262 స్కూళ్లకు మంగళం !
- మూతపడనున్న 50 ప్రాథమిక, 150 ప్రాథమికోన్నత, 4 ఉన్నత పాఠశాలలు
- మరో 58 సక్సెస్ స్కూళ్లదీ అదేబాట
- కొలిక్కి వచ్చిన రేషనలైజేషన్
- టీచర్ పోస్టుల బదలాయింపుపై తెగని పేచీ
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో మొత్తం 262 స్కూళ్లు కనుమరుగుకానున్నాయి. ఏళ్ల తరబడి వేలాది మందికి చదువులు నేర్పిన ఆ స్కూళ్లు ఇక కనిపించవు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల రేషనలైజేషన్ (హేతుబద్దీకరణ) ప్రక్రియ కొలిక్కి వచ్చింది. షెడ్యూలు ప్రకారం ఈ నెల 8 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా.. ఎట్టకేలకు ముందడుగు పడింది. ప్రతిబంధకంగా మారిన పలు అంశాల్లో స్పష్టత రావడంతో ఓ కొలిక్కి వచ్చింది.
జిల్లాలో మొత్తం 50 ప్రాథమిక పాఠశాలలు మూతపడనున్నాయి. వీటిలో 25 స్కూళ్లలో ‘0’ విద్యార్థుల సంఖ్య ఉంది. 20 లోపు విద్యార్థులున్న మరో 25 స్కూళ్లను మూసివేయనున్నారు. 19 మందిలోపు విద్యార్థులు ఉండి కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల లేకపోతే అలాంటి స్కూళ్లను కొనసాగించనున్నారు.
అలాగే 150 ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దుకానున్నాయి. 6, 7 తరగతుల్లో 30 మందిలోపు విద్యార్థులు, 6,7,8 తరగతుల్లో 40 మంది విద్యార్థులున్న పాఠశాలలకు మంగళం పాడారు. అయితే 3 కిలోమీటర్ల పరిధిలో మరో స్కూల్ లేకపోతే వాటిని కొనసాగించనున్నారు. ఇలా మరో 150 యూపీ పాఠశాలలు మూత పడకుండా కొనసాగనున్నాయి.
ఇక ఉన్నత పాఠశాలలకు సంబంధించి 50 మందిలోపు విద్యార్థులున్న 4 పాఠశాలలు మూతపడనున్నాయి. అలాగే సక్సెస్ స్కూళ్లపైనా హేతుబద్ధీకరణ ప్రభావం పడింది. 50 మందిలోపు ఇంగ్లిష్ మీడియం విద్యార్థులున్న ఉన్న 50 స్కూళ్లను తెలుగు మీడియం పాఠశాలల్లోకి విలీనం కానున్నాయి. మరో 8 సక్సెస్ స్కూళ్లు కూడా మూతపడాల్సి ఉన్నా... స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)లు తీర్మానాలు చేయడం వల్ల కొనసాగించాలని పట్టుపడుతున్నారు. అయితే ఆ 8 స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులు కొనసాగించే వీలు లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పోస్టుల బదలాయింపుపై తెగని పేచీ
మూతపడిన పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టుల బదలాయింపుల్లో పేచీ నెలకొంది. నిర్ధేశించిన కిలోమీటర్ల పరిధిలో ఇతర స్కూళ్లు ఉంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్లను అందులో విలీనం చేస్తారు. విద్యార్థులతో పాటు టీచర్లను అదే స్కూళ్లకు సర్దుతారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి నిర్ధేశించిన కిలోమీటర్ల పరిధిలో మరో స్కూల్ లేనిపక్షంలో తప్పనిసరిగా కొనసాగిస్తారు.
ఉదాహరణకు ఓ స్కూల్‌లో 10 మంది విద్యార్థులుంటే నలుగురు టీచర్లు పని చేస్తుంటారు.. వారిలో ఎంతమందిని తీస్తారు, ఎక్కడికి పంపుతారనే దానిపై స్పష్టత మాత్రం లేదు. ముఖ్యంగా యూపీ స్కూళ్లలో ఈ సమస్య అధికంగా ఉంది. స్కూల్ అసిస్టెంట్లను బయటకు పంపి అక్కడ ఎస్జీటీలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం దీనిపై స్పష్టత కోసమే ప్రభుత్వానికి లేఖ రాశామని పైకి చెబుతున్నారు.