అబుధాబీ: ఇస్లాం గడ్డపై తొలిసారి పర్యటిస్తున్న క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ చారిత్రాత్మక కేథలిక్‌ల బహిరంగ సభలో పాల్గొన్నారు. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ సభకు సుమారు 1.70 లక్షల మంది కేథలిక్‌లు హాజరయ్యారు. ఓపెన్ టాప్ వాహనంలో వాటికన్ జెండాలను ఎగురవేస్తూ పోప్ స్టేడియంలోకి ప్రవేశించారు. స్టేడియంలో సుమారు 50 వేల మంది కేథలిక్‌లు ఉండగా.. స్టేడియం బయట ఏర్పాటుచేసిన పెద్ద పెద్ద స్క్రీన్ల ద్వారా పోప్ ప్రసంగాన్ని మరో 1.20 లక్షల మంది వీక్షించారు. సుమారు 4 వేల మంది ముస్లింలకు కూడా సభకు సంబంధించిన టికెట్లను విక్రయించినట్లు స్థానిక చర్చి అధికారులు తెలిపారు.
సభకు భారీగా హాజరైన వలస కార్మికులు, శరణార్థులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. ‘ఇంటిని విడిచిపెట్టి ఇంత దూరంలో జీవనం కొనసాగించడం చాలా కష్టతరమైంది. మిమ్మల్ని ప్రేమించే వారి ఆప్యాయతలను మీరు కోల్పోతున్నారు. అలాగే భవిష్యత్‌కు సంబంధించిన అనిశ్చితి కూడా మీలో నెలకొని ఉంటుంది. కానీ భగవంతుడు చాలా నమ్మదగినవాడు. తనను నమ్ముకున్న వాళ్లను ఎన్నటికీ విడిచిపెట్టడు’ అని పోప్ వలస కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. యూఏ ఈలో భారత్, ఫిలిప్పీన్స్‌కు చెందిన కేథలిక్ వలస కార్మికులు అధిక శాతంలో ఉన్నారు. దేశంలో సుమారు 10 లక్షల మంది కేథలిక్‌లు నివసిస్తున్నారు. అంటే యూఏఈలో ప్రతీ 10 మందిలో ఒకరు కేథలిక్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment