teachers replacement
-
గిరిజన టీచర్ల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో కొనసాగుతున్న పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైలును గిరిజన సంక్షేమ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేయడంతో ఆయా ఖాళీల భర్తీకి మార్గం సుగమమైంది. ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం ఐటీడీఏల పరిధిలో 320 గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు లక్ష మంది విద్యార్థులున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 2,825 పోస్టులుండగా... 601 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 563 ఉండగా... స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 38 ఉన్నాయి. ఇందులో పూర్తిగా ఏజెన్సీ పరిధిలో 241 పోస్టులుండగా.... మైదాన ప్రాంతాల్లో 360 పోస్టులున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ..: గిరిజన పాఠశాలల్లో ఖాళీలను గతంలో జిల్లా స్థాయిలో భర్తీ చేయగా ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశాలున్నాయి. టీఆర్టీ పద్ధతిలోనే పోస్టులను భర్తీ చేస్తా మని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. కేటగిరీ పోస్టులు ఎస్జీటీ 563 స్కూల్ అసిస్టెంట్ గణితం 1 ఫిజికల్ సైన్స్ 2 సోషల్ స్టడీస్ 1 పీఈటీ 5 క్రాఫ్ట్ 5 డ్రాయింగ్ 2 తెలుగు పండిట్ 18 హిందీ పండిట్ 4 -
కొత్త గురుకులాల్లో ‘కాంట్రాక్ట్’ బోధన
టీఎస్పీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి మరికొంత కాలం జాప్యం సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ప్రారంభించనున్న కొత్త గురుకుల విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులతో విద్యాబోధన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శాశ్వత ఉద్యోగులను నియమించేవరకు ఈ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది కొత్తగా 221 ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి, పరీక్షలు, ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించి టీచర్లను నియమించేప్పటికి కనీసం 3, 4 నెలల కాలం పట్టవచ్చని సంక్షేమ శాఖల అధికారులు అంచనా. ఈ నేపథ్యంలో జిల్లాలవారీగా గురుకుల పాఠశాలల అవసరాలకు అనుగుణంగా, ప్రిన్సిపాల్ పోస్టులు మొదలుకుని, ఆయా సబ్జెక్ట్ టీచర్ల వరకు విద్యార్హతలకు అనుగుణంగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. నెలాఖరులోగానే ఈ టీచర్ల ఎంపికను పూర్తి చేయనున్నారు. వంద ఎస్సీ, 71 మైనారిటీ, 50 ఎస్టీ గురుకుల పాఠశాలల్లో దాదాపు రెండున్నర వేల మంది టీచర్లు అవసరమవుతారని ఆయా శాఖల అధికారులు అంచనా వేశారు. జూలై 1 నుంచి తరగతులు...: వచ్చేనెల (జూలై) 1 వ తేదీ నుంచి కొత్తగురుకుల పాఠశాలల్లో తరగతులను మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరంలో ముందుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల స్కూళ్లలో 5, 6 తరగతులను ప్రారంభిస్తారు. అందుబాటులో ఉన్న సంక్షేమహాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, భవనాలు, ప్రైవేట్ భవనాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారని అధికారవర్గాల సమాచారం. కొంత ఆలస్యంగానే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల తరగతులు మొదలుకావొచ్చని అధికారులు చెబుతున్నారు. -
మే నెలలో టీచర్ల హేతుబద్ధీకరణ!
♦ కసరత్తు చేస్తున్న విద్యాశాఖ ♦ నెలాఖరుకల్లా ప్రక్రియను ముగించేందుకు ప్రణాళికలు ♦ ఆ తరువాతే టీచర్ల భర్తీకి చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈనెల చివరి వారంలో ప్రక్రియ ప్రారంభించి మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థుల్లేని స్కూళ్లను కొనసాగించడం విద్యాశాఖకు భారంగా మారింది. విద్యార్థులు తక్కువున్న స్కూళ్లలో ఎక్కువ టీచర్లు ఉండటం, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట తక్కువ మంది టీచర్లు ఉండటం నాణ్యమైన విద్యకు ప్రధాన ఆటంకంగా మారింది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అలాగే ఒక్కో గ్రామంలో ఉన్న ఐదారు స్కూళ్లను విలీనం చేసి, ఒకే స్కూల్‌ను కొనసాగించడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు, ఎక్కువ మంది టీచర్లను ఇచ్చి నాణ్యమైన విద్యా బోధన అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ఏర్పడే ఖాళీల సంఖ్యను బట్టి టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నా టీచర్లు లేరు.. విద్యార్థులు లేని చోట టీచర్లు ఉన్నారు. 4 వేల వరకు పాఠశాలల్లో 20 మందిలోపే విద్యార్థులు ఉండగా. వాటిల్లో అధిక సంఖ్యలో టీచర్లు ఉన్నారు. మరోవైపు ఒకే గ్రామంలో ఐదారు స్కూళ్లు కొనసాగతున్నవి వందల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో గ్రామంలో ఒక్కటే స్కూల్ ఉండేలా విధానాన్ని రూపొందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కాగా, పాఠశాలల హేతుబ ద్ధీకరణ చేస్తున్నారంటే చాలు కొంత మంది ఉపాధ్యాయులు తమ పోస్టులు ఎక్కడ పోతాయోనని తప్పుడు లెక్కలు చూపించడం పరిపాటిగా మారింది. దీంతో ఇలాంటి తప్పిదాలకు ఈసారి చెక్ పెట్టేలా ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. హేతుబద్ధీకరణ తరువాతే టీచర్ల భర్తీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు వచ్చే నాటికి టీచర్ల హేతుబద్ధీకరణను పూర్తి చేస్తామని, ఆ తరువాత ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 1న జరిగే టెట్ ఫలితాలను మే 10 -13 తేదీల మధ్య ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల హేతుబద్ధీకరణ తర్వాత ఏర్పడే ఖాళీల్లో టీచర్లను నియమించేందుకు అవసరమైన చర్యలను వేగంగా చేపట్టవచ్చని భావిస్తున్నారు. -
టీచర్ పోస్టుల్లో కోత
నెల్లూరు(విద్య) : ఎన్నికల హామీల్లో భాగంగా ఊరిస్తూ ఊరిస్తూ.. టెట్, టీఆర్టీ (డీఎస్సీ) షెడ్యూల్‌ను విడుదల చేశారు. పోస్టుల భర్తీలో రుణమాఫీ, పింఛన్లు పంపిణీలలో మెలికలు పెట్టినట్టే టీచర్ల భర్తీలోనూ బాబు మార్క్ మెలికను పెట్టారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మొత్తాన్ని రూ.1.5 లక్షకు కుదించడం, వృద్ధాప్య పింఛన్‌ను రూ. 1,000కి పెంచి ఆధార్లింక్ను పెట్టి లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం ఇలా ప్రతి వాగ్దానానికి మెలికపెట్టడం బాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీలో సైతం ఇదే తీరును అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుల భర్తీలో నోటిఫై చేసిన ఖాళీల్లో 20 శాతం తగ్గించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందినట్టు విశ్వసనీయ సమాచారం. ఆర్థికశాఖ ప్రమేయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని మొత్తం 416 పోస్టులు కాస్త 333కు తగ్గిపోయాయి. నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫీజులకు గడువు నిర్ణయించారు. మే 9, 10, 11 తేదీల్లో అర్హత పరీక్షలు నిర్వహించేలా ప్రకటించారు. అయితే ప్రభుత్వం నిర్ణయంతో రెండేళ్ల తర్వాత అర్హత పరీక్షకు నోటిఫికేషన్ వెలువడిన సంతోషంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ 20 శాతం కోత ప్రాతిపదికన చేశారో తెలియక అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు టీచర్ పోస్టుల్లో కోత విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారో ఇంతవరకు కచ్చితమైన లెక్కలు తేలలేదు. విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి ఉపాధ్యాయుల నియామకం ఉంటుంది. అయితే రేషనలైజేషన్, పని సర్దుబాటు ప్రక్రియలు జరగకపోవడంతో అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్య సైతం తెలియాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఏఏ పోస్టులను తగ్గించి ప్రతిపాదనలు పంపారో అర్థం కాని పరిస్థితి. ఉన్న ఖాళీలను యధాతథంగా జిల్లా నుంచి పంపారు. ఆర్థికశాఖ ఆదేశాలతో 20 శాతానికి కుదించిన జాబితాను సైతం పంపినట్లు సమాచారం. ఏఏ పోస్టులను ఎలా తగ్గించారో తెలియని పరిస్థితి. డీఎస్సీలో పోస్టుల కోతల విషయం జిల్లా అధికారులను సంప్రదించగా ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించి ప్రతిపాదనలు పంపామని, అంతకు మించి ప్రస్తుతం తమ దగ్గర సమాచారంలేదని చేతులు దులుపుకుంటున్నారు. బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టుల నుంచి మినహా ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయాలు అభ్యర్థులపాలిట శాపంగా మారాయి. సిలబస్, టెన్త్, ఇంటర్, చదవకుండా నేరుగా ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీ పూర్తి చేసి బీఈడీ చేసిన అభ్యర్థుల అర్హతపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల వాగ్దానాల అమలులో భాగంగా వాయిదాల మీద వాయిదా వేస్తూ ప్రతి హామీకి మెలికలు పెట్టడం టీడీపీ ప్రభుత్వానికి అలవాటై పోయిందని నిరుద్యోగ ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు.