పిల్లలు లేకున్నా టీచర్లు! | teachers without students | Sakshi
Sakshi News home page

పిల్లలు లేకున్నా టీచర్లు!

Published Fri, Jul 24 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

పిల్లలు లేకున్నా టీచర్లు!

పిల్లలు లేకున్నా టీచర్లు!

ఒక్క విద్యార్థి కూడా లేని 400కు పైగా స్కూళ్లకు కేటాయింపు
 
ఉపాధ్యాయ బదిలీల్లో కేటాయించిన అధికారులు
క్షేత్రస్థాయిలో తనిఖీల తర్వాత విద్యార్థులు ఉంటేనే
కొనసాగింపు.... లేదంటే మరో స్కూల్‌కు...
పూర్తయిన టీచర్ల బదిలీ ప్రక్రియ
రాష్ట్రవ్యాప్తంగా 23 వేలకుపైగా బదిలీలు
 
హైదరాబాద్: ఆ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేడు! ఒకటి కాదు రెండు కాదు.. అలాంటి పాఠశాలలు రాష్ట్రంలో 400 దాకా ఉన్నాయి. వాటన్నింటికి అధికారులు ఒక్కో టీచర్‌ను కేటాయించారు!! స్కూళ్లలో 2014 సెప్టెంబర్ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలు చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం మొదట జారీ చేసిన ఉత్తర్వుల్లో 2014 సెప్టెంబర్ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని పేర్కొంది. అలాగే 19 మంది, అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రెగ్యులర్ టీచర్‌ను ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అలా చేస్తే స్కూళ్లు మూతపడతాయని పేర్కొన్నాయి. 2015 జూన్ 30 నాటికి స్కూళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని టీచర్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి. 2014 సెప్టెంబరు నుంచి 2015 జూన్ 30 నాటికి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించాయి.

అయితే అప్పటికప్పుడు ఉత్తర్వులను మారిస్తే.. బదిలీ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో అధికారులు పాత ఉత్తర్వులే అమలు చేశారు. పైగా క్షేత్రస్థాయిలో జూన్ 30 నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య తెప్పించేందుకు రెండు మూడు నెలల సమయం పట్టే పరిస్థితి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బదిలీల్లో 19 మందిలోపు ఉన్న అన్ని స్కూళ్లకు ఒక్కో టీచర్‌ను కేటాయించారు. ప్రస్తుతం ఆ స్కూళ్లలో విద్యార్థులు ఉంటే అక్కడ టీచర్‌ను కొనసాగిస్తారు. లేదంటే అవసరం ఉన్న మరో స్కూల్‌కు వారిని పంపిస్తారు. ఇందుకు ఉన్నతాధికారులు ఆయా స్కూళ్లను తనిఖీ చేయనున్నారు.

ఒక్క విద్యార్థి లేని స్కూళ్లు జిల్లాల వారీగా..
ఆదిలాబాద్-49, కరీంనగర్ 72, నిజామాబాద్-3, వరంగల్-103, ఖమ్మం-18, నల్లగొండ-77, మెదక్-24, రంగారెడ్డి-41. ఇలా 8 జిల్లాల్లోనే ఒక్క విద్యార్థి లేని 387 స్కూళ్లకు టీచర్లను కేటాయించారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో ఒక్క విద్యార్థి లేని స్కూళ్లు ఎన్ని ఉన్నాయో లెక్క తేలాల్సి ఉంది. మొత్తంగా 400కు పైగా జీరో స్కూళ్లు(ఒక్క విద్యార్థి లేనివి) ఉంటాయని అధికారులు వెల్లడించారు.

23 వేలకు పైగా టీచర్ల బదిలీ
రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగిసింది. 23,154 మంది టీచర్లు బదిలీ అయ్యారు. అంటే దాదాపు నాలుగో వంతు టీచర్లకు బదిలీలు జరిగాయి. సాధారణంగా ఈ మూడు ప్రక్రియలకు రెండు నెలల సమయం పడుతుంది. అయితే ఇప్పటికే స్కూళ్లు మొదలైన నేపథ్యంలో.. విద్యాశాఖ నెల రోజుల్లోనే పూర్తి చేసింది. గత నెల 22న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈనెల 22వ తేదీతో ముగిసిందని పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు పేర్కొన్నారు.

డీఎస్సీలో ఏడెనిమిది వేల పోస్టులే?
ఈసారి హేతుబద్ధీకరణలో భాగంగా మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్‌జీటీ) అవసరం ఉన్నట్లు తేలింది. మిగతా జిల్లాల్లో ఎస్‌జీటీ పోస్టులు అవసరానికి మించి ఉన్నట్లు వెల్లడైంది. ఆ నాలుగు జిల్లాలతో పాటు మిగతా ఆరు జిల్లాల్లోనూ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరం ఉన్నట్లు లెక్క తేల్చారు. మొత్తంగా ఏడెనిమిది వేల పోస్టులు మాత్రమే భవిష్యత్తులో డీఎస్సీ ద్వారా నియమించే అవసరం ఉంటుందన్న అంచనాకు వచ్చారు.

ఈ బదిలీల్లో ప్రత్యేకంగా చేపట్టిన చర్యలివీ..
- 1,966 మంది ఎస్‌జీటీలకు ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు కల్పించారు. జీవో 610ని అమలు చేశారు.
- గిరిజన ప్రాంతాల్లోని పోస్టుల్లో ఆ ప్రాంతాల వారికే పదోన్నతులు కల్పించారు. గతంలో జారీ చేసిన జీవో 3ని ఈసారి పక్కాగా అమల్లోకి తెచ్చారు.

జిల్లా వారీగా బదిలీ అయిన టీచర్లు
జిల్లా            దరఖాస్తులు        బదిలీ అయినవారు
హైదరాబాద్        1,985        1,018
మెదక్            9,484        2,553
నల్లగొండ        9,506        2,302
నిజామాబాద్        6,942        2,069
కరీంనగర్            9,779        2,773
రంగారెడ్డి            8,231        2,288
మహబూబ్‌నగర్        9,311        2,935
ఖమ్మం            8,193        2,215
ఆదిలాబాద్        7,368        2,327
వరంగల్            9,829        2,674
మొత్తం            80,628    23,154.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement