నెల్లూరు(విద్య) : విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించి, ఉపాధ్యాయుల కొరత లేకుండా ఆయా పాఠశాలలను సకాలంగా పనిచేసేలా చూసేందుకు తాత్కాలిక పద్ధతిపై సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ముందడుగు వేస్తుందా లేదా అనే అనుమానాలు నెలకున్నాయి. ఈ ప్రక్రియ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తారా..? లేదా సీనియార్టీ జాబితా ఆధారంగా అవసరమైన చోటకు తాత్కాలికంగా నియామకాలు జరుగుతాయా అనే అంశంపై ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది. ఉపాధ్యాయులను రేషనలైజేషన్‌లో సర్దుబాటు చేసేందుకు సీనియార్టీ జాబితాలను తయారు చేయాల్సి ఉంది. జిల్లాలో ఇంతవరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. జిల్లా స్థాయిలో సీనియార్టీ జాబితా లను తయారు చేసి దాని ద్వారా ఉపాధ్యాయులను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తారా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. సర్దుబాటు చేసే క్రమంలో జిల్లా స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో సర్దుబాటు చేయాలని మరో వాదన వినిపిస్తుంది. జిల్లాలోని 4,313 పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి ఉపాధ్యాయులు లేరు.
అడ్డంకిగా జీఓ 55
విద్యాహక్కు చట్టం ప్రకారం 19 మంది విద్యార్థులకు ఒక టీచర్, 35 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు ఉండాలని నిబంధన ఉంది. ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి 40 మందికి ఒక సెక్షన్ చొప్పున ఒక టీచర్‌ను ఇవ్వాలనే నిబంధన ఉంది. 40 మంది కంటే అధికంగా పిల్లలు ఉంటే మరో సెక్షన్‌ను మంజూరు చేసి మరో టీచర్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఇందుకు విరుద్ధంగా 2011 ఏప్రిల్‌లో ప్రభుత్వం జీఓ 55ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఉన్నత పాఠశాలలో ఆయా తరగతుల విద్యార్థుల సంఖ్యను కాకుండా పాఠశాలలో మొత్తం ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులను కేటాయించాలనే నిబంధన విధించింది. విద్యాహక్కు చట్టానికి, జీఓ 55కు పొంతన లేకపోవడంతో ప్రస్తుతం సర్దుబాటు ప్రక్రియ సందిగ్ధంలో పడింది. జిల్లాలో నాలుగేళ్ల క్రితం రేషనలైజేషన్ ప్రక్రియతో బదిలీలు జరిగాయి. అప్పటిలో బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. సీనియార్టీ జాబితాను సిద్ధం కాకపోవడంతో ఈ ప్రక్రియ జరిగే పరిస్థితి కనిపించడంలేదు.
విద్యార్థుల సంఖ్య ముఖ్యం
పని సర్దుబాటు ప్రక్రియలో తరగతి గదిలో కచ్చితమైన విద్యార్థుల సంఖ్య ముఖ్యం. యు-డైస్ వివరాలు అందితే విద్యార్థుల సంఖ్య స్పష్టమవుతుంది. సీనియార్టీ జాబితాను పరిశీలించాల్సి ఉంది. ఈ రెండింటిపై స్పష్టత ఏర్పడితే ప్రభుత్వ నిబంధనల మేరకు వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేయవచ్చు.
-డి.ఆంజనేయులు, డీఈఓ
టీచర్ల సర్దుబా(ట)టు పట్టేనా!
Published Wed, Dec 3 2014 1:16 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement