్లాగ్‌లో వెల్లడించింది. ‘మనం సామాజిక మాధ్యమాల్లో వాడే భాషని కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మార్చడానికి వీలు కల్పించే కమ్యూనికేషన్ టూల్స్‌లో లోపం కారణంగా వాటి సర్వీసులు స్తంభించాయి. ఈ లోపం వల్ల అంతరాయం ఏర్పడిందని అనిపిస్తుంది కానీ మనం అనుసంధానం కావడంలో సమస్యలు తలెత్తడమే అసలు కారణం’ అని ఫేస్‌బుక్ ఇంజనీర్ల బృందం వివరించింది.
బిలియనీర్ల జాబితాలో ఐదో స్థానానికి జుకర్‌బర్గ్
ఫేస్‌బుక్‌కి చెందిన మూడు సామాజిక మాధ్యమాల సేవలు చాలా గంటలపాటు ఒకేసారి పనిచేయకపోవడం, ఫేస్‌బుక్ ప్రజాసంక్షేమం కంటే.. ఆదాయార్జనకే అధిక ప్రాధాన్యమిస్తోందని మాజీ ఉన్నతోద్యోగి ఒకరు ఆరోపించడంతో ఫేస్‌బుక్ షేర్లు స్టాక్‌మార్కెట్‌లో 5 శాతం మేరకు పతనమయ్యాయి. ఫేస్‌బుక్ నుంచి ఎన్నో సంస్థలు తమ ప్రకటనలు తొలగించడంతో మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఏకంగా 700 కోట్ల డాలర్లు తగ్గిపోయింది. దీంతో ఆయన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో మూడో స్థానం నుంచి అయిదో స్థానానికి పడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment