ఎట్టకేలకు మరణదండన | Editorial About Nirbhaya Convicts Gets Hanging | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు మరణదండన

Published Fri, Mar 20 2020 12:30 AM | Last Updated on Thu, Apr 14 2022 1:13 PM

Editorial About Nirbhaya Convicts Gets Hanging - Sakshi

ఉరి తాడు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో శుక్రవారం ఉదయం నిర్భయ దోషులు నలుగురికీ మరణదండన అమలు కావడం ఖాయమైంది. మన దేశంలో న్యాయ ప్రక్రియ ఎంత సుదీర్ఘమైనదో, ఉరిశిక్ష పడినవారికి సైతం చట్టపరంగా ఎన్ని రకాల అవకాశాలుంటాయో ఈ కేసు మరోసారి నిరూపించింది. తమ కుమార్తెను అమానుషమైన చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారం జరిపి హతమార్చిన దుండగులకు శిక్ష విధించడంలో ఎంతో జాప్యం చోటుచేసుకుందనుకుంటే... అది అమలు చేయడంలోనూ ఇంత తాత్సారమేమిటని నిర్భయ తల్లి అనేకసార్లు కన్నీరుమున్నీరయ్యారు. వారందరూ ఉరికంబం ఎక్కినరోజునే తమ కుమార్తె ఆత్మ శాంతిస్తుందని ఆమె చెప్పారు.

అయితే ఉరిశిక్ష పడిన నేరస్తులకు అన్ని రకాల అవకాశాలూ ముగిశాకనే శిక్ష విధించడం మనకున్న చట్టాల ప్రకారం తప్పనిసరి. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదుగానీ... ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడరాదన్నదే ఈ న్యాయ సిద్ధాంతంలోనిఅంతరార్థం. ఒకసారి ఉరిశిక్ష అమలయ్యాక దోషులుగా తేలినవారు ఏ కారణం చేతనో నిర్దోషులని తేలినా... వారి అభ్యర్థనల్ని పరిశీలించడంలో సాంకేతిక లోపాలు చోటుచేసుకున్నాయని తేలినా తప్పు సరిదిద్దుకోవడం అసాధ్యం కనుకనే ఇన్ని జాగ్రత్తలు. 

ఇందిరాగాంధీ హత్య కేసు, పార్లమెంటు దాడి కేసు, ముంబైపై ఉగ్రవాద దాడిలో పట్టుబడిన కసబ్‌ విషయంలోనూ ఉరిశిక్ష విధించడానికీ, దాన్ని అమలు చేయడానికీ మధ్య ఎంతో వ్యవధి ఉంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు ఆవేదన ఉంటుందన్నది నిజమే. తమవారికి ఏం జరిగిందో, దోషులకు కూడా తక్షణం అదే జరగాలని వారు పట్టుదలగా వుంటారు. నిర్భయ దోషుల విషయానికే వస్తే వారు అనుసరించిన విధానాలు, శిక్ష తప్పించుకునేందుకు వారు చూపిన సాకులు నిర్భయ కుటుంబీకులకు మాత్రమే కాదు... దేశ ప్రజలందరికీ ఆగ్రహం కలిగించాయి. ఇలా ఇంకెన్నాళ్లు కాలక్షేపం చేస్తారన్న ప్రశ్నలు తలెత్తాయి.

నిర్భయ కేసు విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయడంతోపాటు అత్యాచారం, ఇతర లైంగిక నేరాల్లో విధించాల్సిన శిక్షల గురించి, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ వర్మ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీ కూడా నియమించింది. జస్టిస్‌ వర్మ కమిటీ రికార్డు స్థాయిలో కేవలం 29 రోజుల్లోనే తన సిఫార్సులు అందించగా... ప్రభుత్వం కూడా చురుగ్గా కదిలి రెండు నెలల్లోనే అత్యాచార నేరానికి మరణ దండన విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే నిర్భయ కేసు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో చాలా త్వరగానే పూర్తయిందని చెప్పాలి.

2012 డిసెంబర్‌ 16న ఆ ఉదంతం జరగ్గా, నలుగురు దోషులకు 2013 సెప్టెంబర్‌లో మరణశిక్ష విధించింది. ఈ విచారణ కొనసాగుతుండగానే దుండగుల్లో ఒకడు ఆత్మహత్య చేసుకోగా, మరో దుండగుడి వయస్సు 16 ఏళ్లలోపు కావడం వల్ల అతడిపై జువెనైల్‌ కోర్టులో విచారణ జరిగి మూడేళ్ల శిక్ష పడింది. నలుగురు దోషులకూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విధించిన ఉరిశిక్షను ఆ మరుసటి ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ధ్రువీకరించింది. నిందితులు అప్పీల్‌ చేసుకోగా 2017 మే నెలలో ఈ నేరగాళ్లకు ఉరిశిక్ష సరైందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పటినుంచి రివ్యూ పిటిషన్లు మొదలయ్యాయి. నేరగాళ్లలో ఒకరి తర్వాత ఒకరు... ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు పిటిషన్లు దాఖలు చేయడం, వాటిని తిరస్కరించడం, రాష్ట్రపతికి క్షమాభిక్ష వినతులు, వాటిని తోసిపుచ్చాక దాన్ని సవాలు చేస్తూ తిరిగి ఢిల్లీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేయడం కొనసాగాయి. నేరం జరిగిన సమయానికి తాను జువెనైల్‌నని నేరగాడు పవన్‌ కుమార్‌ గుప్తా కింది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. తమను ఏకాంతవాస ఖైదు చేశారని, చిత్రహింసలకు గురిచేశారని, తమను ఉరి తీయాలంటూ కేంద్రమంత్రులు తదితరులు ప్రకటనలివ్వడం వల్ల ఆ ప్రభావం న్యాయస్థానాలపై పడిందని నేరగాళ్లు ఆరోపించారు. ఒక దోషి భార్య తాను వితంతువుగా బతకలేను గనుక అతగాడినుంచి విడాకులు ఇప్పించాలని కోరింది. ఈ సాకుతో శిక్ష అమలును జాప్యం చేయొచ్చునన్నది వారి ఎత్తుగడ. ఈలోగా ఉరిశిక్ష అమలుకు డెత్‌ వారెంట్లు జారీ కావడం, అవి వాయిదా పడటం రివాజైంది. 

ఈ కేసులో నేరగాళ్ల దుర్మార్గం సమాజం మొత్తాన్ని కలచివేసింది. కనుకనే ఈ ఉదంతంపై అంతగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వారికి సత్వరం ఉరిశిక్ష పడాలని అందరూ కోరుకున్నారు. ఈమధ్య కాలంలో అలాంటి నేరగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయాలన్న ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. ఏదైనా చట్టప్రకారమే జరగాలన్న విధానం నేరగాళ్లు శిక్ష పడకుండా  తప్పించుకోవడానికి తోడ్పడుతున్నదన్న అసంతృప్తే ఇందుకు కారణం. నేరానికీ, శిక్షకూ మధ్య ఉండే ఈ అపరిమిత జాప్యాన్ని ప్రభుత్వాలు అధిగమించగలిగితే నేరం చేయాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో పౌరుల్లో ఉండే అసంతృప్తి సమసిపోతుంది. నేర నివారణకు చర్యలు తీసుకుంటూనే, అవి జరిగినప్పుడు తక్షణం స్పందించి పకడ్బందీ దర్యాప్తు, విచారణ పూర్తికావడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయంలో ప్రశంసనీయమైన చర్య తీసుకుంది. లైంగిక నేరాల కేసుల్లో దుండగులను పట్టుకుని 21 రోజుల్లో శిక్షించడానికి వీలుగా దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దాంతోపాటు దిశ యాప్‌ను రూపొందించి విడుదల చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. నేరాలకు ఆస్కారంలేని పరిస్థితులు కల్పించడం, నేరం చేసినవారికి వెనువెంటనే శిక్ష తప్పదన్న అవగాహన కలిగించడం కీలకం. అప్పుడు మాత్రమే ఏ సమాజమైనా భద్రంగా మనుగడ సాగించగలుగుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement