దేశ ఆర్థిక, వాణిజ్య రాజధానిగా, జనాభారీత్యా అతి పెద్ద మహా నగరంగా పేరు ప్రఖ్యాతులున్న ముంబై వానాకాలం వచ్చేసరికి చిగురుటాకులా వణుకుతుంది. భారీ వర్షాలతో వరద నీరు చేరి సాధారణ జనజీవనం అస్తవ్యస్థమవుతుంది. ఇంచుమించు ఇదే సమయంలో కాలం చెల్లిన భవనాలు కూలుతున్న ఘటనలు కూడా అడపాదడపా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో వందేళ్లనాటి నాలుగంతస్తుల భవంతి కూలి 13మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయాలపాలయ్యారు. ఈ నెల మొదట్లో వచ్చిన వర్షాలవల్ల వివిధ ప్రాంతాల్లో గోడలు కూలి 27మంది చనిపోయారు. ఇలా కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలు ఎక్కడెక్కడున్నాయో లెక్కేసే తనిఖీలు ఇంకా పూర్తికాలేదు.
ఈలోగా ఈ భవనం కూలిపోయింది. మన దేశంలో నగరాలు విస్తరిస్తున్నాయి. భారీ భవంతులు నిర్మాణమవుతున్నాయి. విశాలమైన రోడ్లు వేస్తున్నారు. ఫ్లైఓవర్లు వస్తున్నాయి. మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. కానీ ఇవన్నీ ప్రధాన మార్గాలకే పరిమితమవుతున్నాయి. ఏ నగరం లోపలికెళ్లి చూసినా ఇరుకు సందులు, మురికి కూపాలు, ఒక పద్ధతి లేకుండా ఉన్న రోడ్లు, ప్రమాదకరంగా వేలాడే కరెంటు తీగలు దర్శనమిస్తాయి. వీటి మధ్య నుంచే వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. సారాంశంలో మౌలిక సదుపాయాలన్నీ పరమ అధ్వాన్నంగా, అస్తవ్యస్థంగా ఉంటున్నాయి. ఇవన్నీ శతాబ్దం క్రితమో, అంతకన్నా ముందో జనాభాను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి. వీటితోపాటే కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలుంటాయి. వాటిల్లో పలు కుటుంబాలు నివసిస్తుంటాయి. ఈ దుస్థితి ఒక్క ముంబై నగరానికి మాత్రమే పరిమితమైనది కాదు. దేశంలో ప్రధాన నగరాలన్నిటి స్థితీ ఇలాగే ఉంటుంది.
ఇప్పుడు జరిగిన విషాద ఘటన వంటిదే 2017లో కూడా జరిగింది. అప్పుడు 33మంది మరణించారు. ఇలాంటి భవనాలు ఇంకా ఎక్కడెక్కడున్నాయో చూసి వాటిల్లో నివాసముండేవారిని ఖాళీ చేయించి కూల్చేస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకోసం పురాతన భవంతుల్ని నాలుగు కేటగిరీలుగా విభజించారు. పూర్తి ప్రమాదకరమైనవి, పాక్షికంగా ప్రమాదకరమైనవి, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టవలసినవి, చిన్న చిన్న మరమ్మతులు సరిపోతాయనుకున్నవి అంటూ ఒక జాబితా రూపొందించారు. ఆ జాబితాలో ఇప్పుడు కూలిన భవనం ప్రమాదకరమైన కేటగిరీలో ఉంది. కానీ ఏమైంది? మళ్లీ అదే విషాదఘటన పునరావృతమైంది. ఉదయం పూట భవనం కూలితే రాత్రికి కూడా శిథిలాల తొలగింపు పూర్తికాలేదు.
ఈ వ్యవధిలో కొన ఊపిరితో ఉన్న పలువురిని రక్షించారు. అసలు ఆ ప్రాంతానికి జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్‌డీ ఆర్‌ఎఫ్) వాహనాలు చేరుకోవడానికి కూడా వీలేని పరిస్థితులున్నాయి. ఇప్పుడు కూలిన భవనం లాంటివి ఆ నగరంలో 499 ఉన్నాయని ఒక సర్వే వెల్లడించింది. నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవంతులున్నాయని, వాటిల్లో చాలా భాగం ఇరుకిరుకు సందుల్లో ఉన్నాయని ప్రభుత్వానికి, బీఎంసీకి తెలుసు. ఏటా పడే భారీ వర్షాల వల్ల ఆ భవంతుల పునాదులు దెబ్బతింటున్నాయని తెలుసు. కానీ చర్యలు మాత్రం ఉండవు. కనీసం భవనాలు కూలినప్పుడు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక దళాన్ని సంసిద్ధంగా ఉంచడానికి అవసరమైన నిధులైనా అందుబాటులో ఉంచాలన్న స్పృహ ఎవరికీ లేదు. ఆ విభాగానికి గత మూడు నాలుగేళ్లుగా కేటాయింపులు 38 శాతం మేర తగ్గాయని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) గణాంకాలు చెబుతు న్నాయి. అలాగని ఆ సంస్థకు డబ్బుకేమీ లోటులేదు. ఆదాయంలో అది దేశంలోనే అగ్రగామి. ఎనిమిది లేన్ల రహదారి నిర్మాణానికి, నగరం చుట్టూ 32 కిలోమీటర్ల తీరప్రాంత రహదారి నిర్మాణానికి ఆ సంస్థ భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. మన పాలకుల తీరు ఇలా ఉంటున్నది.
ఆ మహానగరాన్ని ఏలడానికి బీఎంసీ ఉంటే, దాని పర్యవేక్షణలో వేర్వేరు సంస్థలు పని చేస్తున్నాయి. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంద’న్న చందంగా ఈ సంస్థల పరిధులు, అధికారాలు ఒక్కోసారి కలగలిసి గందరగోళంగా మారుతున్నాయి. ఈ సంస్థల బిల్డింగ్ కోడ్‌లు, నియమనిబంధనలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. ఏ ఒక్క సంస్థకూ దేనిపైనా సంపూర్ణాధికారాలు లేకపోవడంతో ఎవరికి వారు పట్టనట్టు ఉంటున్నారు. ఏదైనా అనుకోనిది జరిగితే బాధ్యతను ఎదుటివారిపైకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు కూలిన భవంతి మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంహెచ్‌ఏడీఏ) పరిధిలోనిదని బీఎంసీ చెబుతోంది. ఎంహెచ్‌ఏడీఏకు అనుబంధంగా ఉన్న ముంబై భవన మరమ్మతులు, పునర్నిర్మాణ బోర్డు(ఎంబీఆర్‌ఆర్)కు ఈ భవనం గురించి 2017 జూలైలో లేఖ రాశామంటున్నది. కానీ అందులో ఉన్నవారిని ఖాళీ చేయించాల్సిన బాధ్యత మా సంస్థదా, బీఎంసీదా అని ఎంహెచ్‌ఏడీఏ ఎదురు ప్రశ్నిస్తోంది. దాన్ని ఖాళీ చేయించి అప్పగిస్తే కూల్చివేసేవారమంటున్నది. దారుణమైన విషయమేమంటే ఈ భవనం 1986 వరకూ గ్రౌండ్ ఫ్లోర్‌తోనే ఉండేది. కానీ ఆ తర్వాత దానిపై మరో మూడంతస్తులు లేచాయి. పర్య వేక్షించాల్సిన సంస్థలన్నీ గాఢనిద్రపోవడం వల్లే ఇదంతా జరిగిందని స్పష్టంగానే అర్ధమవుతుంది.
మనకు జాతీయ భవన నిబంధనలు(ఎన్‌బీసీ) ఉన్నాయి. వాటి ప్రకారం పాత భవంతుల ప్రమాణాలెలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీలు జరగాలి. భద్రతను ధ్రువీకరించాలి. నివాసానికి అనువుగా లేనివాటి నుంచి కుటుంబాలను ఖాళీ చేయించాలి. కానీ ఆ నిబంధనలు కూడా ఎవరికీ పట్టడం లేదు. ముంబై ఘటనతో అన్ని ప్రభుత్వాలూ అప్రమత్తం కావాలి. ముఖ్యంగా ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు నిపుణుల కమిటీలు ఏర్పా టుచేసి ప్రమాదకర స్థితిలో ఉన్న భవంతుల ఆరా తీయాలి. ఎన్‌బీసీ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి. చూసీచూడనట్టు వదిలేసే అధికారుల పనిబట్టాలి. లేనట్టయితే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment