చరిత్రలో ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలకు మౌన సాక్షిగా వున్న సూయిజ్ కెనాల్ మరోసారి వార్తల్లో కెక్కింది. మంగళవారం వేకువజామున హఠాత్తుగా విరుచుకుపడిన ఇసుక తుపానులో సరుకులతో వెళ్తున్న భారీ నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుంది. గత రెండురోజులుగా ఆ నౌక అంగుళం కూడా అటూ ఇటూ కదులుతున్న జాడ లేదు. పర్యవసానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరువంటి మహా నగరాల్లో మనం తరచుగా చూసే నరకప్రాయమైన ట్రాఫిక్ జామ్‌లను తలదన్నే రీతిలో ఇప్పుడు సూయిజ్ కెనాల్ వుంది.
‘ఎవర్ గివెన్’ మొరాయించిన సమయానికి కెనాల్‌లో ప్రవేశించివున్న దాదాపు 200 నౌకలు చిక్కుకుపోయాయి. ఎర్ర సముద్రాన్నీ, మధ్యధరా సముద్రాన్ని అనుసంధానించి తూర్పు, పడమరలను ఏకం చేసి, ఖండాంతర వాణిజ్యంతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో వుండాలని కలగని 1859లో ఈ కాలువ నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. వాస్తవానికి ఇది అప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. ప్రాచీన ఈజిప్టు రాచరిక వ్యవస్థలు క్రీస్తుపూర్వమే దీన్ని కలగన్నాయి. నెపోలియన్ సైతం ఈ కెనాల్ నిర్మిస్తే బ్రిటన్‌ని దారికి తేవొచ్చని, దానిపై పైచేయి సాధించవచ్చని ఆలోచించాడు. కానీ చివరకు ఫ్రాన్స్ ఏలుబడిలోని ఈజిప్టుకే కాలం కలిసొచ్చింది.
ఒక ఫ్రాన్స్ దౌత్యవేత్త చొరవతో ఏర్పాటైన కంపెనీ 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన దాదాపు 194 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువను నిర్మించింది. దీనివల్ల కలిగే లాభాన్ని గుర్తించి బ్రిటన్ ఇందులో 40 శాతం వాటాను పోరుపెట్టి సాధించుకుంది. ప్రపంచంలో ఇంకా పనామా కెనాల్, వోల్గా డాన్ కెనాల్, గ్రాండ్ కెనాల్ వంటివి వున్నాయి. కానీ సూయిజ్ ప్రధాన సముద్ర మార్గాలను అనుసంధానించే మెరుగైన కెనాల్. పర్యావరణవేత్తలు కావొచ్చు, నౌకాయాన రంగ నిపుణులు కావొచ్చు... రాకాసి నౌకా నిర్మాణం జోలికిపోవద్దని చాన్నాళ్లుగా వేడుకుంటున్నారు. అనుకోని ప్రమాదాలు ఎదురైతే భారీ నౌకలతో చేటు తప్పదని ప్రాణ నష్టంతోపాటు సముద్ర జలాలు కాలుష్యమయమై పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతున్నారు.
కానీ పెద్ద మొత్తంలో సరుకు పంపిణీ చేయటానికి, భారీగా ఆదాయం రాబట్టడానికి భారీ నౌకలే మేలని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే వారి హెచ్చ రికలను ఎవరూ పట్టించుకుంటున్న దాఖలా లేదు. ఇప్పుడు ‘ఎవర్ గివెన్’ అడ్డం తిరిగిన వైనం వారి హితవచనాలను మరోసారి గుర్తుకుతెస్తోంది. 2,20,000 టన్నుల సరుకును మోసుకుపోగల సామర్థ్యం దానికుంది. అయితే ఆ నౌక పూర్తిగా కుంగిపోయే స్థితి ఏర్పడకపోవటం ఒక రకంగా అదృష్టమే. ప్రపంచ వాణిజ్యం గత రెండున్నర దశాబ్దాల్లో వందల రెట్లు విస్తరించింది. ఒకప్పుడు ఆహారం, సరుకులు, చమురు, ఖనిజాలు వంటివే ప్రధానంగా రవాణా కాగా, ఇంటర్నెట్ అందు బాటులోకి రావటంతో విశ్వవ్యాప్త వస్తు సేవలు విపరీతంగా పెరిగాయి.
విమానయానం ఎంత వేగంతో కూడినదైనా, విమానాల ద్వారా సరుకు రవాణా ఎంతగా విస్తరించినా వాణిజ్యంలో ఈనాటికీ 90 శాతం వాటా సముద్ర మార్గాలదే. ఇందులో సూయిజ్ కెనాల్ ద్వారా సాగే వాణిజ్యం దాదాపు 15 శాతం. పశ్చిమాసియా నుంచి యూరప్, అమెరికాలకు... రష్యా నుంచి ఆసియా దేశాలకు ముడి చమురు రవాణా సాగుతున్నదీ ఇటునుంచే. అందుకే ఈ దిగ్బంధం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా సరుకు పంపిణీలో అస్తవ్యస్థ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళన వుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాలను విడదీసే ఈ కెనాల్... యూరప్‌కు రాకపోకలు సాగించే నౌకలు దక్షిణ అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోంది.
అందువల్ల దాదాపు ఏడువేల కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. వారం రోజుల సమయాన్ని ఆదా చేస్తోంది. రోజూ సగటున 50 నౌకలకు వరకూ ప్రయాణించే సూయిజ్ కాల్వ ఈజిప్టు ఖజానాకు డాలర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం ఏటా దాదాపు 1,500 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. సూయిజ్ కెనాల్‌ను మరింత విస్తరించటానికి ఆ దేశం ఇప్పటికే పనులు ప్రారంభించింది. అదంతా మరో రెండేళ్లలో పూర్తయితే ఈజిప్టు ఆదాయం మూడింతలు పెరుగుతుంది.
అంతర్జాతీయ నావికా సంస్థ(ఐఎంఓ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం నౌకాయానం వల్ల ఏటా వాతావరణంలోకి వేయి మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. ఇది ప్రపంచ వార్షిక ఉద్గారాల్లో 3.1 శాతం. 2050నాటికి ఉద్గారాలను కనీసం 50 శాతం తగ్గించుకోవాలని ఐఎంఓ కోరుతోంది. భారీ నౌకల వల్ల పొంచివుండే ఇతరత్రా ప్రమాదాల సంగతలావుంచి వాటి ఇంధన సామర్థ్యం తక్కువని ఐఎంఓ చెబుతోంది. కనీసం కొత్త సాంకేతికతలను పెంచుకుని, మెరుగైన డిజైన్లతో నౌకల్ని నిర్మిస్తే, వాటి వేగాన్ని నియంత్రణలోవుంచితే కర్బన ఉద్గారాల బెడదను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది దాని సూచన.
నౌకల వేగాన్ని సగటున పదిశాతం తగ్గిస్తే కర్బన ఉద్గారాలను నియంత్రించటం వీలవుతుందని సూచిస్తోంది. నౌకల వేగంపై నిరంతరం నిఘా వుంచుతూ అవి ఎక్కడ సంచరిస్తున్నాయో, వాటి వేగం, దిశ ఎలావున్నాయో తెలుసుకునే సాంకే తికతలు అందుబాటులోకొచ్చాయి. వాటిని అమర్చుకోవటాన్ని తప్పనిసరి కూడా చేశారు. 150 ఏళ్లక్రితం అందుబాటులోకొచ్చి, ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించే సూయిజ్ కెనాల్‌లో చోటుచేసుకున్న తాజా ఉదంతం నౌకా యానంలో ఇమిడివుండే సమస్యలను మరోసారి అందరి దృష్టికీ తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment