మే నెలలో టీచర్ల హేతుబద్ధీకరణ!
♦ కసరత్తు చేస్తున్న విద్యాశాఖ
♦ నెలాఖరుకల్లా ప్రక్రియను ముగించేందుకు ప్రణాళికలు
♦ ఆ తరువాతే టీచర్ల భర్తీకి చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈనెల చివరి వారంలో ప్రక్రియ ప్రారంభించి మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థుల్లేని స్కూళ్లను కొనసాగించడం విద్యాశాఖకు భారంగా మారింది. విద్యార్థులు తక్కువున్న స్కూళ్లలో ఎక్కువ టీచర్లు ఉండటం, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట తక్కువ మంది టీచర్లు ఉండటం నాణ్యమైన విద్యకు ప్రధాన ఆటంకంగా మారింది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అలాగే ఒక్కో గ్రామంలో ఉన్న ఐదారు స్కూళ్లను విలీనం చేసి, ఒకే స్కూల్‌ను కొనసాగించడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు, ఎక్కువ మంది టీచర్లను ఇచ్చి నాణ్యమైన విద్యా బోధన అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ఏర్పడే ఖాళీల సంఖ్యను బట్టి టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నా టీచర్లు లేరు.. విద్యార్థులు లేని చోట టీచర్లు ఉన్నారు. 4 వేల వరకు పాఠశాలల్లో 20 మందిలోపే విద్యార్థులు ఉండగా. వాటిల్లో అధిక సంఖ్యలో టీచర్లు ఉన్నారు. మరోవైపు ఒకే గ్రామంలో ఐదారు స్కూళ్లు కొనసాగతున్నవి వందల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో గ్రామంలో ఒక్కటే స్కూల్ ఉండేలా విధానాన్ని రూపొందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కాగా, పాఠశాలల హేతుబ ద్ధీకరణ చేస్తున్నారంటే చాలు కొంత మంది ఉపాధ్యాయులు తమ పోస్టులు ఎక్కడ పోతాయోనని తప్పుడు లెక్కలు చూపించడం పరిపాటిగా మారింది. దీంతో ఇలాంటి తప్పిదాలకు ఈసారి చెక్ పెట్టేలా ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు.
హేతుబద్ధీకరణ తరువాతే టీచర్ల భర్తీ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు వచ్చే నాటికి టీచర్ల హేతుబద్ధీకరణను పూర్తి చేస్తామని, ఆ తరువాత ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 1న జరిగే టెట్ ఫలితాలను మే 10 -13 తేదీల మధ్య ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల హేతుబద్ధీకరణ తర్వాత ఏర్పడే ఖాళీల్లో టీచర్లను నియమించేందుకు అవసరమైన చర్యలను వేగంగా చేపట్టవచ్చని భావిస్తున్నారు.