విద్యా శాఖ ఉరుకులు..పరుగులు | kcr government speed up on dsc notification | Sakshi
Sakshi News home page

విద్యా శాఖ ఉరుకులు..పరుగులు

Published Tue, Jan 5 2016 2:47 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

విద్యా శాఖ ఉరుకులు..పరుగులు - Sakshi

విద్యా శాఖ ఉరుకులు..పరుగులు

    ► తాజా లెక్కల ప్రకారమే..
         ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యా శాఖ చర్యలు
     ► పనిలో పనిగా రేషనలైజేషన్ ప్రక్రియ కూడా..
     ► విద్యార్థులు - ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం పోస్టులు
     ► జిల్లాల వారీగా ఖాళీలపై ఈ నెల 7 నాటికి స్పష్టత
 
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలవారీగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల సేకరించిన క్షేత్ర స్థాయి(డైస్ డాటా) సమాచారం ఆధారంగా హేతుబద్ధీకరణ చేస్తోంది. తద్వారా పాఠశాలలకు అవసరమైన పోస్టులను భర్తీ చేసేలా కసరత్తు చేస్తోంది. గత శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో 15,628 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే అందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్లలో 10,927 ఉపాధ్యాయ పోస్టులు, మరో 1,215 ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నట్లు తెలిసింది. అయితే గతంలో సేకరించిన డైస్ డాటా ప్రకారం విద్యా శాఖ ఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చింది. గతంలో హైకోర్టుకు కూడా ఇవే లెక్కలు చూపించింది. అయితే తాజా డీఎస్సీ నోటిఫికేషన్‌లో మాత్రం తాజా లెక్కల ప్రకారం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. పనిలో పనిగా హేతుబద్ధీకరణ కూడా చేస్తోంది.

ప్రస్తుతం వివిధ జిల్లాల్లో ఉన్న పాఠశాలల సంఖ్య, వాటిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం ఉన్న టీచర్లు, అదనంగా అవసరమైన టీచర్ల సంఖ్యను తేల్చే చర్యలు చేపట్టింది. మరోవైపు అదనంగా సబ్జెక్టు టీచర్లు అవసరమని కూడా భావిస్తోంది. ఉన్నత పాఠశాలల్లో కనీస విద్యార్థుల సంఖ్యను తీసుకుని ఒక్కో స్కూల్లో ఉండాల్సిన పోస్టులను తేల్చే పనిలో నిమగ్నమైంది. తద్వారా ఖాళీగా ఉన్న సబ్జెక్టు టీచర్ పోస్టులతోపాటు అదనంగా కొన్ని సబ్జెక్టు టీచర్ పోస్టులను సృష్టించాల్సి వస్తుందన్న భావన నెలకొంది. మరోవైపు మీడియం వారీగా స్కూళ్లపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.

ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ప్రస్తుతం ఉన్న టీచర్ల పరిస్థితిపైనా లెక్కలు తీసుకుంది. చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలోని 2 వేలకుపైగా ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లకు సబ్జెక్టు టీచర్లను ఇచ్చే అంశంపైనా దృష్టి పెట్టింది. రేషనలైజేషన్‌లో భాగంగా అర్హతలు ఉన్న టీచర్లను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు పంపేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 7 నాటికల్లా జిల్లాలవారీగా, కేటగిరీలవారీగా, మీడియంవారీగా ఖాళీలపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని విద్యా శాఖకు చెందిన  ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
 
కొత్త రోస్టర్ కమ్ రిజర్వేషన్!
కొత్తగా రాష్ట్రం ఏర్పడినందునా ఉపాధ్యాయ నియామకాల్లో కొత్త రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని అవలంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వం కూడా కొత్త రోస్టర్ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించడంతో అధికారులు దానిపై దృష్టిసారించారు. సాధారణంగా పాత రోస్టర్ కమ్ రిజర్వేషన్‌ను అమలు చేస్తే.. ఒక కేటగిరీ పోస్టుల  భర్తీలో గతంలో ఏ రోస్టర్ పాయింట్ వద్ద(వంద పాయింట్లలో) ఏ రిజర్వేషన్ అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారో.. ఆ తర్వాత పాయింట్‌లో ఏ రిజర్వేషన్ అభ్యర్థికి కొత్తగా పోస్టింగ్ ఇవ్వాలనేది నిర్ణయించి నియామకాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తారు. అయితే ఇకపై రోస్టర్ పాయింట్‌ను 1 నుంచే ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement