అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అసాధారణ నిర్ణయాలు తీసుకోక తప్పదు. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడిన వర్తమానంలో ఎంపీల జీతభత్యాల్లో 30 శాతం కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించడం కూడా ఇటువంటిదే. దీంతోపాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రాల గవర్నర్లు కూడా ఇదే తరహాలో తమ జీతాలు తగ్గించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మాజీ ఎంపీలకిచ్చే పింఛన్‌లకు కూడా ఈ కోత వర్తిస్తుంది. ఇదంతా ఏడాదిపాటు అమల్లోవుంటుంది. ప్రధాని, కేంద్రమంత్రులు, సహాయమంత్రులు అందరూ దీని పరిధిలోకొస్తారు. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజాప్రతినిధులకూ, ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చే జీతభత్యాల్లో కొంత శాతం కోత విధించాయి. ఈ మొత్తాన్ని అనంతరకాలంలో చెల్లిస్తామని ప్రకటించాయి. ఇప్పుడు కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయాన్ని గమనిస్తే, సర్వశక్తులూ కేంద్రీకరించి పనిచేస్తే తప్ప దీన్ని దుంపనాశనం చేయడం అసాధ్యం. కనుక ఆ దిశగా రాగలకాలంలో మరిన్ని చర్యలు తప్పకపోవచ్చు.
వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారి కోసం ఆసుపత్రులను, సిబ్బందిని సిద్ధంగా వుంచడం, చికిత్స చేయడం, అందుకు అవసరమైన ఔషధాలు, చికిత్సకు అవసరమైన ఉపకరణాలు సమీక రించడం భారీ యజ్ఞంవంటిది. పన్నుల రూపంలో, సుంకాల రూపంలో వివిధ పద్దులకింద ప్రభు త్వాలకు సమకూరే ఆదాయం కూడా వీటన్నిటికీ ఎక్కడా సరిపోదు. ఇందువల్లే స్తోమత వున్నవారు విరివిగా విరాళాలివ్వాలని పిలుపునిస్తున్నాయి. ఇప్పుడు ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లో కోత దీనంతటికీ కొనసాగింపే. దేశం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నదో మీడియాలో నిత్యం వచ్చే వార్తా కథనాలు వెల్లడిస్తూనే వున్నాయి. లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలూ మూతబడి ఉత్పాదక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు కూడా ఆగిపోక తప్ప లేదు. సామాన్యులంతా ఈ పర్యవసానాలు అనుభవిస్తున్నారు. పూట గడవడం ఎలాగో తెలియక మహానగరాలను నమ్ముకుని ఇన్నాళ్లూ బతుకు బండి ఈడుస్తున్న నిరుపేద వర్గాల ప్రజలు గత్యం తరం లేని స్థితిలో స్వస్థలాలకు తిరుగుముఖం పట్టడం మీడియాలో అందరూ చూశారు.
ఇప్పుడొ చ్చిన ఈ విపత్తు ఇంతక్రితం మానవాళి ఎదుర్కొన్న ఉత్పాతాలన్నిటినీ తలదన్నేంత తీవ్ర స్థాయిలో వుంది. ఈ వైరస్ సృష్టిస్తున్న జీవన విధ్వంసం సాధారణమైనది కాదు. అందరూ తమకు చేతనైనం తగా సాయం చేస్తేనే, తమకు తారసపడిన నిస్సహాయులకు ఏదో రూపంలో చేయూతనందిస్తేనే ఈ విషాద దశను దాటడం సాధ్యమవుతుంది. వ్యక్తులుగా కొందరు, అనేక స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కృషిలో పాలుపంచుకుంటున్నాయి కూడా. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీఎం సహాయనిధు లకు విరాళాలు భారీగా అందుతున్నాయి. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌కు ఇంతవరకూ దాదాపు రూ. 6,500 కోట్ల మేర విరాళాలు వచ్చాయంటున్నారు.
ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లో కోత విధించడంతోపాటు ఎంపీల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీలాడ్స్) నిధులను రెండేళ్లపాటు నిలిపివేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం. ఈ కారణంగా ప్రభుత్వానికి రూ. 7,900 కోట్లు సమకూరుతాయి. ఎంపీల జీతభత్యాలకు విధించే కోతలవల్ల వచ్చే నిధులతోపాటు ఈ నిధులు కూడా ప్రభుత్వ సంచితనిధికి తరలుతాయి. 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సర్కారు ఎంపీలాడ్స్ పథకాన్ని అమల్లోకి తెచ్చి ప్రతి ఎంపీ ఏడాదికి అయిదు లక్షల రూపాయల పనులు మంజూరు చేసేందుకు అవకాశమిచ్చింది. ఆ మొత్తాన్ని మరుసటి సంవత్సరం కోటి రూపాయలకు పెంచింది. అది క్రమేపీ పెరుగుతూ వచ్చి ఇప్పుడు పది కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ నిధుల్ని సమర్థవంతంగా వినియోగించి తమ తమ పరిధుల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆ పథకాన్ని మెరుగ్గా వినియోగించనివారూ, అసలు దాని జోలికే పోనివారు కూడా వుంటున్నారు. కరోనా వైరస్‌పై పోరుకు అవసరమైన నిధులు సమీకరించడం కోసం ఈ ఎంపీలాడ్స్‌ను కూడా రెండేళ్లపాటు ఆపేయాలనుకోవడం కంటే, ఆ నిధుల్ని మరో పద్ధతిలో వినియోగించడానికి వీలు కల్పిస్తే బాగుండేది.
వాటిని సంచితనిధికి తర లించడం కాక ఆ ఎంపీలు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలకు కేటాయిస్తే కరోనా వైరస్‌తో పోరాడు తున్న ప్రభుత్వాలకు చేయూతనిచ్చినట్టు అయ్యేది. పన్నులు, సుంకాల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాల వాటా గతంతో పోలిస్తే తగ్గింది. పైగా కేంద్రంనుంచి రావాల్సిన బకాయిలు కొన్ని పెండింగ్ వున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో పలు రాష్ట్ర ప్రభు త్వాలు దాదాపు ఒంటిచేత్తో ఈ మహమ్మారిపై పోరాడుతున్నాయి. అటు మహమ్మారిని ఎదుర్కొన డానికి, ఇటు నిరుపేద వర్గాలకు చేయూతనీయడానికి అవసరమైన నిధులు అందుబాటులో వుంటేనే రాష్ట్రాలు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతాయి. సంచిత నిధికి వెళ్లే వివిధ రకాల మొత్తాలన్నీ ఎటూ రాష్ట్రాల్లో వ్యయం చేస్తారు. దాన్నెవరూ కాదనరు. కానీ చాలాచోట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికి ప్పుడు నిధుల అవసరం ఎంతోవుంది. ఆ అవసరాన్ని తీర్చడానికి ఎంపీలాడ్స్ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి దాదాపు రెండు వారాలు కావస్తోంది. పౌరుల కదలికలపై తప్ప సరుకు రవాణాకు ఎలాంటి అడ్డంకులూ వుండబోవని కేంద్ర ప్రభుత్వం ప్రక టించినా రాష్ట్రాల మధ్యా, కొన్ని రాష్ట్రాల్లో వివిధ జిల్లాల మధ్యా ఇంకా సరుకు రవాణాకు, ముఖ్యంగా ఔషధాలకు ఆటంకాలు ఎదురవుతూనే వున్నాయి. పర్యవసానంగా కొన్ని సరుకులు మార్కెట్ల నుంచి మాయమైతే, మరికొన్నిటి ధరలు చుక్కలంటుతున్నాయి. ఇప్పుడెదురవుతున్న ఇబ్బందులతోపాటు, మున్ముందు ఎదురుకాబోయే సమస్యలేమిటో అంచనా వేసుకుని, రాష్ట్రాల సహకారంతో వీటన్నిటినీ చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వుంది.
Comments
Please login to add a commentAdd a comment