సర్వత్రా ‘ఢిల్లీ’ ఉత్కంఠ | Editorial On Delhi Elections | Sakshi
Sakshi News home page

సర్వత్రా ‘ఢిల్లీ’ ఉత్కంఠ

Published Thu, Feb 6 2020 12:09 AM | Last Updated on Thu, Feb 6 2020 12:09 AM

Editorial On Delhi Elections - Sakshi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు హోరాహోరీగా జరిగిన ప్రచారం గురువారం సాయంత్రంతో సమాప్త మవుతుంది. ప్రచారం మొదలైన కొన్ని రోజుల వరకూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వం సాధించిన విజయాలపైనా, దాని వైఫల్యాలపైనా సాగుతున్నట్టు కనబడిన చర్చంతా పది పన్నెండు రోజులుగా కొత్త మలుపు తిరిగింది. ఢిల్లీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, వాటిని తీర్చడానికి ఎదురవుతున్న అవరోధాలు, జవాబుదారీ తనం వగైరా అంశాలు ప్రస్తావనకొస్తుండగా దాన్ని తనకనుకూలమైన దోవకు మళ్లించడంలో బీజేపీ సఫలమైంది.

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో మహిళలు సాగిస్తున్న ఆందోళనపై కేంద్రీకరించి, జాతీయ భద్రతను ప్రధాన అంశంగా మార్చి మీరెటు వైపో తేల్చు కోవాలంటూ పౌరులకు బీజేపీ పిలుపునిచ్చింది. ప్రజలు స్థానిక అంశాలనూ, ఆప్‌ ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలను పరిగణనలోకి తీసుకుని ఓట్లేస్తారా లేక బీజేపీ కోరుకున్నట్టు జాతీయ భద్రతే ప్రధాన మనుకుంటారా అన్నది చూడాల్సివుంది. 8వ తేదీ సాయంత్రం పోలింగ్‌ ముగిశాక వెలువడే ఎగ్జిట్‌ పోల్స్‌ ఈసారి గాలి ఎటు వీచిందో చెప్పగలిగే అవకాశం వుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చెప్పినా 11న అసలు ఫలితాలు వెలువడే వరకూ ఉత్కంఠ తీరదు.

ఢిల్లీ పౌరులు ఏం ఆలోచిస్తున్నారో, చివరకు ఎటువైపు మొగ్గుతారో నిర్ణయించడం అంత సులభమేమీ కాదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అక్కడున్న ఏడు స్థానాలనూ కట్టబెట్టిన ప్రజలు, మరికొన్ని నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు భారీ ఆధిక్యతతో అధికారం అప్పగించి అందరి అంచనాలనూ తలకిందులు చేశారు. మొత్తం 70 స్థానాల్లో ఆప్‌కు 67 రాగా, మిగిలిన మూడు బీజేపీకి దక్కాయి. అప్పుడు ఆప్‌ నెగ్గుతుందని కానీ, నెగ్గినా ఈ స్థాయిలో సీట్లొస్తాయని గానీ ఏ సర్వే చెప్పలేకపోయింది. ఇంచుమించు ప్రతి సర్వే కూడా బీజేపీకి 40కి మించి స్థానాలొస్తాయని, ఆప్‌కి అంతక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్న 28 స్థానాలకు మించిరావని, ఇంకా తగ్గినా ఆశ్చర్యం లేదని చెప్పాయి.  ఈ లెక్కలన్నీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకొచ్చిన 46.40 శాతం ఓట్ల ఆధారంగా వేసినవే.

ఎనిమిది నెలలక్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ 2014నే పునరావృతం చేసింది. ఆ పార్టీకి అంతక్రితం కంటే మెరుగ్గా 56.58 శాతం ఓట్లు లభించాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ ఏడు చోట్లా ఓడిపోయినా 32.90శాతం ఓట్లు గెల్చుకుంది. కానీ మొన్న లోక్‌సభ ఎన్నికల్లో దానికి కేవలం 18 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఒక్కచోట అది రెండో స్థానంలోకి రాగలిగింది. మిగిలిన ఆరుచోట్లా రెండో స్థానం కాంగ్రెస్‌దే. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆ ఫలితాలను బేరీజు వేస్తే బీజేపీ 65 స్థానాల్లో ఆధిక్యత చూపగా, కాంగ్రెస్‌ అయిదు చోట్ల ఆధిక్యత తెచ్చుకుంది. ఆప్‌ సున్నా చుట్టింది. కానీ 2015 అసెంబ్లీ ఎన్నికల అనుభవం తర్వాత బీజేపీ భరోసాగా లేదు. ‘మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండ’న్న కేజ్రీవాల్‌ సవాలుకు బీజేపీ జవాబీ యలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై ఇలాగే చర్చ సాగింది. మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీని అప్పట్లో పార్టీలో చేర్చుకుని, ఆమెను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కానీ ఆ నిర్ణయం వికటించింది. అందువల్లే ఈసారి అలా ఎవరినీ ప్రకటించే సాహసం చేయలేదు.

 బీజేపీ ప్రచార బాధ్యతలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన భుజస్కంధాలపై వేసు కున్నారు. పలు సభల్లో ప్రసంగించడంతోపాటు, కొన్నిచోట్ల ఇంటింటి ప్రచారం చేశారు. ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలన్నిటిలోనూ జాతీయ భద్రత, 370 అధికరణ రద్దు తదితర అంశాలే విస్తృతంగా ప్రచారమయ్యాయి. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఢిల్లీలో మోహరించారు. దేశద్రోహుల్ని కాల్చిచంపాలంటూ కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సభల్లో నినా దాలు చేయించడం, మరో ఎంపీ షాహీన్‌బాగ్‌ ఆందోళనకారులు ఇళ్లల్లోకి చొరబడి అరాచకాలు సృష్టి స్తారంటూ ప్రకటించడం వివాదాస్పదమయ్యాయి. వేదికలపై ఇలా జాతీయ భద్రతను హోరె త్తించినా మేనిఫెస్టోను మాత్రం బీజేపీ స్థానిక అంశాలతో నింపింది. ఇంటింటికీ రక్షిత మంచినీరు, వలస కార్మికులు నివసించే కాలనీల అభివృద్ధి, ఆడపిల్ల పుడితే రూ. 2 లక్షల సాయం, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వంటి వాగ్దానాలు చేసింది.

బీజేపీ, ఆప్‌ కూడా పరస్పరం ప్రభావితమవుతున్నాయని రెండు పార్టీల మేనిఫెస్టోలు గమనిస్తే అర్థమవుతుంది. గత అయిదేళ్లలో కేజ్రీవాల్‌ అమలు చేసిన అంశాలు గమనంలోకి తీసుకుని బీజేపీ మేనిఫెస్టో రూపొందిస్తే... బీజేపీ లేవనెత్తుతున్న అంశాల విషయంలో ఆప్‌ అత్యంత జాగరూకతతో అడుగులేసింది. షాహీన్‌బాగ్‌పై మీ వైఖరేమిటన్న ప్రశ్నకు నేరుగా జవాబివ్వడానికి ఆప్‌ సిద్ధపడలేదు. పైగా మళ్లీ అధికారంలో కొచ్చాక పాఠశాలల్లో దేశభక్తిపై పాఠాలు పెడతామని వాగ్దానం చేసింది. పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణిస్తే రూ. కోటి ఇస్తామని చెప్పడం అందరి ప్రశంసలూ పొందింది.

20,000 లీటర్ల వరకూ ఉచితంగా నీరు, 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్, ప్రభుత్వ పాఠశాలల సమూల మార్పు, మొహల్లా క్లినిక్‌లు, మహిళలకు ఉచితంగా బస్‌ ప్రయాణం, కాలనీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు వంటివి కేజ్రీవాల్‌ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. కేంద్రం సృష్టించిన అవ రోధాలు అధిగమించి సుప్రీంకోర్టు తీర్పుతో ఏడాదిన్నరగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని కేజ్రీవాల్‌ చెప్పడాన్ని జనం సానుకూలంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ రంగంలోవున్నా దాన్నెవరూ పట్టించుకునే స్థితి లేదు. మొత్తానికి బీజేపీ ప్రచార హోరుతో ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో వెలువడే తీర్పుపై దేశమంతా ఉత్కంఠ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో విజయం మాటెలావున్నా, 2015 ఎన్నికల్లో కేజ్రీవాల్‌ సాధించిన మెజారిటీని మాత్రం పునరావృతం చేయనీయరాదన్న కృత నిశ్చయం బీజేపీలో కన బడింది. ఓటరు నాడి తెలిసేది మరికొన్ని రోజుల్లోనే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement