అఖిల భారత స్థాయి హోమియో వైద్యుడిగా పేరొందిన డాక్టర్ సోహన్ సింగ్ అచ్చమైన తెలుగువాడు. గదర్ వీరుడు సోహన్ సింగ్ జోషీ స్ఫూర్తితో ఆయనకు ఆ పేరు పెట్టారు. దానికి తగ్గట్టుగానే, రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగానూ ఉచిత హోమియో ప్రజా వైద్య శిబిరాలు నెలకొల్పుతూ, మందులు అందిస్తూ తాను చనిపోయేదాకా విశిష్ట సేవలు అందించారు సోహన్ సింగ్. వైద్యంలో వీరుడిగా నిలిచారు.
అఖిల భారత స్థాయి హోమియో వైద్యుడు, హోమియోలో కేంద్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సోహన్ సింగ్ వైద్య వృత్తిలోనూ ‘గదర్’ వీరుల వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న సామాజిక కార్యకర్త. నరనరాన ప్రజా సేవలోనే తరించుతూ ఈ నెల 24న తన 76వ ఏట కన్నుమూశారు. అభ్యుదయ కవి పండితులు, పాత్రికేయ కురువృద్ధు తాపీ ధర్మారావు మనవరాలు విమలను సోహన్ సింగ్ పెళ్లాడారు. ఈమె ‘విశాలాంధ్ర’ దినపత్రిక సంపా దకునిగా పనిచేసిన తాపీ మోహనరావు కుమార్తె. మా తరం అంతా తాపీ మోహనరావు ఆధ్వర్యంలో పాత్రికేయ వృత్తి మెలకువలు దిద్దుకున్న వాళ్లమే.
ఒక తెలుగువాడికి ‘సోహన్ సింగ్’ అని పేరు పెట్టడానికి కారణం, ‘గదర్ పార్టీ’ వీరులలో ఒకరైన ‘సోహన్ సింగ్ జోషీ’. దరిశి చెంచయ్య స్థాపించిన ఈ పార్టీ తెలుగునాట విప్లవోద్యమ బీజాలు నాటిందని మరచిపోరాదు. ఇంతటి పూర్వ చరిత్ర స్ఫూర్తితో ఎదుగుతూ, రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగానూ ఉచిత హోమియో ప్రజా వైద్య శిబిరాలు నెలకొల్పుతూ, మందులు అందిస్తూ తాను చనిపోయేదాకా విశిష్ట సేవలు అందించారు సోహన్ సింగ్.
ఈ ఆచరణలో భాగంగానే ‘ధర్మకిరణ్ హోమియో రీసెర్చి ఫౌండేషన్’ను, అదే పేరిట హోమియో వైద్యశాలను, ఆదర్శ హోమియో ఫార్మసీ, కళాశాలలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి హోమియో రీసెర్చి కేంద్రం ఏర్పా టుకు తన చొరవతో పథకం రచించగా దాన్ని కేంద్రం గుర్తించింది. పెక్కు శారీరక రుగ్మతలకు శాశ్వత పరిష్కా రాలు చూపిన ఘనాపాఠి సోహన్ సింగ్. ఎన్నో కుటుంబాలకు, స్కూళ్లకు 1999 నుంచి 2022 దాకా హోమియో మందుల ‘కిట్స్’ను అందించుతూ వచ్చారు. వైద్య సదుపాయాలు అందక పెక్కు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించారు.
పెక్కు దేశీయ, రాష్ట్రీయ కేంద్రా లలోని వైద్య శాఖల సమన్వయ కర్తగా అమూల్యమైన సేవలందించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ హోమియో మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు దాదాపు 26 సంవత్సరాలుగా సలహాదారుగా ఉన్నారు. హోమియో రీసెర్చి ఫౌండేషన్ ఫార్మా యూనిట్ ఆధ్వర్యంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే మందుల స్థానే దేశీయ నాణ్యమైన హోమియో మందుల ఉత్పత్తికి కృషి చేశారు. దేశీయ వృక్ష జాతుల నుంచి లభించే ముడి సరుకు ఆధారంగా హోమియో టించర్లను, టిష్యూ సాల్ట్స్‌ను ఉత్పత్తి చేయించారు.
‘‘సోహన్ సింగ్ కర్మయోగి, పని.. పని.. పని... తప్ప మరో ధ్యేయం, యావ లేని వైద్యుడు. కొందరు రోజుకు 24 గంటలేనా అని బాధపడతారు, కొందరు జీవితాలకు లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. అతి కొద్దిమంది మాత్రమే నెలలకు, సంవత్సరాలకూ కూడా లక్ష్యాలు పెట్టుకుంటారు. ఒకటి పూర్తవగానే ఇంకొకటి, అలా లక్ష్యాలను వెంటాడుతూనే ఉంటారు. పనే ప్రాణం, లేకపోతే వారికి ఊపిరాడదు! ఆ లక్ష్యాల నుండి ఎడబాటుండదు, తడబాటుండదు. వారికి వయస్సు విరోధి కాదు, రోగాలను గురించి తలచుకునే సమయం ఉండదు.
వారెవరో కాదు, మన సోహన్ సింగ్. భారత హోమియోపతి వైద్యంలో సోహన్ సింగ్ చూడని లోతులూ లేవు, ఎక్కని ఎత్తులూ లేవు... తెల్లవారు జామున సుదూర ప్రయాణాలు చేసి ఆయన ఇచ్చే తెల్లపంచదార మాత్రల కోసం జనాలు చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఆయన ఇచ్చే మందులు తన వ్యవసాయ క్షేత్రంలో పెంచిన మూలికల నుంచే తీసుకుని తన సొంత ఫార్మసీలోనే తయారు చేసుకుంటారు.
అత్యుత్తమమైన వైద్య సేవలు అందించిన సోహన్ సింగ్ వైద్యనారాయణుడు, వైద్యులందరికీ ఆదర్శనీయులు’’ అని డాక్టర్ చెరుకూరి బాలచంద్రమోహన్, సతీమణి డాక్టర్ సత్యవతీ దేవిల అభిభాషణ. ‘ధర్మకిరణ్ హోమియో పరిశోధనా సంస్థ’ అధ్యక్షురాలు పి. నీలిమా సతీష్ మాటల్లో చెప్పాలంటే, ‘‘చెట్లను, మొక్కల్ని కాపాడుకోగల్గితే, అవి తిరిగి మనల్ని రక్షించి, పక్కవాటు రోగాలు రాకుండా కాపాడతాయి.’’
ఆరోగ్య ప్రదాయినిగా మన దేశంలో హోమియో వైద్య విధానాన్ని పెంచి పోషించి, ప్రజా బాహుళ్యం ఆరోగ్య భాగ్యానికి అనితర సాధ్యంగా దోహదకారి అయి, మనందరి ఆరోగ్య భావి భాగ్యోదయాల్ని కాంక్షిస్తూ శాశ్వతంగా సెలవు తీసుకున్న ప్రజా వైద్యుడు సోహన్ సింగ్‌కు ఇదే నివాళి!
abkprasad2006@yahoo.co.in (సుప్రసిద్ధ హోమియో వైద్యుడు డాక్టర్ సోహన్ సింగ్ సెప్టెంబర్ 24న మరణించారు.)
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment