సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటించినా ఖాళీలపై ఇంకా తర్జనభర్జన పడుతోంది. ఉపాధ్యాయ ఖాళీలను సాధ్యమైనంత మేర తగ్గించడానికి క్షేత్రస్థాయిలో పోస్టులను కుదింపు చేస్తోంది. ఈ నెల 6న ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన చేస్తూ 12,370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యా శాఖ పరిధిలో 10,313 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 860, మోడల్ స్కూళ్లలోని పోస్టులు 1197 కలుపుకొని 12,370 ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 15న డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని, ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని షెడ్యూల్ విడుదల సందర్భంగా మంత్రి గంటా చెప్పారు. అయితే ఏపీపీఎస్సీకి అప్పగించే అంశం తేలకపోవడం, జిల్లాల వారీగా ఖాళీలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో నోటిఫికేషన్ వెలువడలేదు. వాస్తవానికి టీచర్ పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నా ప్రభుత్వం కుదించి చూపిస్తోంది. రెండు నెలల క్రితం మంత్రి గంటా 22,814 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు.
రేషనలైజేషన్, విద్యార్థుల సంఖ్యను కుదించి చూపుతూ తగ్గింపు
టీడీపీ అధికారంలోకి వచ్చాక పాఠశాల విద్యాశాఖలో హేతుబద్ధీకరణ విధానాన్ని తెరపైకి తెచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వాటిని మూసేయించి వేరే స్కూళ్లలో విలీనం చేసే చర్యలు చేపట్టింది. ఇలా 2015–16లో 1500 స్కూళ్లు మూత వేయించింది. ఫలితంగా పాఠశాలల సంఖ్య కుదించుకుపోయి మూతపడ్డ ఆయా స్కూళ్లలోని టీచర్లు అదనపు టీచర్లుగా మిగిలిపోతున్నారు. వీరిని ఇతర పాఠశాలల్లో ఖాళీ పోస్టుల్లో నియమిస్తున్నారు. ఫలితంగా ఖాళీ పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. మరోవైపు చైల్డ్‌ఇన్ఫో పేరిట కూడా పాఠశాలల్లో టీచర్ల సంఖ్యకు కోతవేస్తోంది.
2014 తర్వాత ఒక్కటే డీఎస్సీ
ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఒకే ఒక్క డీఎస్సీని నిర్వహించింది. 10,313 పోస్టులతో ఆ డీఎస్సీని ప్రకటించి దాన్ని రెండేళ్లు సాగదీసి 2016లో ఎంపికలు పూర్తిచేశారు. అలా ఎంపికైనవారిలో ఇంకా రెండు వేల మందికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా డీఈవో కోటాలోనే ఉంచారు. ఖాళీలు భారీగా ఉన్నా వారిని ఆయా పోస్టుల్లో నియమించకుండా హేతుబద్ధీకరణతో మిగిలిన పోస్టుల్లో నియమిస్తున్నారు. ఫలితంగా ఖాళీల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. రెండేళ్ల క్రితం సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో టీచర్ పోస్టుల ఖాళీల సంఖ్యను ప్రభుత్వం 19,468 ఉన్నట్లు చూపింది. ఆ తర్వాత డీఎస్సీని నిర్వహించకపోవడం, ఈ మూడేళ్లలో రిటైర్ అయిన వారి సంఖ్యను కలుపుకొంటే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. అయినా ప్రభుత్వం పోస్టుల సంఖ్యను తగ్గించి డీఎస్సీని ప్రకటించడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment