నిజమే, ఓట్లు చీలవు! | Vardelli Murali Article On Chandrababu Politics For Coming Elections | Sakshi
Sakshi News home page

నిజమే, ఓట్లు చీలవు!

Published Sun, Apr 10 2022 12:40 AM | Last Updated on Sun, Apr 10 2022 12:41 AM

Vardelli Murali Article On Chandrababu Politics For Coming Elections - Sakshi

కొన్ని రకాల జంతువులు, పక్షులు రాబోయే భూకంపాన్ని ముందుగానే పసిగట్టగలుగుతాయి. వాటికున్న అయస్కాంత శక్తి వల్ల అది సాధ్యమవుతుంది. పసిగట్టిన క్షణాల నుంచి వాటి ప్రవర్తనలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటాయట! ఈ బెటాలియన్‌లో ప్రముఖంగా చెప్పుకోదగినవి జాగిలాలు, గబ్బిలాలు. అధికార సౌధపు గోడలకు గబ్బిలాల మాదిరిగా నిరంతరం వేలాడాలని కోరుకునే రాజకీయ పక్షులు కొన్ని ఉంటాయి. రాబోయే రాజకీయ ప్రకంపనల్ని ఈ పక్షులు పసిగట్ట గలుగుతాయి.

మూడేళ్ల కిందట వచ్చిన ఒక పెను ప్రకంపన కారణంగా ఈ పక్షుల గూడు చెదిరింది. ఇంకో రెండేళ్లకు అటువంటి ప్రకంపనే మరోసారి తప్పదని వాటి మాగ్నెటిక్‌ తరంగాలు అలారం బెల్స్‌ మోగిస్తున్నాయి. పక్షుల్లో విపరీత ప్రవర్తన మొదలైంది. కంపనాన్ని నిరోధించగలిగే మార్గాలపై అన్వేషణ మొదలైంది. కార్యాచరణ ప్రారంభమైంది.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మొన్నటి సూపర్‌ విక్టరీని మరోసారి నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షులు ఈ సంగతిని ఎప్పుడో పసిగట్టి ఉంటాయి. ఈ రాబోయే పరిణామాన్ని నిరోధించడానికి అవసరమని తాము భావించిన, అందు బాటులో ఉన్న అన్నిరకాల క్షుద్రపూజలను ప్రారంభించాయి. వారి పెంపుడు మీడియా నిర్నిద్ర గాత్రంతో భౌ కొడుతున్నది. మరోపక్క చడీచప్పుడు లేని రాజకీయ కౌటిల్యం చాప కింద ప్రవహిస్తున్నది. బేతాళ మాంత్రికోపాసన మొదలైంది.

అధికార పార్టీని ఓడించడానికి సమస్త వ్యక్తులూ, శక్తులూ ఏకం కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీ వరకూ, పవన్‌ పార్టీ నుంచి కమ్యూనిస్టుల వరకూ అందరూ ఏకమై తనను గెలిపించే చారిత్రక కర్తవ్యాన్ని భుజాల మీద మోయాలని ఆయన తలపోస్తున్నారు. ఇందుకోసం తెర వెనుక తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గంటను మాత్రం తన హితుడైన పవన్‌ కల్యాణ్‌ మెడలో వేసి తెర ముందు నిలబెట్టారు. సాలార్‌జంగ్‌ మ్యూజియంలోని ప్రాచీన మ్యూజికల్‌ గడియారంలో గంటకోసారి ఓ మరుగుజ్జు బొమ్మ వచ్చి, గంటలు మోగించి వెళుతుంది. పవన్‌ కల్యాణ్‌ పీరియాడికల్‌గా వచ్చి గంట మోగించి ఓట్లు చీలనివ్వబోమని ప్రకటించి వెళుతున్నారు.

‘ఒక్కొక్క ఓటేసి చందమామా...’ అని పాడుకుంటూ ఓట్లు ఏరుకోవలసిన పరిస్థితి ప్రతిపక్ష శిబిరానికి ఏర్పడింది. ఈ దురవస్థ స్వయంకృతం. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మనుషుల్ని విభజించింది. బలహీనుల్ని ద్వేషించింది. మేడల్నీ, మిద్దెల్నీ ప్రేమించింది. వాడలనూ, గూడేలనూ చిన్న చూపు చూసింది. పంట పొలాలనూ, పారే జలాలనూ కూడా కుల కలుషితం చేశారు. వీచే గాలుల్లో, విచ్చుకునే పువ్వుల్లో విద్వేషపు విషగంధం కలిపారు. ‘ఎస్సీ కులాల్లో పుట్టడ మేమిట’ని ఈసడించుకున్నారు. బీసీలను జడ్జీలుగా నియమించ రాదంటూ కేంద్రానికి ఉత్తరాలు రాశారు. నామినేటెడ్‌ పదవుల్లో బలహీన వర్గాలకు ఎక్కడైనా ఒకచోట కొంచెం కొసరు వాటా మాత్రం దక్కేది. పేద కుటుంబాల్లోని పిల్లల చదువును అటకెక్కించారు. పేదవాడికి రోగం రాకడ, ప్రాణం పోకడ అన్న చందంగా ప్రజారోగ్య వ్యవస్థను వ్యాపారమయం చేశారు.

ఈ మూడేళ్లు ప్రభుత్వ పాలన అందుకు వ్యతిరేక దిశలో సాగింది. కుల మతాలకు అతీతంగా మనుషుల్ని ఐక్యం చేసే ప్రయత్నం జరిగింది. చారిత్రక దురన్యాయం కారణంగా వెనుక బడుతున్న వారికి చేయందించి నడిపించే ప్రయత్నం జరిగింది. డబ్బు లేని కారణంగా చదువుకోలేని నిస్సహాయతను తొలగించ డానికి నడుం కట్టారు. అభివృద్ధి క్రమంలో ఆఖరుమెట్టు పైనున్న వాడు కూడా సమాన స్థాయిలో నిలబడి పోటీ పడగలిగే రోజు కోసం విద్యావ్యవస్థను సమాయత్తం చేస్తున్నారు. అందరికీ ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తున్నారు. నాణ్యమైన విద్య అందరికీ లభించేలా పాదు చేస్తున్నారు. పది పదిహేనేళ్లపాటు ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేయగలిగితే నేటి బలహీన వర్గాల ప్రజలు ఏ ప్రత్యేక రక్షణలూ, ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేని స్థాయికి చేరుకోగలుగుతారు. మనుషుల మధ్య విభజన రేఖలు చెరిగిపోతాయి. ఇంత గొప్ప ఆలోచనతో విద్యా సంస్కరణలను వై.ఎస్‌. జగన్‌ ప్రభుత్వం ప్రారంభించింది.

ప్రతి పేదింటి తలుపును కూడా ‘వారి’ ఫ్యామిలీ డాక్టర్‌ నెలకోసారి తట్టే రోజులు చేరువలో ఉన్నాయి. అందుక వసరమైన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవం ఇనుమడించేలా దేశంలో ఎక్కడా లేని పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రభుత్వ సాయంతో త్వరలో 30 లక్షల మంది మహిళలు గృహ యజమానులు కాబోతు న్నారు. పిల్లల చదువులకు సంబంధించిన నిర్ణయాధికారం ‘అమ్మ ఒడి’ రూపంలో ఆమెకు సంక్రమించింది. చిల్లర ఖర్చులకు కూడా భర్తలపైనో, పిల్లలపైనో ఆధారపడే నడి వయసు మహిళల చేతుల్లో ఇప్పుడు నాలుగు రాళ్లు కనబడుతున్నాయి. వారు మదుపు చేస్తున్నారు. రాబడి కోసం పోరాడుతున్నారు. ఆ కళ్లల్లో ఇప్పుడు సాధికారతా కాంతుల్ని చూడగలుగుతున్నాము.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సరికొత్త తిరుమంత్రం – సాధికారత. ప్రజా సంక్షేమం అనే భావన ఒక దశను దాటి సాధికారతా సాధన దశలోకి ప్రవేశిస్తున్నది. మనిషి మనిషిగా తన కాళ్లపై తాను బలంగా నిలబడగలిగే స్థితిలోకి చేరు కోవడమే– ఎంపవర్‌మెంట్, సా«ధికారత సాధించడం! వర్గ పోరాటాలు, కులయుద్ధాల ప్రసక్తి లేకుండా సమసమాజ స్థితికి చేరుకునేందుకు ప్రజా స్వామ్యం పరిచిన బాట సాధికారత. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వివిధ సామాజిక క్షేత్రాల్లో వెదజల్లిన సాధికారతా విత్తనాలు ఇప్పుడు మొలకెత్తు తున్నాయి. మరోపక్క ఏకకాలంలో చేపట్టిన పరిపాలనా సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రశంసల్నీ, స్థానిక ప్రజల అభిమానాల్నీ చూరగొన్నాయి. ఈ నేపథ్యమే ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని ప్రతిపక్ష శిబిరాన్ని కలవ రపెడుతున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి యాభై శాతానికి పైగానే ఓట్లు రాగల క్షేత్రస్థాయి వాస్తవికత ప్రతిపక్షానికి అవగతమైంది. అందుకే తన పాత ద్విముఖ వ్యూహానికి మరింత పదును పెట్టే పనిలో అది నిమగ్నమైంది.

వీలైనన్ని పార్టీలను తమ కూటమిలోకి లాగే ప్రయత్నాలను ఒకపక్క చేస్తూనే, మరోపక్కన శరపరంపరగా అధికారపక్షంపైకి నిందారోపణల్ని కురిపిస్తున్నారు. రెండు పత్రికలు, ఐదారు చానళ్లతో కూడిన ఎల్లో మీడియా, దానికి అనుబంధంగా ఒక అక్షౌహిణి సైన్యంతో ఏర్పాటైన ఎల్లో డిజిటల్, ఎల్లో సోషల్‌ మీడియా కార్ఖానాలు ఇప్పుడు మూడు షిఫ్టులూ పనిచేస్తు న్నాయి. టన్నులకొద్దీ అసత్యాలనూ, వార్తా వ్యర్థాలనూ సొసైటీలోకి వదులుతున్నాయి. ప్రతి వార్తకూ, ప్రతి సంఘట నకూ వక్రీకరణ భాష్యం నిత్యకృత్యమైంది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ఆవరించి ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్నే ఎల్లో మీడియా వేలెత్తి చూపిస్తున్నది.

ఎన్నడూ లేని విధంగా ఈసారి మార్చి మొదటి వారం నుంచే ఎండలు భగ్గుమన్నాయి. గృహ వినియోగం, వాణిజ్య వినియోగం అంచనాలకు మించి పెరిగింది. వ్యవసాయానికి తొమ్మిది గంటలు సరఫరా చేసిన ఫలితంగా వినియోగం భారీగా పెరిగింది. బొగ్గు ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించింది. ఉక్రెయిన్‌ యుద్ధం ఫలితంగా చాలా దేశాల్లో బొగ్గు కొరత ఏర్పడింది. ఫలితంగా బొగ్గు ఆధారిత ధర్మల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు దొరకడమే గగనం. దొరికినా టన్నుకు రూ. 30 వేల నుంచి 40 వేల వరకు ధర పలుకుతున్నది. ఆ ధరలకు కొనుగోలు చేయడమంటే డిస్కమ్‌లకు ప్యాకప్‌ చెప్పడమే! ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు, గ్యాస్‌ ధరలకు యుద్ధం మరింత ఆజ్యం పోసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విద్యుత్‌ వినియోగ డిమాండ్‌ 235 మిలియన్‌ యూనిట్లుగా ఉన్నదని ఇంధన శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 180 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుబాటులో ఉన్నది. ఇంకో 55 మిలియన్‌ యూనిట్లు లోటు. పవర్‌ ఎక్స్ఛేంజీల్లో ఈ మొత్తం లోటు మేరకు కొనుగోలు చేయాలనుకుంటే రోజుకు రూ. 100 కోట్లు ఖర్చుపెట్టాల్సిందే. ప్రభుత్వం అందుకు సిద్ధపడినా కూడా ఆ మేరకు ఎక్స్ఛేంజిల్లో కూడా లభ్యత లేదు. దొరికినంత మేరకు కొనుగోలు చేసి సర్దుబాటు చేస్తున్నామని ఇంధన శాఖ అధికారి చెప్పారు. ఈ నెలాఖరు నాటికి వరి కోతలు మొదలవుతాయి కనుక వ్యవసాయ డిమాండ్‌ పడిపోతుందనీ, వచ్చే నెల మొదటి వారానికల్లా ఈ సంక్షోభం తగ్గిపోతుందనీ చెబుతున్నారు.

ఒక ప్రకృతి వైపరీత్యం, ఒక యాక్సిడెంట్‌ లాగా ముంచు కొచ్చిన సమస్య ఇది. తాత్కాలికమైనది. అభివృద్ధి చెందిన పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లే పవర్‌ హాలిడే లను ప్రకటించాయి. ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో గంటల తరబడి అప్రకటిత కోత అమలవుతున్నది. మెయిన్‌టెనెన్స్‌ పేరుతో చెన్నైలోనూ కోతలు విధిస్తున్నారు. సొంత బొగ్గు గనులున్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే అడపాదడపా అప్రకటిత కోతలు తప్పడం లేదు. దేశమంతా ఉమ్మడిగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను జగన్‌ తలకు చుట్టేందుకు ఎల్లో సిండికేట్‌ ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నదో చూస్తూనే ఉన్నాము.

వైజాగ్‌లో ఎన్‌సీసీ అనే సంస్థకు భూ కేటాయింపుల విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని రద్దు చేయాలన్నది ఎల్లో మీడియా డిమాండ్‌. కానీ అమరావతిలో మాత్రం రద్దు చేయకూడదట! ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న అప్పుల ఫలితంగా త్వరలో మరో శ్రీలంక మాదిరిగా కాబోతున్నదని ఎల్లో మీడియా చేస్తున్న బృందగానం వింటూనే ఉన్నాము. బాబు హయాంలో చేసిన అప్పుల గురించి కానీ, ఈ మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ సాధించిన ఆర్థికాభివృద్ధిని గురించి కానీ ఎల్లో మీడియా మాట్లాడదు! చంద్రబాబు పాలన చివరి సంవత్సరం రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 1,54,031 రూపాయలు. 2021– 22లో అది 2,07,771కి పెరిగింది. దీని గురించి మాట్లాడదు! చంద్రబాబు పాలన చివరి సంవత్సరంలో (2018–2019) జీఎస్‌డీపీ వృద్ధి రేటు 5.36 శాతం. 2021–22లో అది 11.43 శాతం. దేశంలోనే అత్యధికంగా వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. జీఎస్‌డీపీ పెరగడ మంటే... ఆర్థిక కార్యక్రమాలు పెరగడం, ఉత్పత్తులు, సేవలు పెరగడం, ద్రవ్య చలామణీ పెరగడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడమని అర్థం. గత ఆర్థిక సంవత్సరం జీఎస్‌టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్‌ 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. 52 వేల కోట్ల రూపాయలు వాణిజ్య పన్నుల ఆదాయంగా సమకూరింది. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్‌ పురోగామి రాష్ట్రంగా ఉన్నదని ఈ గణాంకాలన్నీ ఘంటాపథంగా చెబుతున్నాయి. కానీ ఎల్లో సిండికేట్‌కు మాత్రం తమ ప్రభుత్వాన్ని ఓడించిన ఆంధ్రప్రదేశ్‌లో లంకాదహన దృశ్యమే కనిపిస్తున్నది. వారికి కనువిందు చేస్తున్నది.

అసత్య ప్రచారాలతో అధికార పార్టీ ఓటింగు బలాన్ని ఎంతో కొంత తగ్గించే తాపత్రయానికి తోడు ప్రతిపక్షం ఓట్లు చీలకుండా, చంద్రబాబు పెట్టబోయే మహాకూటమి జోలెలోనే పడాలన్నది మరో వ్యూహం. ఇక్కడ రాజకీయ నాయకులు మరిచిపోతున్న విషయం ఒకటున్నది. అలయెన్స్‌లూ, ఐక్య సంఘటనలూ రాజకీయ పార్టీలకే కాదు... ప్రజలకూ ఉంటాయి. ఆ విషయం గతంలో అనేకసార్లు నిరూపణయింది. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ స్వయంగా ఓటమి పాలై కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జాతీయ కాంగ్రెస్‌ నుంచి బహిష్కరణకు గురైన ఇందిరాగాంధీ ‘కాంగ్రెస్‌(ఐ)’ పేరుతో చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 1978లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. జాతీయ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నది. బ్రహ్మా నందరెడ్డి అధ్యక్షుడిగా ఉండేవారు కనుక ‘రెడ్డి కాంగ్రెస్‌’గా పిలిచేవారు. ముఖ్యమంత్రిగా ‘రెడ్డి కాంగ్రెస్‌’ నేత వెంగళరావు ఉన్నారు. కాంగ్రెస్‌ అతిరథ మహారథులంతా ‘రెడ్డి కాంగ్రెస్‌’లోనే ఉన్నారు. మరికొందరు జనతా పార్టీలోకి వలసపోయారు. ప్రతిపక్ష యోధానుయోధులు, అధికార పక్షం నుంచి వచ్చిన అతిరథులతో కూడిన జనతా పార్టీ బలీయంగా కనపడింది. రెండు పార్టీల మధ్య హోరాహోరీ ప్రచార పోరు! ఇందిరా కాంగ్రెస్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్లకు టిక్కెట్లు వచ్చాయి.

ఇందిరాగాంధీ అధికారంలో ఉండగా సామాన్య ప్రజలకు చేసిన మేలును వారు మరిచిపోలేదు. ‘గరీబీ హఠావో’ ఉద్యమాన్ని వారు మరిచిపోలేదు. సంపన్నుల సేవలో తరిస్తున్న బ్యాంకుల మెడలు వంచి, వాటిని జాతీయం చేసి సామాన్య ప్రజలకు రుణాలిప్పించిన జ్ఞాపకమూ చెదిరిపోలేదు. ఇందిరమ్మ పార్టీ గుర్తు కూడా కొత్తది. పెద్దగా ప్రచారం చేసే నాధుడు లేడు. అయినా, బలమైన స్థానిక నాయకత్వమున్న రెండు పార్టీలకు వ్యతిరేకంగా బీదాబిక్కీ జనమంతా ఒక్కటైనారు. తమ ఓట్లను చీలనివ్వలేదు. ఇందిరమ్మ గుర్తును తెలుసుకొని, బ్యాలెట్‌ పేపర్‌లో వెతికి పట్టుకొని మరీ ఓట్ల వర్షం కురిపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ‘మహా కూటమి’గా ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌ ఓట్లకు కోతపెట్టిన ‘ప్రజారాజ్యం’ ఒక్కటే విడిగా పోటీ చేసింది. ‘మహాకూటమి’కి ధీటుగా వైఎస్‌ఆర్‌ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా మహత్తర కూటమిగా ఐక్యమై, రాజకీయ కూటమిని మట్టి కరిపించారు. తమకు మేలు చేసే, తమ శ్రేయస్సుకు బాటలు వేసే ప్రభుత్వాల మీద జరిగే కుట్రలనూ, కుయుక్తులనూ జనం గమనిస్తారు. ‘ఓట్లు చీలనివ్వం’ అనే మాట పవన్‌ కల్యాణ్, చంద్రబాబు చెప్పడం కాదు... ప్రజలే చెబుతారు. సామాజిక వర్గాల సంయుక్త అలయెన్స్‌ను వారే ప్రకటించుకుంటారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు, అగ్రవర్ణ అభ్యుదయ వర్గాలతో కూడిన అఖండమైన ఓటు బ్యాంకును చెదరనివ్వరు! వారి ఓట్లు చీలవు!!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement