
కరోనా వైరస్‌తో రాగల ముప్పు గురించి ఎందరు హెచ్చరించినా మొదట్లో బేఖాతరు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వాకానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన స్థితిలో పడింది. లక్ష నుంచి 2 లక్షలమంది వరకూ ఈ వ్యాధికి బలయ్యే ప్రమాదం వున్నదని ‘చావు కబురు’ చల్లగా చెప్పినట్టు ఆయన ఇప్పుడు ప్రకటిస్తున్నారు. సరిగ్గా నెలక్రితం ఆయన కరోనా ప్రమాదం గురించి కొట్టిపడేశారు. మార్చి 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధి గురించి హెచ్చరిస్తూ, దీని బారిన పడినవారిలో 3.4 శాతం మంది బలయ్యే అవకాశం వున్నదని తెలిపింది. కానీ ట్రంప్ అదంతా అబద్ధమని తోసిపుచ్చారు. మరణాల రేటు మహావుంటే ఒక శాతం ఉండొచ్చునని వాదిం చారు. అతిగా అంచనాలు వేసి భయపెట్టొద్దని సలహా కూడా ఇచ్చారు. ఇన్నాళ్లకు ఆయనకు జ్ఞానోద యమైంది.
ఇందుకు వైద్య రంగ నిపుణుల్ని, శాస్త్రవేత్తల్ని మొదటగా అభినందించాలి. నెలరోజులుగా వారు ఎంతో శ్రమపడితే తప్ప ట్రంప్ ఈ స్థాయికి వచ్చివుండరని ఆయన మొండివైఖరి గురించి తెలిసినవారందరికీ అర్థమవుతుంది. ప్రమాద తీవ్రతను అంగీకరించిన ఈ సమయంలో కూడా ‘ఇంత తక్కువ మరణాలు’ తన ప్రభుత్వం తీసుకునే చర్యలవల్లేనని ట్రంప్ చెప్పుకున్నారు. మృతుల సంఖ్య ఒకేరోజు 500 దాటాక తన ప్రథమ ప్రాధాన్యత కరోనాయేనని, ఆర్థిక వ్యవస్థ ఆ తర్వాతే వస్తుందని తెలిపారు. కొన్ని రోజులు వెనక్కి వెళ్లి చూస్తే ట్రంప్ దీనికి విరుద్ధమైన ప్రకటనలు చేశారు. కరోనా వ్యాధి పెద్ద సమస్యకాదని, ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడపడమే తన కర్తవ్యమని ఆయన చెప్పిన సంగతి ఎవరూ మరిచిపోరు. సరిగదా... చాలా త్వరలోనే ఈ వ్యాధికి వ్యాక్సిన్ రాబోతోందని కూడా ట్రంప్ మార్చి 7న భరోసా ఇచ్చారు.
మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 8,00,000 దాటి ముందుకుపోగా, ఇందులో ఒక్క అమెరికాలోనే 1,65,000 మంది వున్నారు. ట్రంప్ నిలకడలేని ప్రకటనలు అమెరికా ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తాయి. ఆయన మాటలతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు అమల్లోకి తెచ్చినా పౌరులెవరూ వాటిని తీవ్రంగా తీసుకోలేదు. వివిధ రాష్ట్రాల గవర్నర్లను ట్రంప్ ఎగతాళి కూడా చేశారు. అదే ఇప్పుడు కొంపముంచిందని రోజురోజుకీ పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్యను చూస్తే అర్థమవుతుంది.
అమెరికా చరిత్ర తిరగేస్తే అచ్చం ట్రంప్ మాదిరే సంక్షోభం ముంచుకొచ్చినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూసిన పాలకుడు మరొకరు కనిపిస్తారు. 80వ దశకంలో ఆ దేశాన్నేలిన రొనాల్డ్ రీగన్ అప్పట్లో బయటపడిన హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ వైరస్ గురించి చెప్పినప్పుడు అతిగా స్పందించొద్దని రీగన్ కొట్టిపడేశారు. ఎనిమిదేళ్లు అధికారంలో వుంటే చిట్టచివరి సంవత్సరంలో మాత్రమే ఆయన అయిష్టంగా ఈ వ్యాధిగ్రస్తుల విషయంలో పూర్తి స్థాయి చర్యలకు ఉపక్రమించారు. కానీ ఈలోగా 4 లక్షలమంది పౌరులు ఆ వ్యాధికి బలైపోయారు. ఆ అనుభవాలు తన కళ్లముందే వున్నా ట్రంప్ సైతం అదే తరహా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఫలితంగా మొదట్లో కరోనా వెల్లడైన చైనాను మించి మరణాలు సంభవించే ప్రమాదం కనబడు తోంది. ట్రంప్ తనంత తానే ‘దాదాపు 2 లక్షలమంది వరకూ మరణించే అవకాశం ఉన్న’దని చెప్పారు. కానీ ఆ దేశంలోని ఇంపీరియల్ కాలేజీ అధ్యయనం చూస్తే ఎవరైనా బెంబేలెత్తడం ఖాయం.
ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి సకాలంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధపడకపోతే 22 లక్షలమంది మృత్యువాత పడే అవకాశం వున్నదని ఆ అధ్యయనం అంచనా వేసింది. ప్రాథమిక పరీక్షలు మొదలుకొని చికిత్స వరకూ వేర్వేరు అంశాల్లో ప్రభుత్వాలు స్పందించే తీరుతెన్నుల్ని ఊహించి, ఏరకంగా స్పందిస్తే ఏ తరహా పరిస్థితులు ఏర్పడతాయో కంప్యూటర్ ఆధారిత నమూనాల ద్వారా ఈ అంచనా వేసింది. వాటి ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. ఎవరి అంచనాలెలా వున్నా పాలకులు మాత్రం అత్యుత్సాహంతో ఇంతమంది చనిపోతారంటూ లెక్కలు చెప్పి హడ లెత్తించకూడదు. మొదట్లో నిపుణుల సూచనల్ని, సలహాల్ని బేఖాతరు చేసి ఏ తప్పు చేశారో...ఇప్పుడు వెనకా ముందూ చూడకుండా కొన్ని అంకెలు వల్లెవేయడం ద్వారా కూడా ఆయన అదే తప్పు చేస్తున్నారు. ప్రభుత్వానికి నిపుణులు అనేకానేక సూచనలు చేస్తారు. పరిస్థితి తీవ్రత గురించి అవగాహన కలిగిస్తారు. తెలివైన పాలకులు వాటిని అర్థం చేసుకుని పౌరులకు ఎంతవరకూ చెప్పాలో అంతే చెబుతారు.
ప్రభుత్వాల చర్యలే సమస్య తీవ్రతను అర్థం చేయించాలి. అదే సమయంలో పాలకులు భరోసా ఇవ్వాలి. ఈ మహమ్మారిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని చర్యలూ తీసుకుంటున్నదన్న అభిప్రాయం పౌరుల్లో కలగజేయాలి. అప్పుడు మాత్రమే వారు తమ వంతు క్రమశిక్షణతో మెలిగి, ఎలాంటి సంక్షోభాన్నయినా అవలీలగా జయిం చగలుగుతారు. కరోనా వ్యాప్తికి సంబంధించి ఫిబ్రవరి–మార్చి నెల మధ్య సమయం ఎంతో కీలకం. దాన్నంతటినీ ట్రంప్ వృథా చేశారు. చెప్పడానికి ప్రయత్నించినవారిని గేలి చేశారు. తన మాటే సరైందని వాదించారు. ఫిబ్రవరి 26న ఆయన చేసిన ప్రకటనే ఇందుకు రుజువు. అప్పటికి 15 కేసులు బయటపడ్డాయి. ఇవి రెండుమూడు రోజుల్లో సర్దుకుంటాయని, ఆ తర్వాత కరోనా కేసులే వుండవని ఆయన చెప్పారు. ఆయనకు ఇప్పుడు తత్వం బోధపడింది. కానీ ఆ కేసుల సంఖ్య 1,65,000 కు చేరుకుంది. ఈమధ్య కాలమంతా ఆయన అబద్ధాలతో, దబాయింపులతో కాలక్షేపం చేశారు. ఇప్పు డున్న పరిస్థితుల్లో ఏ దేశానికి వచ్చిన విపత్తయినా ప్రపంచ పౌరులందరికీ దుఃఖం కలిగిస్తుంది. అందునా చదువుకో, కొలువుకో అమెరికా వెళ్లినవారు ఇప్పుడు మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గణనీయంగా వున్నారు. అందువల్లే ఆ అగ్రరాజ్యం త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.