కరోనా కరాళ నృత్యం చేస్తుంటే విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ జేఈఈ, నీట్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం మాత్రం పరీక్షలకు పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్ 1-6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) జరగనున్నట్లు వెల్లడించింది. మరోవైపు వచ్చే నెల 13న నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్–2020) పరీక్ష జరుగుతుండగా, కరోనా అనుమానితులకు ఐసోలేషన్ గదిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తెలిపింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: పరీక్ష కేంద్రాల్లో ఐసోలేషన్ గదులు )
తాజాగా స్వీడిష్ యువ కెరటం, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ విద్యార్థుల తరపున గళమెత్తారు. కరోనా కాలంలో భారత విద్యార్థులను జాతీయ పరీక్షలకు హాజరు కావాల్సిందేనని చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికే అక్కడ లక్షలాది మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. కాబట్టి జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. కాగా ఇప్పటికే విద్యార్థులను కరోనా భయం వెంటాడుతుంటే, మరోవైపు అస్సాం, బిహార్, గుజరాత్, చత్తీస్‌ఘడ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం కూడా కష్టమేనన్నది ప్రతిపక్షాల వాదన. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలోనే పరీక్షలు నిర్వహించి తీరుతామని కేంద్రం తేల్చి చెప్పడం గమనార్హం. (చదవండి: జేఈఈ మెయిన్స్‌కు కరోనా ఆంక్షలు)
Comments
Please login to add a commentAdd a comment