బ్రహ్మపుత్ర ఉగ్రరూపం | Editorial On Brahmaputra River Floods | Sakshi
Sakshi News home page

బ్రహ్మపుత్ర ఉగ్రరూపం

Published Sat, Jul 20 2019 12:27 AM | Last Updated on Sat, Jul 20 2019 12:28 AM

Editorial On Brahmaputra River Floods - Sakshi

దేశంలో చాలా ప్రాంతాలు కరువుతో అల్లాడుతుంటే ఈశాన్య భారతంలోని అస్సాం వరదనీటిలో తేలియాడుతోంది. 33 జిల్లాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు వారంరోజులుగా ఇళ్లూ వాకిళ్లూ వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. 50మంది పౌరులు మరణించారు. వందలాది పశువులు, వన్యప్రాణులు వరద తాకిడికి చనిపోయాయి. భారీయెత్తున పంటలు, జనావాసాలు నాశనమయ్యాయి. ఒకపక్క ఈ నెల 31తో గడువు ముగిసిపోయే జాతీయ పౌర గుర్తింపు(ఎన్‌ఆర్‌సీ) గురించి అక్కడి జనం ఆదుర్దా పడుతుంటే పులి మీద పుట్రలా ఈ వరద సమస్య వారిని చుట్టుముట్టింది.

జనాభాలో 40లక్షలమందిని విదేశీయులుగా నిర్ధారించి నిర్బంధ శిబిరాలకు తరలించగా వారిలో అనేకులు ఈ వరదలు తెచ్చిన అంటువ్యాధుల బారినపడి తల్లడిల్లుతున్నారు. కొన్నిచోట్ల ప్రజలు ఇళ్లు వదిలి రావడానికి భయపడుతున్నారు. తమ గుర్తింపు పత్రాలతో పునరావాస కేంద్రాలకెళ్తే అక్కడ గల్లంతవుతాయన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. అవి పోగొట్టుకుంటే శాశ్వతంగా అస్సాం వదిలిపోవాల్సి వస్తుందన్నది వారి కలవరపాటుకు కారణం. ప్రపంచంలోని అయిదు పెద్ద నదుల్లో ఒకటిగా గుర్తింపు పొంది చైనా, భారత్, బంగ్లాదేశ్, భూటాన్‌ దేశాల మీదుగా ప్రవహించే బ్రహ్మపుత్ర సాధారణ సమయాల్లో ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వర్షాకాలం వచ్చేసరికి దాని ఉగ్రరూపం బయటపడుతుంది. ఏటా జూన్‌–అక్టోబర్‌ నెలల మధ్య ఒకసారి కాదు... మూడుసార్లు అస్సాంను అది ముంచెత్తుతుంది. ప్రతిసారీ విలయం సృష్టిస్తుంది.

దేశంలో వేరేచోట్ల వరదలు ముంచెత్తినప్పుడు మీడియాతోసహా అందరూ వాటి గురించే చర్చిస్తారని, ఈశాన్య ప్రాంతంలో ఏం జరిగినా ఎవరికీ పట్టదని మొదటినుంచీ విమర్శలున్నాయి. ఇప్పుడు అస్సాంను ముంచెత్తిన వరదల సందర్భంలోనూ అది బాహాటంగా బయటపడుతోంది. జనం పట్టించుకున్న సమస్యల విషయంలో వెంటనే కాకపోయినా ఆలస్యంగానైనా ఏదోమేరకు చర్యలుంటాయి. కానీ ఎవరికీ పట్టనప్పుడు ఏమవుతుందో చూడాలంటే అస్సాం వర్తమాన పరిస్థితులను గమనించాలి. టిబెట్‌ ప్రాంతంలోని కైలాస శిఖరాల్లో పుట్టి ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రాంతంలో ప్రవహించాక అస్సాంలోనే అది మైదాన ప్రాంతంలోకి అడుగుపెడుతుంది. పెను వేగంతో ప్రవహించే నదులన్నీ ఒండ్రుమట్టినీ, బురదనూ వెంటేసుకురావడం సర్వసాధారణం. కానీ బ్రహ్మపుత్ర మోసుకొచ్చే బురద నీరు, ఒండ్రుమట్టి పరిమాణం అసాధారణమైనది. అదంతా ఎక్కడిక్కడ మేట వేయడం వల్ల క్రమేపీ పూడిక పెరిగిపోయి ఆ నదికి, దాని కాల్వలకూ ఉండే గట్లు తెగిపడతాయి. ఆ ప్రాంతంలో తరచు వచ్చే భూకంపాల వల్ల కొండ చరియలు విరిగిపడి నదీ ప్రవాహానికి అడ్డంకులేర్పడతాయి.

ఈ కారణాలన్నిటివల్లా నదీ గమనమే మారుతుంటుంది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రహ్మపుత్రలో నౌకల రాకపోకలు సాగేవంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి దానికి భిన్నం. బ్రహ్మపుత్ర వల్ల భూమి కోతకు గురై 1954 తర్వాత 3,800 చదరపు కిలోమీటర్ల వ్యవసాయ క్షేత్రం నాశనమైందని నాలుగేళ్లక్రితం అస్సాం ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక తెలిపింది. కరకట్టల నిర్మాణంతో ఈ వరదలను ఎంతో కొంత నివారించాలని, నష్టాన్ని పరిమితం చేయాలని అడపాదడపా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే అది శాశ్వత పరిష్కారం కాదు. ఆ కరకట్టల పరిస్థితి ఎలా ఉందో, ఎక్కడెక్కడ గండ్లు పడే ప్రమాదం ఉందో సకాలంలో గుర్తించి సరిచేస్తేనే అవి నిలబడతాయి. గతంలో నిర్మించిన చాలా కరకట్టల స్థితిగతుల్ని సరిగా పట్టించుకోక పోవడం వల్లనే ఇంత నష్టం వాటిల్లిందని నిపుణులు చెబుతున్నారు. అడవులు విచ్చలవిడిగా నరకడం, కొండలు పిండి చేయడం, చిత్తడి నేలలు పూడ్చడం వంటి చర్యల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయంటున్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ ప్రమాదకర పోకడల్ని అరికట్టే ప్రయత్నాలుండటం లేదు. బ్రహ్మపుత్ర నదిలో పూడిక తీసే పనులు భారీయెత్తున కొనసాగించి, దాన్నంతటినీ నదికి ఇరువైపులా గట్ల నిర్మాణానికి వినియోగిస్తామని అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్‌ సోనోవాల్‌ రెండేళ్లక్రితం చెప్పారు. కానీ అందువల్ల కాస్తయినా ప్రయోజం చేకూరదు సరిగదా... భారీ వ్యయమవుతుందని నిపుణులు హెచ్చరించారు. ఏటా కోట్లాది రూపాయలు అందుకోసం వెచ్చించినా బ్రహ్మపుత్రలో పూడిక పెరగడాన్ని నిలువరించడం అసాధ్యమని వారి వాదన. 

నదిపై ఆనకట్టలు నిర్మిస్తే రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వ చేయొచ్చునని మూడు దశాబ్దాలక్రితం కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలోని బ్రహ్మపుత్ర బోర్డు భావించింది. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా రూపకల్పన చేస్తే అటు జలవిద్యుత్‌ ఉత్పత్తికి సైతం దోహదపడుతుందని అంచనా వేసింది. ఆ ప్రాజెక్టు పనులు మొదలైన కొన్నాళ్లకే అరుణాచల్‌ ప్రదేశ్‌ అభ్యంతరాలు లేవనెత్తడంతో విరమించుకుంది. తమ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో సహా విస్తారమైన ప్రాంతం దీనివల్ల ముంపునకు గురవుతుందని అరుణాచల్‌ వాదించింది. ప్రాజెక్టుల నిర్మాణం సరికాదనే పర్యావరణవేత్తల అభ్యంతరాల సంగతలా ఉంచి బ్రహ్మపుత్ర వంటి అతి పెద్ద నది భారీమొత్తంలో తీసుకొచ్చే ఒండ్రుమట్టి, బురదనీరు ఆ ప్రాజెక్టును దీర్ఘకాలం మన్నికగా ఉండనీయడం కూడా కష్టం. అందుకే సమస్య మూలం ఎక్కడుందో గమనించాలి. బ్రహ్మపుత్ర వరదల్ని అరికట్టడానికి మనం ఒక్కరం వ్యూహాలు పన్నడం వల్ల ప్రయోజనం లేదు. మనతోపాటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌వంటి నదీ పరివాహ ప్రాంత దేశాలన్నీ సమష్టిగా ఆలోచించి, పరస్పర సహకరించుకుంటేనే వరదల్ని ఏదో మేరకు అరికట్టడం సాధ్యమవుతుంది. ఈలోగా తీసుకునే చర్యలన్నీ తాత్కాలిక ఉప శమనం ఇస్తాయే తప్ప శాశ్వత పరిష్కారానికి తోడ్పడవు. మన వంతుగా చేయాల్సిందల్లా పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడం. అది చేయనంతకాలమూ ఈ వరదల బెడద తప్పదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement