ఒకే జెండర్‌కు చెందినవారు కలిసి సహజీవనం చేద్దామనుకోవడంలో తప్పేమీ లేదని క్యాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించి పెను సంచలనం రేపారు. అలాంటి లైంగిక భావనలున్నవారు కూడా దేవుని బిడ్డలే...వారిని దూరంగా విసిరికొట్టడం కానీ, బాధించడంగానీ సరైంది కాదని, వారి సహజీవనాన్ని కూడా వివాహంగా గుర్తించాలని ఒక డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు దేశదేశాల్లోని ప్రభుత్వాలను ఆలోచింపజేస్తాయి. వాస్తవానికి 2013లో పోప్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడే స్వలింగ సంపర్కులకు మద్దతుగా ఆయన ప్రకటన చేశారు. అయితే అలాంటివారి సహజీవనాన్ని చట్టబద్ధం చేయాలని గట్టిగా కోరడం ఇదే ప్రథమం. పోప్ తాజా ప్రకటన ఆధునిక కాలానికి అనుగుణంగా మతంలో సంస్కరణలు తీసుకురావాలని కోరుకుంటున్నవారికి బలాన్నిస్తుంది. అదే సమయంలో సంప్రదాయవాదులకు ఆగ్రహం తెప్పిస్తుంది.
ఎవరూ తమ వ్యక్తిగత లైంగిక భావనల కారణంగా బెదిరింపులూ, వేధింపులూ ఎదుర్కొనే పరిస్థితి వుండ కూడదు. అలాంటివారికి చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చినప్పుడు మాత్రమే వారు అందరిలా సమా జంలో ప్రశాంతంగా జీవించగలుగుతారు. కానీ మన దేశంతో సహా అనేక దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377లోని అసహజ నేరాల జాబితా స్వలింగ సంపర్కాన్ని నేరంగా చూస్తోంది. అందుకు యావజ్జీవ శిక్ష లేదా పదేళ్లవరకూ శిక్ష, జరిమానా విధించవచ్చునని ఆ సెక్షన్ చెబుతోంది. సుప్రీంకోర్టు సైతం ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధమైనదే నంటూ 2012లో తీర్పునిచ్చింది. అయితే 2018లో దాన్ని సవరించుకుంది. పరస్పర అంగీకారం వున్న స్వలింగసంపర్క సంబంధాలు నేరం కాదని తీర్పునిచ్చింది.
ప్రాణులను స్త్రీ, పురుషులుగా మాత్రమే ప్రకృతి ఎంపిక చేయనప్పుడు లైంగికత అంటే ఫలానా విధంగా మాత్రమే వుండాలని శాసించే హక్కు ఎవరికీ ఉండబోదని అమెరికన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ సి కిన్సే ఒక సందర్భంలో చెప్పాడు. మన రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛకూ, సమానత్వ భావనకూ, మైనారిటీల హక్కులకూ రక్షణ నిచ్చింది. కానీ భిన్న లైంగిక భావనలున్న స్వలింగ సంపర్కులను నేరస్తులుగా పరిగణించే చట్టం మాత్రం దశాబ్దాలపాటు యధావిధిగా కొనసాగింది. సున్నితంగా ఆలోచించే స్వభావమూ, సహాను భూతితో వ్యవహరించే గుణమూ న్యాయవ్యవస్థలో కొరవడితే రాజ్యాంగం ప్రవచించే ఉన్నతా దర్శాలు, వాగ్దానాలు ఉత్త మాటలుగా మిగిలిపోతాయి. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం నీడలో కూడా ప్రకృతి సహజమైన చర్యను నేరంగా పరిగణించే సెక్షన్ 377 ఏడు దశాబ్దాలు కొన సాగిందంటే అది మన న్యాయవ్యవస్థ వైఫల్యమనే చెప్పాలి. బ్రిటిష్ వలసవాదులు తమ దేశంలో అమలవుతున్న చట్టాన్ని 1861లో యధాతథంగా ఇక్కడ అమల్లోకి తెచ్చారు.
అయితే స్వలింగసంపర్కుల వివాహాన్ని గుర్తించడానికి అనువైన చట్ట నిబంధనలు ఇంకా ఏర్పడలేదు. తమని 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం కింద దంపతులుగా గుర్తించాలంటూ ఇటీవలే ఢిల్లీకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణులు కవితా అరోరా, అంకితా ఖన్నాలు హైకోర్టు తలుపులు తట్టారు. తాము దంపతులుగా సహజీవనం చేస్తున్నామని, అందరి కుటుంబాలకూ బంధువులు వచ్చిపోతున్నట్టే తమ వద్దకూ వస్తుంటారని, అలాంటపుడు తమ సహజీవనాన్ని వివాహంగా గుర్తించడంలో అభ్యంతరం దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీం కోర్టు ప్రకటించి రెండేళ్లవుతున్నా వివాహచట్టాల్లో అందుకు వీలు కల్పించే సహజీవనాన్ని పొందు పరచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాన్ని వివాహంగా ఎందుకు గుర్తించాలన్న సంశయం వచ్చినవారికి కవితా అరోరా, అంకితా ఖన్నా సవివరమైన జవాబిస్తున్నారు.
బ్యాంకులో ఉమ్మడి ఖాతా తెరవాలంటే వారిమధ్య చట్టబద్ధమైన సంబంధం వున్నట్టు రుజువుండాలి. ఇద్దరు మహిళలను దంపతులుగా, కుటుంబంగా గుర్తించడం అసాధ్యం కనుక అధికారికమైన అడ్రస్ ప్రూఫ్ వారి నివాసగృహానికి లభించడం లేదు. పాస్‌పోర్టు పొందాలన్నా అదే ఇబ్బంది. ఆ చిరునామాలో నివసిస్తున్న వారిలో ఒకరిని యజమానిగా, మరొకరిని అద్దెకుంటున్నవారిగా మాత్రమే పరిగణించ గలమని పోలీసుల వాదన. ఇక వారసత్వ హక్కులు వంటివి సరేసరి. పీఎఫ్, గ్రాట్యుటీ వంటివి పొందేటపుడు నామినీగా గుర్తించడం, వారితో వున్న సంబంధాన్ని తెలపడం కూడా అసాధ్యం. ఇలా చట్టపరమైన అవరోధాలు ఎన్నో వున్నాయి. వీరి తరహాలోనే మరో ఇద్దరు స్వలింగ సంపర్కులు తమ వివాహాన్ని హిందూ వివాహ చట్టం కింద గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం చేసిన వాదన వింతగా వుంది.
ఒకే జెండర్‌కు చెందినవారి మధ్య వివాహం భారతీయ విలువల ప్రకారం సమ్మతం కాదని, అది పవిత్రంగా పరిగణించడం సాధ్యపడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. మరి స్వలింగ సంపర్కం రాజ్యాంగబద్ధమైనదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం ఏం గౌరవిస్తున్నట్టు? ఇది మన దేశానికి పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. ప్రపంచ దేశాలన్నిటా ఇలాంటి పరిస్థితే వుంది. దాదాపు 30 దేశాల్లో మాత్రమే ఇంతవరకూ స్వలింగసంపర్కుల వివాహాన్ని గుర్తించే చట్టాలున్నాయి. చాలాచోట్ల ఈ వివాహాలను అనైతికతగా పరిగణించే ఛాందసవాదులదే పైచేయి. కొన్నిచోట్లయితే అది మరణశిక్షకు అర్హమైన నేరం! అందువల్లే పోప్ ఫ్రాన్సిస్ చేసిన ప్రకటన స్వలింగసంపర్కులకు కొత్త బలాన్నిచ్చింది. ఏ దేశానికైనా సామాజిక, సంప్రదాయిక కట్టుబాట్లుం టాయి. అయితే అవి రాజ్యాంగ నైతికతతో విభేదించినప్పుడు రాజ్యాంగం మాటే చెల్లుబాటు కావాలి. ప్రజాస్వామ్య రిపబ్లిక్‌లు ఏర్పడిన దేశాల్లో కూడా ఇంకా బూజుపట్టిన భావాలదే పైచేయి అవుతున్న వేళ పోప్ ప్రకటన అక్కడి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి.
Comments
Please login to add a commentAdd a comment