న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ ఖరారైంది. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా కోర్టు హాలులో డెత్ వారెంట్‌ను చదివి వినిపించారు.
దోషులకు డెత్ వారెంట్లు జారీ చేయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు, ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫు లాయర్ దోషులు పెట్టుకున్న పిటిషన్లేవీ న్యాయస్థానాల్లో లేదా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. అలాగే వారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌లను సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిపారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించినప్పుడు క్షమాభిక్ష పిటిషన్లు ఏమైనా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయా తెలియజెప్పాలంటూ తీహార్ జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. అలాంటి పిటిషన్లు పెండింగ్‌లో ఏవీ లేవని తేలడంతో కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.
కోర్టు హాలులో భావోద్వేగ దృశ్యాలు...
డెత్ వారెంట్ ప్రకటించడానికి ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తల్లి కోర్టు హాల్లోకి ఏడుస్తూ రావడంతో కాసేపు కలకలం రేగింది. తన బిడ్డపై కరుణ చూపాలని న్యాయమూర్తిని ఆమె కోరింది. అయితే ఆమెను బయటకు పంపాలని ఆదేశించిన న్యాయమూర్తి... ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న నలుగురు దోషులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఆ సమయంలో మీడియా ప్రతినిధుల్ని కూడా అనుమతించలేదు. ఆ తర్వాత న్యాయమూర్తి డెత్ వారెంట్లను చదివి వినిపించారు. కోర్టు ఆదేశాలు తెలియగానే ముఖేష్ తల్లి కన్నీరు పెట్టుకుంది. నిర్భయ తల్లి దగ్గరకు వెళ్లి తన బిడ్డను క్షమించాలంటూ వేడుకుంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాము నిరుపేదలం కావడం వల్లే ఈ నేరంలో తన బిడ్డను ఇరికించారని ఆరోపించింది.
జైలు నంబర్–3లో ఉరి అమలు...
నిర్భయ దోషులకు కోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైలు గది నంబర్–3లో ఉరితీస్తామని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. డెత్ వారెంట్లు జారీ కాగానే అధికారులు ఈ ప్రకటన చేశారు. నలుగురు దోషుల్లో ముగ్గురు జైలు నెంబర్ 2లో, ఒకరు జైలు నెంబర్ 4లో ఉన్నట్లు తెలిపారు. ఉరి శిక్ష అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జైలుకు చెందిన తలారిని సంప్రదిస్తున్నట్లు చెప్పారు. దోషులందరినీ ఒకేసారి ఉరి తీస్తామన్నారు. ‘ఉరితీత రోజు వరకు దోషులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారో లేదో మా వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈలోగా వారి భద్రత గురించి కూడా మేం తగిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఉరి అమలులోగా దోషులను వారి కుటుంబ సభ్యులు కలిసి వెళ్లొచ్చు’ అని జైలు వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ కోర్టు తీర్పుపై పట్నాలో స్వీట్లు పంచి, హర్షం వ్యక్తం చేస్తున్న యువతులు
న్యాయం జరిగింది: నిర్భయ తల్లిదండ్రులు
న్యాయం కోసం నిర్భయ తల్లిదండ్రుల ఏడేళ్ల పోరాటానికి తెరపడింది. డెత్ వారెంట్లు జారీ కాగానే ఉద్వేగం పట్టలేక నిర్భయ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగిందన్నారు. తాజా తీర్పు చట్టంపై మహిళల నమ్మకాన్ని తిరిగి నిలబెడుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి పేర్కొన్నారు. 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి కదులుతున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి మరీ ఆరుగురు అత్యాచారం జరిపారు.
నిర్భయ, ఆమె స్నేహితుడిని ఇనుప రాడ్లతో చితకబాదారు. సింగపూర్ మౌంట్ ఎలిజెబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ డిసెంబర్ 29న కన్నుమూసింది. ఆరుగురిలో ఒకడైన ప్రధాన నిందితుడు రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్‌ను దోషిగా జువైనల్ బోర్డు తేల్చింది. అతడిని జువనైల్ హోమ్‌కు తరలించారు. ఈ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. మరోవైపు, ఆలస్యంగానైనా నిర్భయకు న్యాయం జరిగిందని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment