న్యూఢిల్లీ: ‘ఏడేళ్లుగా.. రక్తపు కన్నీరు కారుస్తూ న్యాయ పోరాటం చేశాను’ అని నిర్భయ తల్లి అన్నారు. తమ కూతురిని అత్యంత పాశవికంగా హతమార్చిన మృగాళ్లను ఎలా క్షమించగలనని.. వారికి శిక్ష పడాల్సిందేనంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ ఖరారైన విషయం తెలిసిందే. ఈ అమానుష ఘటనలో దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. అయితే డెత్ వారెంట్ ప్రకటనకు ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తల్లి కోర్టు హాల్లోకి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది. తన బిడ్డపై కరుణ చూపాలని న్యాయమూర్తిని ఆమె కోరింది. అనంతరం నిర్భయ తల్లి వద్దకు వెళ్లి తన కొడుకుపై దయ చూపాలని అభ్యర్థించింది. అయితే ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు.(సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా..)
ఈ విషయం గురించి నిర్భయ తల్లి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏడేళ్ల క్రితం మా కూతురిని కోల్పోయాం. రక్తపు మడుగులో మునిగిన తన శరీరాన్ని చూశా. తన శరీరంపై ఉన్న గాయాలు.. తనపై క్రూర మృగాలు దాడి చేశాయా అన్నట్లు ఉన్నాయి. ఆనాటి నుంచి నా కళ్ల నుంచి రక్తం కారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ... దయ చూపమని అర్థించడం నాపై ఎటువంటి ప్రభావం చూపదు. ఏడేళ్లుగా ఏడ్చీ ఏడ్చీ నేనొక బండరాయిలా మారాను. అత్యంత దారుణ పరిస్థితుల్లో నా కూతురు కొట్టుమిట్టాడటం కళ్లారా చూశాను. రోజూ చస్తూ.. బతుకుతున్నాను. అందుకే నాకు ఎలాంటి భావోద్వేగాలు ఉండవు’ అని తన మానసిక వేదన గురించి చెప్పుకొచ్చారు. (‘నా కూతురు బతికిలేదు.. చాలా సంతోషం’)
ఇక నిర్భయ తండ్రి మాట్లాడుతూ...తన కూతురి జీవితం నాశనం చేసి.. ఆమెను బలి తీసుకున్న మృగాళ్లపై ఎవరూ కనికరం చూపరని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను ఉరి తీయడం ద్వారా నేరగాళ్లకు చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరనే సందేశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. కూతురు లేని జీవితం తమకు నరకప్రాయమని.. బతికి ఉన్నంతకాలం ఈ విషాదం తమను వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. (నిర్భయ దోషులకు 22న ఉరి.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు)
కాగా 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి కదులుతున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి మరీ ఆరుగురు అత్యాచారం జరిపారు. నిర్భయ, ఆమె స్నేహితుడిని ఇనుప రాడ్లతో చితకబాదారు. సింగపూర్ మౌంట్ ఎలిజెబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ డిసెంబర్ 29న కన్నుమూసింది. ఆరుగురిలో ఒకడైన ప్రధాన నిందితుడు రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్‌ను దోషిగా జువైనల్ బోర్డు తేల్చింది. అతడిని జువనైల్ హోమ్‌కు తరలించారు. ఈ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించింది.
దోషులు వీరే..
ముఖేష్ సింగ్: తీహార్ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తమ్ముడే ముఖేష్ సింగ్ (32). దక్షిణ ఢిల్లీలోని రవిదాస్ మురికివాడల్లో సోదరుడితో కలసి నివసించేవాడు అప్పుడప్పుడు తానే ఆ బస్సుని నడిపించేవాడు. క్లీనర్‌గా చేసేవాడు. ఘటన రోజు ముఖేశ్ బస్సు నడిపాడు. అత్యాచారం చేశాక నిర్భయ, ఆమె స్నేహితుడిని ఐరన్ రాడ్‌తో చితకబాదాడని ముఖేష్‌పై అభియోగాలు నమోదయ్యాయి.
వినయ్ శర్మ: వినయ్‌శర్మ (26) కూడా రవిదాస్ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిటినెస్ ట్రైనర్. ఒక జిమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు.
అక్షయ్ కుమార్ ఠాకూర్: అక్షయ్ ఠాకూర్ (31) బిహార్ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్‌గా ఉన్నాడు. స్కూల్ డ్రాపవుట్ అయిన అక్షయ్ 2011లో బిహార్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన ఐదు రోజుల తర్వాత అక్షయ్‌ని బిహార్‌లో అరెస్ట్ చేశారు.
పవన్ గుప్తా: పవన్ గుప్తా (25) పండ్ల వ్యాపారి. డిసెంబర్ 16 మధ్యాహ్నం మద్యం సేవించి బయటకు వెళ్లాడు. అరెస్ట్ చేసిన తర్వాత పవన్ తాను చాలా దుర్మార్గానికి పాల్పడ్డానని, తనకి ఉరి శిక్షే సరైనదని కోర్టులో చెప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment