మన పరీక్షలు ఎంత ‘నీట్‌’? | Sakshi Editorial On NEET And JEE Exam Controversy | Sakshi
Sakshi News home page

NEET మన పరీక్షలు ఎంత ‘నీట్‌’?

Published Fri, Sep 24 2021 12:04 AM | Last Updated on Fri, Sep 24 2021 9:52 AM

Sakshi Editorial On NEET And JEE Exam Controversy

దేశంలో బోలెడు పోటీ ఉన్న ప్రవేశపరీక్షలవి. ఒకటి వైద్యవిద్యకూ, మరొకటి ఇంజనీరింగ్‌ విద్యకూ సంబంధించినది. ప్రతిష్ఠాత్మకమైన ఆ చదువుల్లో చేరడానికి అర్హత నిర్ణయించే ‘నీట్‌’, ‘జేఈఈ’ - ఈ జాతీయ స్థాయి పరీక్షలు రెండూ తాజాగా వివాదాస్పదం కావడం విచిత్రం. దేశ మంతటా ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలంటూ ప్రతిష్ఠాత్మకంగా పెట్టుకున్న ఎగ్జామ్‌లు ఇవి. కానీ, వీటిలో సైతం దొడ్డి దారిన పాస్‌ చేసి, మెడికల్, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశం సంపాదించి పెట్టేలా అక్రమార్కులు విజృంభించడం నివ్వెరపరుస్తోంది. మన పరీక్షావిధానాల్లోని డొల్లతనానికి ఇది నిలువెత్తు నిదర్శనం. అటు జేఈఈ, ఇటు నీట్‌ రెండింటిలో అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణకు దిగాల్సి రావడం ఈ ప్రవేశపరీక్షల విశ్వసనీయతను వెక్కిరిస్తోంది. ప్రాసంగికతను ప్రశ్నిస్తోంది.

వైద్యవిద్యలో ప్రవేశాల కోసం 2012లో మొదలుపెట్టినప్పటి నుంచి ‘నీట్‌’ వివాదాలు రేపుతూనే ఉంది. ఈ జాతీయ ప్రవేశపరీక్ష విద్యార్థుల ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక అంతరాలను బట్టి కొందరికి వరం, మరికొందరికి శాపమనే వాదన చాలా కాలంగా నడుస్తోంది. కొన్నేళ్ళుగా తమిళనాడు, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో వివాదమూ నెలకొంది. అప్పట్లోనే పలువురు విద్యార్థుల ఆత్మహత్యలతో తమిళనాట ‘నీట్‌’ రద్దు ఎన్నికల వాగ్దానమూ అయింది. ఇటీవల వారం రోజుల్లో ముగ్గురి ఆత్మహత్యతో ఈ నెల 13న అక్కడి కొత్త డీఎంకె ప్రభుత్వం తమిళనాట నీట్‌ను మినహాయిస్తూ, అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసింది. పన్నెండో తరగతి మార్కులే వైద్యవిద్యలో ప్రవేశానికి అర్హతగా తీర్మానించింది. రాష్ట్రపతి ఆమోదం పొందితే తప్ప, ఈ బిల్లు కాస్తా చట్టం కాదు. ఇంతలోనే పులి మీద పుట్రలా ఈ దొడ్డిదారి పాస్‌ వివాదం. ఎవరైనా సరే రూ. 50 లక్షలిస్తే చాలు... అసలు విద్యార్థి బదులు వేరెవరినో కూర్చోబెట్టి, ‘నీట్‌’ రాయించి, మెడికల్‌ కాలేజీ సీటు ఇప్పించే నాగపూర్‌లోని కోచింగ్‌ బండారం ఈ నెల 22న సీబీఐ బయటపెట్టింది. కథ కొత్త మలుపు తిరిగింది.

ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం జేఈఈ (మెయిన్స్‌), వాటిలో పాసైన 2.5 లక్షల మంది ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో చేరేందుకు రాసే జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)కు సైతం ఇప్పుడు బురదంటుకుంది. ఈ ఏడాది నుంచి 4 దశలైన ఈ పరీక్షలో నాలుగోది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ). పేరొందిన జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) నిర్వహిస్తున్న ఇందులోనూ అక్రమాలు జరిగాయని సీబీఐ తేల్చింది. 15 లక్షలిస్తే, విద్యార్థి పరీక్ష రాసే కంప్యూటర్‌లోకి సుదూరంగా ఎక్కడి నుంచో సాంకేతికంగా జొరబడి, జవాబులు రాసి పాస్‌ చేయించే మోసాలు బహిర్గతమయ్యాయి. ఇలా అక్రమాలకు పాల్పడ్డ విద్యార్థుల్లో కొందరిపై ఎన్టీఏ తాజాగా మూడేళ్ళు నిషేధం పెట్టింది. పట్టుబడని దొంగల సంఖ్య పరమాత్ముడికి ఎరుక. వెరసి, జేఈఈ, నీట్‌ – రెండూ లోపరహితం కాదని తేలిపోయింది.

ఏటా లక్షలాది విద్యార్థులు అనేక నెలలు శ్రమించి ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ ఏడాది 15.3 లక్షల మంది నీట్, 9.4 లక్షల మంది జేఈఈ మెయిన్స్‌ రాశారు. ఎంతటి ప్రతిభావంతులైనా ఈ ఎంట్రన్స్‌ టెస్టుల్లో పాసైతేనే, కోరుకున్న వైద్య, ఇంజనీరింగ్‌ వృత్తివిద్యాభ్యాసం చేయగలుగుతారు. అందుకోసం అనేక మంది లక్షలు పోసి మరీ కోచింగ్‌లు తీసుకుంటూ ఉంటారు. కుటుంబ వార్షికాదాయం రూ. 2.5 లక్షల కన్నా తక్కువుండి, గ్రామీణ ప్రాంతాల్లో తమిళ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు నీట్‌ ఓ ప్రాణాంతక పోటీగా మారింది. సమాజంలోని ఉన్నత సామాజిక, ఆర్థిక వర్గాలకే ఎంబీబీఎస్‌ సీటొచ్చే పరిస్థితి. విభిన్న వర్గాలకు చోటు లేకుండా పోతోంది. తమిళనాడు సర్కార్‌ నియమించిన కమిటీ ఆ సంగతే తేల్చింది. 

2013లో ఒకసారి నీట్‌ జరిగినా, సుప్రీమ్‌ కోర్టు నిషేధంతో కొన్నేళ్ళు ఆగింది. 2016లో కోర్టు ఉత్తర్వుల సవరణతో 2017– 18 విద్యా సంవత్సరం నుంచి నీట్‌ మళ్ళీ దేశవ్యాప్తంగా తప్పనిసరి తంతుగా మారింది. అప్పటి నుంచి నీట్‌ నుంచి మినహాయింపు కోసం తమిళనాడు లాంటి రాష్ట్రాలు ప్రయత్నిస్తూనే వస్తున్నాయి. బాగా చదివి, పన్నెండో తరగతిలో మార్కులు తెచ్చుకున్నవారు సైతం దేశవ్యాప్త సిలబస్, కోచింగ్‌ అంతరాలతో నీట్‌ సరిగ్గా రాయలేక, ఒత్తిడి, ఆందోళనతో కొన్నేళ్ళుగా ఎందరో పసివాళ్ళు ప్రాణాలు తీసుకోవడం కన్నీరు తెప్పిస్తోంది.

ప్రతిభకు పట్టం కట్టడం, అందరికీ సమాన అవకాశాల కల్పన, విద్యార్థుల ప్రాణాలు – ఇలా ఎన్నో ముడిపడ్డ సున్నిత అంశమిది. నీట్‌ను యథాతథంగా కొనసాగించ రాదు. అలాగని, రాష్ట్రానికో రకం సిలబస్, ఒక్కోచోట ఒక్కోరకం మార్కుల కేటాయింపున్న బహుభాషా దేశంలో, పన్నెండో తరగతి మార్కులతోనే దేశవ్యాప్త ప్రవేశాలు నిర్ణయించాలని పట్టుబట్టడమూ సరైనది కాదు. వైద్యం రాష్ట్ర జాబితాలోది కాగా, విద్యను రాష్ట్ర పరిధి నుంచి ఎమర్జెన్సీ కాలంలో కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి తెచ్చారు. మళ్ళీ ఇప్పుడిలా నీట్‌తో కేంద్రం పెత్తనమన్నది విమర్శ.

ఇరుపక్షాలూ సమగ్రంగా ఆలోచించి, తగు చర్యలు చేపట్టాలి. బలహీన వర్గాలకు ప్రత్యేక కోచింగ్‌ ఇవ్వడం, లేదంటే ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు రిజర్వు చేయడం లాంటివి చేయవచ్చు. ఈ పరీక్షలు, మార్కులే ప్రపంచం కాదనీ, బతకడానికి నీట్‌ ఒక్కటే మార్గం కాదనీ పెద్దలు, టీచర్లు పిల్లలకు ధైర్యమివ్వాలి. ప్రభుత్వమేమో జేఈఈలో అక్రమాలకు ఎథికల్‌ హ్యాకర్లతో అడ్డుకట్ట వేయాలి. పారదర్శకమనే ఆన్‌లైన్‌ పరీక్షలే ‘డిజిటల్‌ ఇండియా’ వేళ అక్రమాలకు నెలవైనప్పుడు వ్యవస్థ నిద్ర మేల్కోవాల్సిందే. ఎందుకంటే, ఇది లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు. కోట్లాది కుటుంబాల ఆకాంక్షలకు విపత్తు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement