గతంతో పోలిస్తే కొంత మెరుగయ్యామని సంతోషించాలో... చాలా వెనకబడిన దేశాలతో పోల్చినా మరింతగా వెనకబడ్డామని బాధపడాలో తెలియని స్థితి. 117 దేశాల ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ)లో మన దేశం ఈసారి 94వ స్థానంలో వుంది. నిరుడు 102వ స్థానంలో వున్నాం గనుక ఇప్పుడున్న స్థితికి సంతోషించాలని కొందరు చెబుతున్నారు. కానీ ఆకలి సమస్య చాలా తీవ్రంగా వున్న దేశాల సరసనే ఇప్పటికీ మనం వున్నామని గుర్తుంచుకోవాలి. వివిధ అంశాల్లో ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం ఒక దేశం ఎలా వుందన్నదే ఈ ఆకలి సూచీకి ప్రాతిపదిక. అలా చూసుకుంటే నిరుడు మన స్కోరు 30.3 దగ్గరుంటే ఇప్పుడది 27.2కు దిగింది. అంటే ఎంతో కొంత మెరుగు పడ్డామని చెప్పుకోవాలి. కానీ ఆ స్కోరు తగ్గినంత మాత్రాన మనం ఆకలి సమస్య తీవ్రత పరిధి నుంచి బయటకు రాలేదు.
పౌష్టికాహారలోపం, అయిదేళ్లలోపు పిల్లలు తగిన ఎత్తు లేకపోవడం లేదా ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, అయిదేళ్లలోపు పిల్లల్లో సంభవించే మరణాలు వగైరా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా ఈ ఆకలిసూచీని రూపొందిస్తున్నారు. ఇది వెల్లడైనప్పుడల్లా రాజకీయ పార్టీల మధ్య వాగ్యుద్ధాలు, అధికారంలో వున్నవారిని విపక్షం విమర్శించడం... మీరుండగా ఏం చేశారని అధికార పక్షం ఎదురు ప్రశ్నించడం రివాజుగా మారింది. 2018లో 103వ స్థానంలో వున్న మనం నిరుడు 102కి, అక్కడినుంచి ఈ ఏడాది 94కు వచ్చామన్నది నిజమే. కానీ 2030 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ సాధించాలని ఐక్యరాజ్యసమితి 2015లో తీర్మానించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆకలి మంటల్ని ఆర్పడం ఒకటని మనం మర్చిపోకూడదు. ఇతర లక్ష్యాల మాటెలావున్నా ఆకలిని తరిమికొట్టడంలో మన పురోగతి మందకొడిగా వున్నదని ఏటా వెలువడుతున్న జీహెచ్‌ఐ నివేదికలు చాటుతున్నాయి. ఎంత మందకొడి అంటే... మన పొరుగునున్న బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్‌ల కన్నా కూడా మనం ఎంతో వెనకబడివున్నాం. అవి కూడా మనతోపాటు ఆకలి సమస్య తీవ్రంగా వున్న దేశాల వరసలోనే వున్నాయి. కానీ గతంతో పోలిస్తే వివిధ అంశాల్లో మెరుగయ్యాయి. మనమూ, సుడాన్ ఒకే స్థానంలో వున్నాం. కేవలం చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ దేశాలు మాత్రమే తాజా సూచీలో అన్నిటికన్నా ఉత్తమంగా నిలిచాయి.
ప్రపంచంలో ఒకపక్క శ్రీమంతుల జాబితా ఏటా పెరుగుతోంది. దానికి సమాంతరంగా, సమానంగా ఇటు ఆకలిమంటలు కూడా విస్తరిస్తున్నాయి. 2017లో దాదాపు 9 లక్షల కోట్ల డాలర్లున్న ప్రపంచ కుబేరుల సంపద ఇప్పుడు పదిన్నర లక్షల కోట్ల డాలర్లకు చేరువవుతోందని స్విట్జర్లాండ్‌లోని సంస్థలు లెక్క చెబుతున్నాయి. సంఖ్యాపరంగా చూసుకుంటే 2017లో 2,158మంది శ్రీమంతు లుంటే ఇప్పుడు ఆ సంఖ్య 2,189కి పెరిగింది. రంగాలవారీగా చూస్తే టెక్, హెల్త్‌కేర్, పారిశ్రామిక రంగాలు ఆ సంపదకు కారణమవుతున్నాయి. ఇప్పుడొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి పర్యవ సానంగా ఈ రంగాలే మున్ముందు కూడా కాసులు కురిపిస్తాయి. వారిని మరింత కుబేరుల్ని చేస్తాయి. ఇటీవలే వెలువడిన ప్రపంచ బ్యాంకు నివేదిక ఒక చేదు వార్తను మోసుకొచ్చింది. ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పేదరికంలోకి జారుకునేవారి సంఖ్య బాగా పెరుగుతుందని ప్రకటించింది. కొత్తగా 11 కోట్ల 50 లక్షలమంది దారిద్య్ర రేఖకు దిగువన చేరతారని ఆ నివేదిక అంచనా వేస్తోంది. ఇదిగాక ఆదాయం తీవ్రంగా పడిపోవడం, అప్పులబారిన పడటం పర్య వసానంగా ఇప్పటికే అమలవుతున్న అనేక కార్యక్రమాలకు ప్రభుత్వాలు కేటాయింపుల్ని తగ్గించక తప్పదు. కనుక ఆ పరిధిలో వుంటూ పేదరికాన్ని జయిస్తున్నవారు కూడా చేయూత లేక చిక్కుల్లో పడతారు. ఏతావాతా ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో ఇప్పుడున్న ర్యాంకులు వచ్చే ఏడాది ఆకలి సూచీనాటికి మరింత దారుణంగా పడిపోతాయనడంలో సందేహం లేదు. ప్రపంచంలో ఈ ఏడాది పేదరికం బాగా తగ్గి, అది 7.9 శాతానికి చేరుతుందని కరోనా వైరస్ పంజా విసరడానికి ముందు నిపుణులు లెక్కేశారు. కానీ సవరించిన అంచనాల ప్రకారం అది 9.4 శాతం వుంటుందని వారు అంచనా వేస్తున్నారు.
మన దేశంలో విధానాలకు కొదవలేదు. పథకాలు, వాటి పేర్లు కూడా ఘనంగా వుంటాయి. అమలుపరచడానికొచ్చేసరికి అంతా అస్తవ్యస్థమవుతోంది. కొన్ని అంశాల్లో దృష్టి కేంద్రీకరించి పనిచేయడం, ఫలితం సాధించడం సాధ్యమవుతున్నా... మరికొన్నిటిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కన బడుతోంది. అలాగే సాధిస్తున్న ప్రగతి అంతటా ఒకేవిధంగా వుండటంలేదు. కొన్ని రాష్ట్రాలు ఎప్పటికీ వెనకబడే వుంటున్నాయి. వాటి లోపాలు సరిదిద్దడంలో, పరుగులెత్తించడంలో తగిన పర్య వేక్షణ కొరవడుతోంది. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌వంటి అధిక జనాభావున్న పెద్ద రాష్ట్రాలు పనితీరును మెరుగుపరుచుకుంటే ప్రపంచ సూచీలో మన పరిస్థితిలో కాస్త పురోగతి కనబడే అవకాశం వుంటుంది. ఈ రాష్ట్రాల్లో పౌష్టికాహారలోపం తీవ్రత ఎక్కువుంది. దేశంలో పుట్టే ప్రతి అయి దుగురు శిశువుల్లోనూ ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. కనుక పౌష్టికాహార లోపాన్ని ఆ రాష్ట్రం సరిచేసుకోనట్టయితే అది మొత్తం మన ర్యాంకును ప్రభావితం చేస్తుంది. పిల్లలకు సురక్షితమైన, పుష్టికరమైన ఆహారం చవగ్గా అందించడం, మాతా శిశు సంరక్షణ పథకాలను బాగా అమలు చేస్తూ బిడ్డ కడుపులో పడినప్పటినుంచీ మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తల్లికి అందేలా చూడటం, పుట్టినప్పటినుంచి బిడ్డ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ పౌష్టికాహారం అందించడం వగైరాలు చేస్తేనే తక్కువ బరువుండటం, ఎత్తు తక్కువగా వుండటం, పసి వయసులోనే మృత్యువాత పడటం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే, అందుకు అనువుగా పథకాలు రూపకల్పనచేసి, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తేనే దేశం శక్తిమంతమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కదలాలి.
Comments
Please login to add a commentAdd a comment