మొదటినుంచీ కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అమెరికాను రోగగ్రస్తం చేసిన ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి బ్రహ్మాండంగా పనికొస్తుందని తాను విశ్వసిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం ఎగుమతులపై మన దేశం నిషేధం విధించిందనగానే ఆయన చేసిన వ్యాఖ్యానం ఇందుకు నిదర్శనం. ‘అదే నిజమైతే భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామ’ంటూ ఆయన విరుచుకుపడ్డారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ గురించి ట్రంప్ చాన్నాళ్లుగా మాట్లాతున్నారు. వైద్యులు రోగిని అన్నివిధాలా పరీక్షించి, తమ పర్యవేక్షణలో మాత్రమే దాన్ని వాడవలసివుంటుందని, ఎవరికి తోచినట్టు వారు ఉపయోగిస్తే ప్రాణాలకు ముప్పు తెస్తుందని అమెరికాలోని వైద్య నిపుణులు ఇప్పటికే ట్రంప్‌కు చెప్పారు.
అయినా ఆయన తలకెక్కలేదు. ఆ మందు గురించి తరచుగా చెబుతూనేవున్నారు. దీనికి, మన దేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసెటమాల్ ఎగుమతులపైనా నిషేధం విధించడానికి సంబంధం లేదు. ఈ ఆపత్కాలంలో మన దేశానికే వాటి అవసరం పడవచ్చునన్న ముందస్తు ఆలోచనతో రెండురోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాధిగ్రస్తులకు ఇది పరిమితంగానే ఉపయోగపడినా, వారి బాగోగులు నిత్యం చూసే వైద్యులు ముందుజాగ్రత్తగా వాడాల్సివుండొచ్చని నిపుణులు తేల్చారు. పైగా మన దేశంలో మలేరియా వ్యాధిగ్రస్తులు కూడా ఎక్కువ గనుక ఆ మందు అందుబాటులో వుండటం అవసరమని భావించారు. నిపుణులతో చర్చించి, పాలనావ్యవహారాల్లో ముఖ్యపాత్ర పోషించేవారి అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ట్రంప్‌కు ఈ గొడవ లేదు. తాను అనుకున్నదే జరగాల నుకుంటారు. కరోనా వైరస్ విషయంలోనూ ఆయన తీరు మొదట్లో అదే మాదిరి వుంది. దాని ప్రభావం తమ దేశంపై ఉండదుగాక ఉండదని ట్రంప్ బలంగా నమ్మారు. అందుకే చాన్నాళ్లు పట్టించుకోవడం మానేశారు. ఈలోగా ఎవరో ఆయనకు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంటించారు.
తన విశ్వాసానికి శాస్త్రీయ ప్రాతిపదిక వున్నా లేకున్నా, ఆ ఔషధం అత్యవసరమని ట్రంప్ భావించారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు. దానిపై నిర్ణయం తీసుకోవడానికి కాస్తయినా వ్యవధి ఇవ్వకుండానే ఈలోగా నోరు పారేసుకున్నారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు కావస్తున్నా దౌత్య మర్యాదలు ట్రంప్‌కు ఒంటబట్టలేదని దీన్నిబట్టి అర్ధమవుతుంది. అమెరికా ఇలా అహంభావంతో మాట్లాడటం కొత్తేమీ కాదు. వేరే దేశాలతో వైరం ముదిరిన సందర్భాల్లో గతంలో అధ్యక్షులుగా వున్నవారు ఈ మాదిరే హెచ్చరికలు చేసేవారు. కానీ అకారణంగా నోరు పారేసుకోవడంలో ట్రంప్ వారిని మించిపోయారు. ఆయనకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ పదం ఉపయోగించాలో కూడా తెలియదు. భారత్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ దిగుమతి చేసుకుంటామని, దీనిపై మోదీతో మాట్లాడానని ట్రంప్ చెప్పాక, ఈ నిషేధం సంగతిని ఒక విలేకరి ప్రస్తావించారు. అంతటితో ఆగక వైద్య ఉపకరణాల ఎగుమతిని అమెరికా నిషేధించినందువల్లే అందుకు జవాబుగా భారత్ ఈ పని చేసివుండొచ్చనుకుంటున్నారా అని కూడా అడిగారు. అంతక్రితం మాటెలావున్నా భారత్–అమెరికాల మధ్య మూడు దశాబ్దాలుగా గాఢమైన అనుబంధం ఉంది.
దీనికితోడు ఇరు దేశాధినేతల మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయి. ఈ నేపథ్యంలో మరొకరెవరైనా అయితే ఆ నిషేధం ఉండబోదని ఆశిస్తున్నట్టు చెప్పేవారు. కానీ ట్రంప్ మాత్రం ఇరు దేశాల మధ్యా వున్న వాణిజ్యసంబంధాల చరిత్ర, అందువల్ల ఎప్పుడూ మన దేశమే ‘లాభపడుతున్న’ వైనం ఏకరువు పెట్టారు. మోదీ నిర్ణయం అదే అయితే అందుకు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలి. అయితే ఏ దేశానికి ఆ దేశం తమ స్థితిగతులెలావున్నాయో చూసుకుని వేరే దేశాలకు ఎంతవరకూ సహకరించగలమన్నది నిర్ణయించుకుంటాయి. తనకు మాలిన ధర్మాన్ని ఏ దేశమూ చేయలేదు. వైద్య ఉపకరణాల విషయంలో అమెరికా అయినా, ఔషధాల విషయంలో మన దేశమైనా ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాయని బోధపడుతుంది. అయితే నిర్ణయాన్ని సడలించుకోవాలని ఏ దేశమైనా అభ్యర్థించడం సహజం. కొన్ని సందర్భాల్లో అధిక మొత్తం వెచ్చించి కొనడానికి కూడా సిద్ధపడే సందర్భాలుంటాయి. ఈమధ్యే వేరే దేశం కోసం చైనా సిద్ధం చేసిన మాస్క్‌లను అమెరికా తన్నుకుపోయిందని వార్తలొచ్చాయి. తాను వైద్య ఉప కరణాల ఎగుమతిని నిలిపేసినా తప్పులేదు. వేరే దేశానికి వెళ్లాల్సిన మాస్క్‌లు హైజాక్ చేసినా పర్వాలేదు. కానీ తాను అవసరమనుకునే ఔషధం ఎగుమతిని మాత్రం ఏ దేశమూ నిషేధించ కూడదు. ఇదీ అగ్ర రాజ్య నీతి!
ఇప్పుడు కేంద్రం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై వున్న నిషేధాన్ని ఎత్తివేసింది. కేవలం దేశంలో నిల్వలు ఏ స్థాయిలో వున్నాయో, మన అవసరాలకు సరిపోతాయో లేదో లెక్క చూసుకోవడానికి తాత్కా లికంగా ఎగుమతులు ఆపాలన్న నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు దాన్ని తొలగిస్తున్నామని మన విదేశాంగ ప్రతినిధి చెప్పారు. నిరుడు అమెరికాకు కావలసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవసరాల్లో 47శాతం మన ఫార్మా కంపెనీలే తీర్చాయి. ఈ ఔషధాన్ని అమెరికాకు సరఫరా చేసే తొలి పది సంస్థల్లో మన దేశానికి చెందినవే అధికం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం వున్నవారికి ఆ ఔష ధాన్ని అందిస్తామని మన దేశం అభయమివ్వడం మెచ్చదగ్గ నిర్ణయం. కానీ ట్రంప్ బెదిరింపు ధోర ణితో మాట్లాడటం సరికాదని కూడా చెప్పవలసింది. వాణిజ్యపరమైన వివాదాలేమైనా వుంటే సామ రస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. నోరు పారేసుకుని పనులు చక్కబెట్టుకుం దామనుకునే ధోరణి సరికాదు.
Comments
Please login to add a commentAdd a comment