అప్రమత్తత అత్యవసరం | Editorial On Corona Virus | Sakshi
Sakshi News home page

అప్రమత్తత అత్యవసరం

Published Thu, Apr 2 2020 12:13 AM | Last Updated on Thu, Apr 2 2020 12:13 AM

Editorial On Corona Virus - Sakshi

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మన దేశంలో తీవ్రతను పెంచిందని ఈ రెండురోజు లుగా పెరిగిన బాధితుల సంఖ్య చూస్తే అర్ధమవుతుంది. మంగళవారంనాటికి వ్యాధిగ్రస్తుల సంఖ్య 1,397 వరకూ వుండగా, 24 గంటలు గడిచేసరికల్లా అది 1,637కి చేరుకుంది. మృతుల సంఖ్య 45కి చేరింది. అయితే అదృష్టవశాత్తూ ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇప్పటికీ బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య తక్కువగానే వుందని చెప్పుకోవాలి. కొత్తగా బయటపడిన కేసుల్లో అత్యధికం ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన ఒక సదస్సుకు వెళ్లినవారికి సంబంధించినవే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బయటపడిన కేసులు కూడా ఈ కోవలోనివే. తెలంగాణ నుంచి 1,030 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1085 మంది ఈ సదస్సుకు వెళ్లారని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి.

గత నెల 13–15 తేదీల మధ్య నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన ఈ సదస్సుకు ఇండొనేసియా, మలే సియా, సౌదీ అరేబియా దేశాల ప్రతినిధులు రావడంతో వారిద్వారా... ముఖ్యంగా మలేసియా ప్రతి నిధుల ద్వారా ఈ వైరస్‌ అంటుకుని వుండొచ్చన్నది ప్రాథమిక అంచనా. వీరిలో కొందరు స్వస్థలా లకు వెళ్లినా, మరికొందరు ఇక్కడే వుండి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లినట్టు చెబుతున్నారు. వారి ద్వారా ఎంతమందికి ఈ మహమ్మారి సోకిందో ఇంకా తేలవలసివుంది. ఈ వ్యాధి గురించిన అపోహలు ఎంతగా పెరిగాయంటే, ఆ వ్యాధిగ్రస్తుల్ని, వారి కుటుంబాలను, చివరికి వారికి చికిత్సనందించే వైద్య సిబ్బందిని వెలివేసినట్టు చూసే వాతావరణం దేశంలో అలుముకుంది. ఇది మంచిది కాదు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పినట్టు ఇదంతా వ్యాధిగ్రస్తుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. కనుకనే ఈ వ్యాధి బారిన పడినవారిలో కొందరు తమంత తాము బయటికొచ్చి చెప్పు కోవడానికి సందేహిస్తున్నారు.  ఇది ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుంది. రోగి వెంటనే చికిత్స చేయించుకుంటే కోలుకోవడం చాలా సులభమని వైద్య నిపుణులు పదే పదే వివరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి సులభంగా తగ్గిపోతుందని కోలుకున్న వారు సైతం చెబుతున్నారు.అయినా వ్యాధిగ్రస్తుల్లో ఇంకా భయాందోళనలు, సందేహాలు పోవడం లేదు.


వ్యాధిగ్రస్తులను వెలివేసే ధోరణి, వారిపట్ల లేనిపోని వదంతులు సృష్టించే వైఖరి అత్యంత ప్రమాదకరమైనది. దీనికి జడిసి ఎవరూ బయటకు చెప్పలేని స్థితి ఏర్పడితే అది సమాజం మొత్తానికి ప్రమాదంగా పరిణమిస్తుంది. ఇంతవరకూ రాజకీయాలు, కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీ తంగా అందరూ ఒక్కటై కరోనా మహమ్మారిపై పోరాడారు. ఇదిలాగే కొనసాగాలి. అయితే సదస్సు సంగతి వెల్లడయ్యాక దీన్ని నీరుగార్చే ప్రయత్నాలు సామాజిక మాధ్యమాల్లో మొదలయ్యాయి. దాదాపు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఏయే జిల్లాల వాసులు ఎందరు ఈ సదస్సుకు వెళ్లారో, వారి ఆరోగ్య స్థితిగతులు ఎలావున్నాయో... వారు ఇంతవరకూ ఎవరెవరిని కలిశారో, ఎక్కడెక్కడ తిరిగారో ఆరా తీసి, వారందరినీ పరిశీలన కేంద్రాలకు పంపవలసివుంది. విదేశీ ప్రతినిధుల్లో పదిమంది తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో కొన్నిచోట్ల తిరిగారు. వీరందరికీ కరోనా వ్యాధి వున్నదని గత నెల 17న బయటపడింది. దానికి హాజరై వ్యాధిగ్రస్తులైన ఆరుగురు మరణించారని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ సదస్సుకు హాజరయ్యాక మహమ్మారి బారిన పడినవారు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వున్నారు. మరికొందరి ఆచూకీ తెలియలేదంటున్నారు.

ఈ తరుణంలో వ్యాధిగ్రస్తుల కుటుంబాల్లో మరింత భయాందోళనలు సృష్టించేందుకు కొందరు ప్రయ త్నిస్తున్నారు. ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. అది మంచిది కాదు. సదస్సు నిర్వహణలో చట్టవిరుద్ధత ఏమైనా వుందా, వుంటే ఎవరు బాధ్యులన్న అంశాన్ని ప్రభుత్వాలు చూసుకుంటాయి. తగిన చర్య తీసుకుంటాయి. కానీ సామాజిక మాధ్యమాల్లో వదంతుల వ్యాప్తి అనసవర సమస్యలు సృష్టిస్తుంది. సదస్సు సమయానికి దేశంలో లాక్‌డౌన్‌ మొదలుకాలేదు. అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం 1897 నాటి అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం సభలూ, సమా వేశాల్లో 200మందికి మించి పాల్గొనకూడదన్న నిబంధన వుంది. మరి ఈ నిబంధన విధించినప్పుడు అంతమంది విదేశీ ప్రతినిధులకు వీసాలు ఎలా మంజూరుచేశారో, వేలమందితో సదస్సు జరు గుతున్నప్పుడు స్థానిక పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదో తేలవలసివుంది. సదస్సు నిర్వా హకులు మాత్రం తమ సదస్సుకు ముందస్తు అనుమతులు తీసుకున్నామని, అన్ని వివరాలు పోలీ సులకు, ప్రభుత్వానికి అందించామని అంటున్నారు. కనీసం సదస్సు మొదలైనప్పుడైనా కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆంక్షల విషయాన్ని నిర్వాహకులకు పోలీసులు ఎందుకు చెప్పలేకపోయారో, తగిన చర్య అప్పుడే ఎందుకు తీసుకోలేకపోయారో అనూహ్యం

ఆ పని చేసివుంటే ఇన్ని సమస్యలు ఎదురయ్యేవి కాదు. కనీసం లాక్‌డౌన్‌ ప్రకటించాకైనా అక్కడ ఎటూ కదల్లేక ఎంతమంది చిక్కుబడి వున్నారో ఆరా తీసి, క్వారంటైన్‌ కేంద్రాలకు పంపివుంటే బాగుండేది. ఇప్పుడు కొత్తగా బయట పడుతున్న కేసులన్నీ ఆ సదస్సులో పాల్గొన్నవారివీ, వారికి సన్నిహితులుగా మెలిగినవారివీ కావడం గమనిస్తే ఆందోళన కలుగుతుంది. 
దేశంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతోంది. రోగుల్ని గుర్తించిన వెంటనే తరలించడం, అను మానితులను స్వీయనిర్బంధంలో ఉంచడం ఎప్పటికప్పుడు సాగుతోంది. జనం పండుగలూ, ఉత్స వాలూ ఇళ్లల్లోనే జరుపుకుంటూ తమ వంతు సహకరిస్తున్నారు. కనుకనే దేశంలో 13 లక్షల మంది ఈ వ్యాధి బారినపడే అవకాశం వున్నదని మొదట అంచనా వేసిన అధ్యయన సంస్థలు సైతం దాన్ని సవరించుకున్నాయి. పాలకులు చురుగ్గా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్వేషాలు పెంచేలా వదంతులు వ్యాప్తి చేయకూడదని, ప్రభుత్వాలు చేస్తున్న కృషికి సహకరించాలని అందరూ గుర్తించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement