పుష్కర కాలం నుంచి నష్టాలే తప్ప ఏ సంవత్సరమూ లాభాల మాటెరగని ఎయిరిండియాను ఇక వదుల్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ సంస్థలో తనకున్న వాటా మొత్తాన్ని ఉప సంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం తెలియజేసింది. వాస్తవానికి రెండేళ్లక్రితం కూడా ఎయిరిండియా సంస్థలో తన వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించుకుంది. అయితే అందులో 76 శాతం వాటాను మాత్రమే విక్రయిస్తానని ప్రకటించింది. అయితే అదంత లాభసాటి కాదన్న కారణంతో ఎవరూ ముందుకు రాలేదు. అందుకే కావొచ్చు... ఈసారి మొత్తం వాటా విక్ర యానికి సిద్ధపడింది. ప్రస్తుతం ఎయిరిండియా రుణ భారం రూ. 60,000 కోట్లు మించింది. దానికి ఏటా నష్టాలే వస్తున్నాయి. 2018–19లో అది రూ. 8,556.35 కోట్లు నష్టపోయింది.
అంతకు ముందు సంవత్సరం దాని నికర నష్టం రూ. 5,348.18 కోట్లు. గత దశాబ్దకాలంలో ఎయిరిండియా కొచ్చిన నష్టాలు లెక్కేస్తే ఆ మొత్తం రూ. 69,575.64 కోట్లని గత నెలలో కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి ప్రకటించారు. ఎయిరిండియా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనమ య్యాక 2007–08లో లాభాలొచ్చాయి. ఆ తర్వాత మరెప్పుడూ అది లాభాలు కళ్లజూడలేదు. ఒక పక్క దేశంలో ఆర్థిక మందగమనం, మరోపక్క మొన్న అక్టోబర్‌లో ప్రకటించిన కార్పొరేట్ పన్ను రాయితీ వగైరాలతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితుల్లో నష్టజాతక ఎయిరిండియా భారం మోయడం అసాధ్యమన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్టు కనబడుతోంది. ఎయిరిండియాకు వివిధ అనుబంధ సంస్థలున్నాయి. వాటిల్లో కొన్నిటిని ఈ అమ్మకం నుంచి మిన హాయించారు. ఇప్పుడున్న రూ. 60,000 కోట్ల అప్పులో సంస్థను కొనుగోలు చేసేవారు రూ. 23,287 కోట్ల మొత్తాన్ని భరించాల్సివుంటుంది.
మూడేళ్లక్రితం ఎయిరిండియా ఆర్థిక పునర్నిర్మాణ పథకంపై ఆడిట్ నివేదిక అందజేసింది. అందులో అది ఎయిరిండియా నిర్వహణ తీరును తప్పుబట్టింది. పథకంలో నిర్దేశించిన అనేకానేక లక్ష్యాలను అందుకోవడంలో అది ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించింది. 2016లో ప్రయా ణికుల ద్వారా లభించే ఆదాయాన్ని రూ. 21,297 కోట్లుగా అంచనా వేయగా, అందులో దాదాపు 20 శాతం తగ్గింది. వాస్తవ ఆదాయం రూ. 15,773 కోట్లు. తగినన్ని విమానాలు దాని వద్ద లేకపోవడం, మానవ వనరుల్ని వినియోగించుకోవడంలో విఫలం కావడం, ప్రయాణికుల రద్దీ వున్నచోట కాక వేరే మార్గాల్లో విమానాలు తిప్పడం వగైరాలు ఈ నష్టాలకు కారణమని అది తెలిపింది. తనకున్న ఆస్తుల్ని వినియోగించుకుని ఆదాయం పెంచుకోవడంలోనూ ఎయిరిండియా దారుణంగా విఫల మవుతున్నదని కాగ్ విమర్శించింది. దానికున్న 12 ఆస్తులను సరిగా వినియోగించుకుంటే రూ. 500 కోట్ల ఆదాయం వస్తుందని పునర్నిర్మాణ పథకంలో అంచనా వేస్తే అందుకోసం ఎయిరిండియా రూపొందించిన నిబంధనలు దానికి ఆటంకంగా మారాయన్నది కాగ్ అభియోగం.
డిమాండ్‌కు తగి నట్టుగా విమానాలను సమకూర్చుకోవడంలో సంస్థ విఫలమైందని, నిర్వహణ వ్యయాన్ని తగ్గించు కోవడానికి ఎ 320 రకం విమానాలను కొనుగోలు చేయాలని కన్సల్టెంట్ సూచించగా అందుకోసం గ్లోబల్ టెండర్లు పిలవడానికి మూడేళ్లు పట్టిందని ఎత్తిచూపింది. ప్రయాణికుల రద్దీ రీత్యాగానీ, నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి గానీ ఈ విమానాలు దోహదపడేవని, కానీ అలివిమాలిన జాప్యంతో సంస్థకు యధాప్రకారం నష్టాలు వచ్చాయని కాగ్ తేల్చిచెప్పింది. ఎమిరేట్స్‌కి, ఇతర గల్ఫ్ దేశాలకు పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎయిరిండియా తగిన సంఖ్యలో విమానాలు నడపలేకపోతుండగా, ఈ అవకాశాన్ని వినియోగించుకుని విదేశీ సంస్థలు దండిగా లాభాలు గడించ గలుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా, యూరప్ దేశాలకు నడిపే సర్వీ సులను విస్తరించడం, అందుకు తగినట్టుగా ప్రయాణికులను రాబట్టుకోలేకపోవడం వల్ల 2015– 16లో ఎయిరిండియా రూ. 2,323. 76 కోట్లు నష్టపోయింది. ముఖ్యంగా న్యూయార్క్ రూట్‌లో తిరిగే ఎయిరిండియా విమానాల్లో 77 శాతం ప్రయాణికులు మాత్రమే ఉంటున్నారని కాగ్ ఎత్తిచూ పింది. సిబ్బంది కూడా అవసరానికి మించి ఎక్కువున్నారని, అలాగే ఉన్న పైలెట్లు, కేబిన్ సిబ్బంది సేవలు వినియోగించుకోవడంలో తరచు వైఫల్యాలు ఎదురవుతున్నాయని కాగ్ ఎత్తిచూపింది. తొలిసారి 1953లో అప్పటివరకూ వున్న టాటా ఎయిర్‌లైన్స్‌ను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జాతీయం చేసి, దానికి ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు ప్రారంభమయ్యాక విమానయాన రంగంలో ప్రైవేటు సంస్థలను అనుమతించారు.
ఆ సమయంలో నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలనూ ప్రభుత్వం పూర్తిగా నిపుణులకు వది లేసివుంటే వేరుగా ఉండేది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. దాంతో సర్కారీ విధానాలకు లోబడి పనిచేయాల్సిన ఎయిరిండియా సహజంగానే ప్రైవేటు సంస్థల పోటీని తట్టుకోలేకపోయింది. నిజా నికి ఎంతో జాగ్రత్తగా వ్యాపారం చేయగలవనుకున్న ప్రైవేటు సంస్థలే విమానయాన రంగంలో తరచు బోల్తా పడుతున్నాయి. ఇంతవరకూ 13 ప్రైవేటు విమానయాన సంస్థలు మూతబడ్డాయి. ఎయిరిండియాను ఈసారైనా ఎవరో ఒకరు కొనుగోలు చేస్తే ఏమోగానీ... లేకపోతే అది కూడా మూతబడే పరిస్థితే వుంది. గతంలో దేశీయ సర్వీసులకు ఇండియన్ ఎయిర్‌లైన్స్, అంతర్జాతీయ సర్వీసులకు ఎయిరిండియా ఉండేవి.
రెండింటికీ నష్టాలొస్తున్న క్రమంలో విలీనం చేయడం ఉత్తమ మని 2007లో యూపీఏ ప్రభుత్వం భావించింది. నిజానికి అది ప్రమాదకరమని అప్పట్లో నిపుణులు హెచ్చరించారు. విలీనం చేసినప్పటినుంచీ రెండు సంస్థల్లో పనిచేసే సిబ్బందికి జీతభత్యాల్లో, విధి నిర్వహణ, పదోన్నతులు వగైరాల్లో ఉన్న వ్యత్యాసాలపై పేచీలు బయల్దేరాయి. అవి పలుమార్లు సమ్మెలకు దారితీశాయి. ఒక దిగ్గజ సంస్థగా వెలుగొందిన ఎయిరిండియా చివరకు పెను నష్టాలతో రెక్కలు తెగిన పక్షిలా మారడం విచారకరం.
Comments
Please login to add a commentAdd a comment