రాష్ట్రాలకు చేయూత ఏది? | Editorial On Prime Minister Modi Video Conference | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలకు చేయూత ఏది?

Published Fri, Apr 3 2020 12:50 AM | Last Updated on Fri, Apr 3 2020 12:50 AM

Editorial On Prime Minister Modi Video Conference - Sakshi

కరోనాపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న సమరంలో మన దేశం కూడా పూర్తిగా నిమగ్నమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆ మహమ్మారిపై సమష్టిగా బహుముఖ పోరు కొనసాగిస్తున్నాయి. ఊహించనివిధంగా వచ్చిపడిన ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొనడానికి దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటిం చడం, వ్యాధిగ్రస్తుల్ని గుర్తించి, వారిని పరిశీలన కేంద్రాలకు తరలించడం, ఆసుపత్రుల్లో చికిత్స అందించడం, నిరుపేద వర్గాలకు రేషన్‌ అందించడం, నగదు సాయం చేయడం వగైరాలకు ప్రభు త్వాలన్నీ భారీ మొత్తం వ్యయం చేయాల్సివస్తోంది. అదే సమయంలో నిత్యావసరాలు, ఔషధాలు విక్రయించే దుకాణాలు తప్ప ఇతర వాణిజ్య కార్యకలాపాలన్నీ స్తంభించి ఖజానాలు బోసిపోతు న్నాయి. పలు ప్రభుత్వాలు సిబ్బంది జీతాల్లో తాత్కాలికంగా కోత విధించాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ ముగిశాక తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అటు ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే తీసుకున్న చర్యల్ని తెలియ జేయడంతోపాటు ఆర్థిక ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాగల వారాల్లో కరోనాపై మరింత తీవ్రంగా పోరాడవలసివుంటుందని ప్రధాని చెప్పడాన్ని గమనిస్తే రాష్ట్రాలు నిర్వ ర్తించాల్సిన కర్తవ్యాలు మున్ముందు చాలానే వుండొచ్చు. ఈ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి మాస్క్‌లు, వ్యక్తిగత పరిరక్షణ ఉపకరణాలు మొదలుకొని రోగులకు సిద్ధం చేయాల్సిన వెంటిలేటర్లు, ఔషధాల వరకూ ఎన్నో అందుబాటులోకి తీసుకురావాల్సివుంటుంది. వీటికితోడు ఈ పంట దిగుబడుల కాలంలో వాటిని కొనడానికి రాష్ట్రాలు భారీగా వెచ్చించాల్సివుంటుంది.

దేశంలో అన్ని రాష్ట్రాల ఆదాయ వనరులూ ఒకేలా లేవు. కొన్ని రాష్ట్రాలు పారిశ్రామికంగా, వాణి జ్యపరంగా ముందంజలో వుంటే మరికొన్ని ఎంతో వెనకబడి వున్నాయి. ఆరేళ్లక్రితం విభజన అనం తరం ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌ అప్పటినుంచీ ఆర్థిక ఇబ్బందుల్లో వుంది. ఆ సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేసి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని విపక్ష నేతగా ఉన్నప్పటినుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనేవున్నారు. గతంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా వదులుకుని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. దానివల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. పైగా ఆయన పాలన రెండున్నర లక్షల కోట్ల అప్పులు మిగిల్చింది. ఇలాంటి అననుకూల వాతావరణంలో వచ్చిపడిన కరోనా సంక్షోభం వల్ల ఆదాయం మరింతగా తగ్గింది. అమ్మకం పన్ను, ఎక్సైజ్‌ పన్ను వగైరాలకు సంబంధించిన ఆదాయం గణనీయంగా పడి పోయింది. అయినా కరోనాను ఎదుర్కొనడానికి ఆ రాష్ట్రం శాయశక్తులా కృషి చేస్తోంది.

వనరులను సమీకరించడానికి ప్రజా ప్రతినిధులు మొదలుకొని ప్రభుత్వ సిబ్బంది, పింఛన్‌దార్ల వరకూ సగం వేతనాలను వాయిదా వేయాల్సివచ్చింది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ఆదాయం వున్న మహా రాష్ట్ర సైతం లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతోంది. ఈసారి ఆదాయం రూ. 2,10,824 కోట్లు వుండొచ్చునని 2020–21 బడ్జెట్‌లో అంచనా వేసిన ఆ రాష్ట్రం అందులో 5.35 శాతం... అంటే రూ. 27,000 కోట్ల మేర తగ్గొచ్చునని అంచనా వేసింది. పంజాబ్, బెంగాల్, రాజ స్తాన్‌ వంటివి నిరుపేద వర్గాలకు చేయూతనందించడానికి కూడా తమ దగ్గర తగినన్ని నిధులు లేవంటున్నాయి. వలస కార్మికులను, హఠాత్తుగా ఉపాధి కోల్పోయినవారిని ఎలా ఆదుకోవాలన్న అంశాన్ని తేల్చకుండానే కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో చాలా రాష్ట్రాలు సమస్యల్లో కూరుకు పోయాయి. స్వస్థలాలకు వెళ్లడం కోసం కాలినడకన బయల్దేరిన వలస కార్మికులను ఎక్కడికక్కడ నిలి పేసి, వారికి కూడు, గూడు కల్పించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

కానీ ఇందుకు కావలసిన నిధులు ఎవరిస్తారన్నదే సమస్య. సంక్షోభ సమయాల్లో వ్యయం చేయడానికి రాష్ట్రాలకు వుండే విపత్తు నిధుల నుంచి ఖర్చు చేసుకోవడానికి అనుమతినిస్తున్నట్టు గత వారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్తమానం పంపింది. కానీ ఆ పద్దులో వుండేది చాలా స్వల్ప మొత్తమని రాష్ట్రాలు చెబుతు న్నాయి. ఆ పద్దు కింద రాష్ట్రాలకు రావలసిన నిధులకు సంబంధించిన బిల్లులు కేంద్రం వద్ద ఎప్పుడూ పెండింగ్‌లోనే వుంటాయి. ఇక నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్‌కు సంబంధించిన పద్దులో రూ. 31,000 కోట్లు ఉన్నాయని, వాటిని కూడా వినియోగించుకోవచ్చునని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ చెప్పింది. కానీ నమోదైన నిర్మాణ రంగ కార్మికులకు మాత్రమే అది వినియోగించాలి.

 అసాధారణమైన విపత్తులు విరుచుకుపడినప్పుడు అందుకనుగుణంగా స్పందించడం కేంద్రం బాధ్యత. లేనట్టయితే రాష్ట్రాలు సంక్షోభంలో చిక్కుకుపోతాయి. ఎన్నికల సమయంలో చేసే వాగ్దా నాల మాదిరి ఆ స్పందన వుండకూడదు. గత నెలాఖరున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన కరోనా ప్యాకేజీకింద ప్రకటించిన నిధుల్లో కొన్ని అంతక్రితం ప్రకటించిన వివిధ పథకాలకు సంబంధించినవే. సారాంశంలో రాష్ట్రాల ఖజానాలు క్రమేపీ చిక్కిపోతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ద్రవ్యలోటు కట్టుదాటకూడదన్న పట్టుదలతో నిధుల వ్యయంలో కేంద్రం జాగ్రత్తగా అడుగులేస్తుంది. కానీ ఇప్పుడు నెలకొన్న ఈ సంక్షోభకాలంలో దాన్ని సడలించుకోవాలి. రాష్ట్రాలకు నిధుల కొరత లేకుండా చూడాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రాలు ఈ సంక్షోభాన్ని అధిగమించాక ఉపాధి కల్పనకు కృషి చేయగలవు. ఈ పరిస్థితుల్లో జీఎస్‌టీ పద్దు కింద కేంద్రానికి అందాల్సిన నిధులు కూడా తగ్గుతాయనడంలో సందేహం లేదు. కానీ ఆర్‌బీఐ నుంచి రుణం తీసుకోవడంతో సహా అనేక చర్యలు తీసుకుని ఈ నిధుల్ని సమీకరించాలి. దీర్ఘకాలం లాక్‌డౌన్‌తో తలెత్తే సమస్యల వల్ల ప్రజల్లో అసంతృప్తి, అశాంతి ప్రబలకుండా వుండాలంటే రాష్ట్రాలకు ధారాళంగా నిధులందిం చాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement