ప్రణయ్, అమృత (పాత చిత్రాలు)
‘ప్రేమిస్తే చంపేస్తారా!’ అంటూ ఒక యువతి చేసిన ఆర్తనాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... తెలుగువారున్న ప్రతి గడ్డపైనా ప్రతిధ్వనిస్తోంది. కొన్ని ఉదంతాలు మనం రోజూ చూస్తున్న సమాజంపై అపనమ్మకమూ, అవిశ్వాసమూ కలిగిస్తాయి. ఈ సమాజంలో ఇంత క్రౌర్యం, ఇంత రాక్షసం దాగున్నాయా అన్న దిగ్భ్రాంతిలో ముంచెత్తుతాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం పట్టపగలు చోటుచేసుకున్న దురంతం అటువంటిదే. ఒక్కగానొక్క కుమార్తెను ఎంతో అపురూపంగా చూసుకుని, ఆమె ఇష్టాయిష్టాలను అర్ధం చేసుకుని నెరవేర్చవలసిన కన్నతండ్రే కాలయముడిగా మారి ఆమె మనువాడినవాడిని మట్టుబెట్టిన ఉదంతమది. పట్టణంలో బాగా డబ్బు చేసిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు తన కుమార్తె అమృతవర్షిణితో ఆప్యాయత నటిస్తూనే అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకుడితో తుదముట్టించిన తీరు మానవత్వమున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. కంటతడి పెట్టించింది.
పుట్టుకనుబట్టి ఎవరిపైనా వివక్ష చూపరాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ మన సమాజంలో అడుగడుగునా అది తారసపడుతూనే ఉంటుంది. కులాంతర వివాహాలు జరిగే సందర్భాల్లో అది మరింత వెర్రితలలు వేస్తోంది. ముఖ్యంగా అట్టడుగు కులాలకు ప్రాణాంతకంగా మారుతోంది. ఇవి కులం పేరుతో, సంస్కృతి పేరుతో, వాటిని పరిరక్షించే సాకుతో సాగుతున్న హత్యలే అయినా వీటిని పరువు హత్యలనలేం. ఇవి ప్రపంచంలో మన సమాజం పరువు తీస్తున్న హత్యలు. వీటి మూలాలు నర నరానా ఆవరించిన కులోన్మాదంలో, ఆధిపత్య భావజాలంలో ఉన్నాయి. ఏటా వందలమంది బలవు తున్నా వీటిని నియంత్రించటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి.
2014–16 మధ్య ఈ మాదిరి హత్యలకు దేశంలో 356మంది ప్రాణాలు కోల్పోయారని మొన్న జూలైలో లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం చెప్పారు. ఈ జాబితాలోకి రాకుండా మరెం దరు బలయ్యారో ఊహించుకోవాల్సిందే. ఒకప్పుడు ఎక్కడో బిహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల్లో ఇవి జరిగాయని విన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయేవారు. వేరే కులానికి చెందినవాడిని పెళ్లాడిందన్న కక్షతో సొంత కూతుర్నే చంపుకుంటారా, అల్లుడిని హతమారు స్తారా అని విస్మయపడేవారు. ఇప్పుడు అవి అన్నిచోట్లా సాగుతూనే ఉన్నాయి.
కనుకనే ప్రణయ్, అమృతలు వివాహం చేసుకున్నాక తమను ఆశ్రయించినప్పుడు పోలీసులు ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సింది. నల్లగొండ జిల్లా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఇలా ప్రేమ జంటల్ని ఇబ్బందులపాలు చేసిన ఉదంతాలు, హతమార్చిన ఉదంతాలు ఉన్నాయి. నయీం గ్యాంగ్‌తో మారుతీరావు బెదిరించాడని, ఒక ఎమ్మెల్యే ఫోన్‌చేసి ఆమెను తిరిగి తండ్రి దగ్గరకు పంపిం చకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడని కుటుంబసభ్యులు చెబు తున్నారు. కౌన్సెలింగ్ పేరిట రప్పించి కొంతమంది పోలీసు అధికారులే వేరుపడమని సలహా ఇచ్చే వారని వారి ఆరోపణ. తమకెలాంటి ముప్పు పొంచి ఉందో ప్రణయ్, అమృత జంటకు తెలుసు. దీనిపై తమ మధ్య ఎలాంటి సంభాషణ జరిగేదో అమృత వేర్వేరు చానెళ్లతో మాట్లాడిన సందర్భంలో వివరించింది. ఆఖరికి ఇక్క డినుంచి దూరంగా వెళ్లిపోవాలని కొందరు సలహా ఇచ్చినా అందువల్ల తమ కుటుంబసభ్యులు బలి కావాల్సి వస్తుందేమోనన్న భయంతో ప్రణయ్ దానికి అంగీకరించలేదని కూడా తెలిపింది.
బహుశా ఈ విషయాలన్నీ వారు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చే ఉంటారు. వారు చెప్పకపో యినా నిరంతరం శాంతిభద్రతల వ్యవహారాల్లో తలమునకలయ్యేవారిగా ఆ అధికారులకు అర్ధమై ఉండాలి. వారికి వ్యక్తిగత భద్రత కల్పించాలి. కానీ ఆ పని జరగలేదు. పర్యవసానంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ జంట నిర్మించుకున్న అందమైన గూడు కూలిపోయింది. కొన్నేళ్లక్రితం సుప్రీంకోర్టే ఈ మాదిరి హత్యల విషయంలో కఠినంగా వ్యవహరించి, దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని తెలిపింది. కానీ పట్టించు కున్నవారేరి?
అమృతవర్షిణి మాటలు ఆమె పరిణతిని పట్టిచూపుతున్నాయి. తోటి మనిషిని కుల చట్రంలో తప్ప చూడలేనివారు మనుషులెలా అవుతారని ప్రశ్నిస్తోంది. కోట్ల రూపాయల ఆస్తుల కన్నా మాన వీయ విలువలు ముఖ్యం కదా అంటున్నది. మెట్టినింటే ఉండి ప్రణయ్ ఆశయమైన కుల నిర్మూలనకు పాటు పడతానని ఆమె చెబుతోంది. రెండేళ్లక్రితం తమిళనాడులో సంచలనం రేపిన శంకర్ హత్యో దంతం ఈ సందర్భంలో ఎవరికైనా గుర్తుకురాకమానదు. తమిళనాడులోని ఉడుమల్‌పేట్ పట్టణంలో శంకర్‌ను తన తండ్రి కిరాయి ముఠాతో చంపించాక కౌసల్య అనే యువతి ఇదే తరహాలో పోరాడింది. ఆ హత్య కేసులో తండ్రితోసహా ఆరుగురికి మరణశిక్ష పడేలా చూడటమే కాదు... నిర్దోషిగా విడు దలైన తల్లికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని, ఆమెకు సైతం శిక్ష పడాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లింది. విచారణ సమయంలో ఒకటి రెండుసార్లు తండ్రికి పెరోల్ అవకాశం లభించినా గట్టిగా వ్యతి రేకించి అది అమలు కాకుండా అడ్డుకుంది. కూలి పనిచేసుకుని పొట్టపోసుకునే శంకర్ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ పెరియార్ రామస్వామి స్ఫూర్తితో కుల నిర్మూలన కోసం జరిగే ఉద్యమాల్లో పాలు పంచుకుంటోంది.
ఇప్పుడు ఈ హత్యోదంతాన్ని లోతుగా దర్యాప్తు చేస్తామని, దోషులను వదిలిపెట్టబోమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మారుతీరావు ఆస్తులు పోగేసుకున్న వైనంపైనా దర్యాప్తు ఉంటుందంటున్నారు. ప్రణయ్ హత్య జరిగేవరకూ అతని అక్రమాలు పోలీసు, రెవెన్యూ యంత్రాం గాల దృష్టికి రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చర్య సంగతలా ఉంచి ఆ అక్రమాల సంగతి తెలిసి ఉంటే ఆయనెంతకు తెగించగలడో పోలీసులకు అర్ధమయ్యేది. ప్రణయ్, అమృత జంట క్షేమంగా ఉండగలిగేది. కనీసం దీన్నయినా గుణపాఠంగా తీసుకుని, అప్రమత్తతతో వ్యవహరించి కులోన్మాదా నికి మరే ప్రేమ జంటా బలి కాకుండా చూడటం ప్రభుత్వం కర్తవ్యం.
Comments
Please login to add a commentAdd a comment