తీహార్ జైల్లో ఈ సోమవారం ఉదయం నిశ్శబ్దంగా నాలుగు ఉరితీతలు జరిగిపోయాయి! డమ్మీ ఉరితీతలవి. వాటిని తీసిన తలారి పవన్ కుమార్. ఫిబ్రవరి 1న నలుగురు ‘నిర్భయ దోషుల్ని ఉరి తీయబోతున్నది అతడే. జనవరి 7న దోషులకు తొలిసారి డెత్ వారంట్ జారీ అయిన వెంటనే ఆయన తన స్వస్థలం అయిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి ఉరి సరంజామాతో పాటు ఢిల్లీ వచ్చేసి, అప్పట్నుంచీ తీహార్ జైల్లో ఉంటున్నాడు. పవన్‌కి ఉరితీసిన అనుభవం లేదు! ఆ వంశంలో మిగిలిన చిట్టచివరి తలారి కూడా అతడే.
పవన్ కుమార్ కనీసం ఒక ఉరినైనా తీయడం కోసం ఏడేళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నాడు. పవన్ తండ్రి మమ్మూసింగ్ చనిపోయే వరకు ఉత్తరప్రదేశ్ అధికారిక తలారిగా ఉండేవారు. ఆయన చనిపోయిన రెండేళ్లకు యు.పి. డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ ఆ హోదాను పవన్‌కి ఇచ్చింది. ఉరితీసే అవకాశాన్ని వృత్తిపరమైన మహద్భాగ్యంగా భావిస్తాడు పవన్. ఆ భాగ్యం అతడి జీవితంలో తొలిసారిగా 2014 కలగబోయి, ఆఖరి నిమిషంలో చేజారిపోయింది! ‘నిఠారి హత్యల’ నేరస్తుడు సురీందర్ కోలి ఉరి వాయిదా పడటంతో పవన్ చేతుల్లోంచి తప్పించుకున్నాడు. పవన్ తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు. ‘‘ఏడు రోజులుగా ఏర్పాట్లన్నీ చేసుకుని కూర్చున్నాను. ప్ఛ్.. తప్పించుకున్నాడు’’ అని బాధపడ్డాడు. అంతకన్నా అతడిని కలతకు గురిచేసిన విషయం.. తన కుటుంబంలోని పూర్వీకులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు.
అది కుదర్లేదు. పవన్ ముత్తాత లక్ష్మణ్ రామ్ బ్రిటిష్ పాలనలో వృత్తిరీత్యా అనేక మంది స్వాతంత్య్ర సమరయోధుల్ని ఉరితియ్యవలసి వచ్చింది. ఆ బాధ ఈ తలారుల వంశంలో అలా ఉండిపోయింది. పవన్ తాత కల్లూ, పవన్ తండ్రి మమ్మూ కూడా ఎవర్నైనా ఉరితీసిన ప్రతిసారీ బ్రిటిష్ కాలంలో తమ కుటుంబానికి అంటిన రక్తపు మరకల్ని కొంత కడిగేసుకున్నట్లుగా ఉపశమనం పొందేవారు. పవన్‌కే ఆ ఉపశమనం ఇప్పటికీ లభించలేదు.పవన్ తండ్రి మమ్మూ 26/11 దాడుల దోషి అజ్మల్ కసబ్‌ను, పార్లమెంటుపై దాడి జరిగిన కేసులో అఫ్జల్ గురును ఉరితీసి పాపాన్ని పూర్తిగా కడిగేసుకోవాలని ఆశపడ్డాడు కానీ, వారిని ఉరితీయడానికి ముందే 2011 మేలో ఆయన చనిపోయాడు. కసబ్‌ను 2012లో, అఫ్జల్ గురును 2013లో ఉరితీశారు. అప్పటికి తండ్రి ‘పోస్టు’ తనయుడికి రాలేదు కాబట్టి పవన్‌కి వారిని ఉరితీసే అవకాశం రాలేదు.
2014లో సురీందర్ కోలి మిస్ అయ్యాడు. 2015లో యాకూబ్ మెమన్ (’93 ముంబై పేలుళ్ల కేసు) ఉరితీత కూడా పవన్ వరకూ రాలేదు. రహస్యంగా ఒక జైలు కానిస్టేబుల్ చేత అతడిని ఉరితీయించారు. ఇప్పుడైనా నిర్భయ దోషుల్ని ఉరితియ్యడానికి పవన్‌నే ఢిల్లీ ప్రభుత్వం పిలిపించడానికి కారణం ఉంది. ప్రస్తుతం దేశంలో తలారులెవరూ లేరు. ఉత్తరప్రదేశ్‌లో పవన్ కాకుండా, అహ్మదుల్లా అనే తలారి ఒకరు లక్నోలో ఉన్నారు. అయితే వయసు మీద పడి, తీవ్రమైన అనారోగ్యంతో నేడో, రేపో అన్నట్లు ఉన్నారాయన. మైనర్ కాకుండా ఉండి, ఐదు అడుగుల, నాలుగు అంగుళాల ఎత్తు ఉన్నవారెవరైనా తలారిగా ఉండేందుకు అర్హులు. పవన్‌కి 54 ఏళ్లు.
‘‘ఇలాంటి వాళ్లను ఉరి తీయాల్సిందే. వదిలిపెడితే బయటికి వచ్చి మళ్లీ ఇలాంటివే చేస్తారు. వీళ్లను వదిలేశారు కదా అని మిగతావాళ్లూ బరితెగిస్తారు’’ అంటాడు పవన్.. నిర్భయ దోషుల గురించి. మీరట్‌లోని లోహియానగర్‌లో కాన్షీరామ్ అవాజ్ యోజన పథకం కింద కట్టిన గూళ్లలో ఒక గూటిలో ఉంటుంది పవన్ కుటుంబం. ఏడుగురు పిల్లలు. ఒక తోపుడు బండిలో బట్టలు పెట్టుకుని వీధుల్లో అమ్ముతుంటాడు పవన్. ‘‘నా పిల్లల్ని మాత్రం ఈ వృత్తిలోకి రానివ్వను. నాతోనే ఇది ఆఖరు అవ్వాలి’’ అంటాడు. అతడి తండ్రి మమ్మూ 47 ఏళ్ల పాటు ప్రభుత్వ తలారిగా పని చేశాడు. ఆ ఇంటికి వచ్చిందేమీ లేదు. ప్రభుత్వం ఇప్పటికీ ఇస్తున్న రూ.3,000 ఉపకారవేతనం తప్ప.
పూర్వపు తలారులు
జనార్ధన్ పిళ్లై
1940లలో ట్రావన్‌కూర్ (ఇప్పటి కేరళ ప్రాంతం) రాజుగారి ఆస్థానంలో తలారి. పిళ్లై జీవితం మీద శశి వారియర్ ‘ది లాస్ట్ హ్యాంగ్‌మేన్’ అనే పుస్తకం రాశారు. పిళ్లై భావోద్వేగాలు లేని మనిషి. ఇలా ఉరి తీసి, అలా మిగతా పనుల్లో పడిపోయేవాడు. అతడి వృత్తి ధర్మమే అయినప్పటికీ.. నాటి సమాజం ఆయన్ని వెలివేసింది. మొత్తం 117 మందిని ఉరి తీశాడు పిళ్లై.
నాటా మల్లిక్
పశ్చిమబెంగాల్ ప్రభుత్వ తలారి. పద్నాలుగేళ్ల స్కూలు విద్యార్థినిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ధనుంజయ్ ఛటర్జీని కోల్‌కతాలోని అలీపూర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లో ఉరితీసింది ఇతడే. 2009లో చనిపోయాడు. ఉరితీసే ముందు బాగా తాగేవాడు. మనసు ‘అయ్యో పాపం’ అనుకుని లివర్‌ను సరిగా లాగలేదేమోనన్న భయంతో తాగేవాడట. ఉరితీసినందుకు అతడికి 150 రూపాయల నగదు, ఓల్డ్ మంక్ రమ్ము సీసా ఇచ్చేవారు. ఉరితీసిన వెంటనే సీసాలోంచి కొద్దిగా రమ్మును చేతుల్లోకి తీసుకుని ఉరి కొయ్యపై చల్లేవాడు. అలా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుందని అతడు నమ్మేవాడు. ఈ విషయాలన్నీ సునీల్ గుప్త అనే రచయిత ‘బ్లాక్ వారెంట్’ పుస్తకంలో రాశారు. మల్లిక్ తన జీవితకాలంలో మొత్తం 25 మందిని ఉరితీశాడు.
కల్లూ, ఫకీరా
కల్లూ.. పవన్ తాత. ఫకీరా వేరే ఇంకొక తలారి. ఒకరు అందుబాటులో లేకుంటే ఇంకొకర్ని పిలిపించేవారు. కల్లూ మీరట్ జైల్లో, ఫకీరా ఫరీద్‌కోట్ (పంజాబ్) జైల్లో పనిచేసేవారు. ఇందిరాగాంధీ హత్యకేసులో దోషులైన సత్వంత్ సింగ్, కేహార్‌సింగ్‌లను ఉరితీసింది వీళ్లే. వీళ్లిద్దరూ ఎంతమందిని ఉరి తీశారన్న దానిపై కచ్చితమైన వివరాల్లేవు.
మమ్మూసింగ్
మమ్మూసింగ్.. పవన్ తండ్రి. మమ్మూకి తన తండ్రి కల్లూ నుంచి ఈ విద్య అబ్బింది. ‘‘మా వాడు మంచి తలారి. అతడి సేవల్ని వినియోగించుకోండి’’ అని తీహార్, ఇంకా వేరే వేరే జైళ్ల అధికారులకు ఉత్తరాలు రాస్తుండేవాడు కల్లూ. అయితే మమ్మూ ప్రభుత్వ తలారి కాకపోవడంతో ఒక్కసారి కూడా తీహార్ జైల్లో ఉరితీసే అవకాశం రాలేదు. మీరట్ జైల్లో వచ్చింది. తన కెరీర్ మొత్తంలో 15 మందిని ఉరి తీశాడు మమ్మూ.
Comments
Please login to add a commentAdd a comment