సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టెయ్యండి’ అనే వానాకాలం చదువులకు కేసీఆర్ సర్కార్ ఫుల్‌స్టాప్ పెడుతోంది. పక్కా ప్రణాళికతో అందుబాటులో ఉన్న విద్యా వనరులను హేతుబద్ధీకరణతో వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు టీఆర్‌ఎస్ సర్కార్ శుక్రవారం అసెంబ్లీలోనూ ఓ ప్రకటన చేసింది. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది.
మరోవైపు విద్యార్థులు లేని పాఠశాలలను కిలోమీటర్ దూరంలోని మరో పాఠశాలలో కలిపి మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. దీంతో విద్యాశాఖ అధికారులు జిల్లాలో విద్యార్థులు లేని పాఠశాలలను గుర్తించే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లేని ప్రాథమిక పాఠశాలలు 69 ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. అధికారిక ఉత్తర్వులు అందిన వెంటనే ఈ పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 1,974 ప్రాథమిక పాఠశాలలు, 423 ప్రాథమికోన్నత పాఠశాలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 2.75 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి రాష్ట్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు పాఠశాలలకు ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల కేటాయింపు చేశారు. సచివాలయంలో పని చేసే ఆంధ్రప్రాంత అధికారులు వారి పలుకుబడిని ఉపయోగించుకుని తమ భార్యలకు, బంధువులకు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పటాన్‌చెరు, రామచంద్రాపురం, తూప్రాన్, గజ్వేల్ మండలాల్లోని పాఠశాలల్లో పోస్టింగులు ఇప్పించుకున్నారు. ఫలితంగా కొన్ని పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉంటే 10 మంది టీచర్లు, ఇంకొన్ని పాఠశాలల్లో 5 మంది విద్యార్థులు లేకున్నా ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ఆ మేరకు లేరు. మరి కొన్ని పాఠశాలలకు పక్కా భవనాలు లేకపోగా, ఇంకొన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా భవనాలు ఉన్నాయి.
ఎస్‌ఎస్‌ఏ ఏం చెబుతోందంటే...
సర్వశిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) నిబంధనల ప్రకారం పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 21 నుంచి 60 లోపు విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 లోపు విద్యార్థులుంటే ముగ్గురు ఉపాధ్యాయులు, 91 నుంచి 120 లోపు విద్యార్థులు నలుగురు ఉపాధ్యాయులు, 120 నుంచి 150 లోపు విద్యార్థులుంటే 5 మంది టీచర్లు, హెడ్‌మాస్టర్ కూడా ఉండాలి. కానీ జిల్లాలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. అందువల్లే ప్రభుత్వం ఇపుడు హేతుబద్ధీకరణ ద్వారా విద్యావనరులపై అధ్యయనం చేసి మెరుగైన వసతులతో ప్రైవేటు బడుల కంటే మెరుగ్గా విద్యాబోధన జరిగేలా చర్యలు చేపట్టింది.
20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో 225 ప్రాథమిక పాఠశాలు ఉన్నట్లు అంచనా. ఇక కిలోమీటర్ దూరాన్ని పరిగణలోకి తీసుకొని విలీనం చేస్తే మరికొన్ని పాఠశాలలు కూడా పోయే అవకాశం ఉంది. అయితే దీన్ని అంతసులువుగా ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించే అవకాశం లేదు కాబట్టి క్రమంగా హేతుబద్ధీకరించే అవకాశం ఉంది.
హేతుబుద్ధీకరణ!
Published Fri, Nov 14 2014 11:12 PM | Last Updated on Sat, Sep 15 2018 4:26 PM
Advertisement